ఇటీవల కాలంలో చిన్న సినిమాగా విడుదలై, బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన చిత్రాల్లో ‘బేబీ’ (Baby Movie) ఒకటి. జూలై 14న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా... వరల్డ్ వైడ్ గా రూ. 90 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి, కల్ట్ బ్లాక్‌ బస్టర్ గా నిలిచింది. బిగ్ స్క్రీన్ మీద ఎవరూ ఊహించని రేంజ్ లో పెరఫార్మ్ చేసిన ఈ మూవీ... ఇప్పుడు స్మాల్ స్క్రీన్ మీద అలరించడానికి రెడీ అవుతోంది. తాజాగా ఈ సినిమా డిజిటల్ అండ్ శాటిలైట్ స్ట్రీమింగ్ కు సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి. 


'ఆహా' డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ లో ‘బేబీ’ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఆగస్ట్ 25వ తేదీ నుంచి ఓటీటీలో అందుబాటులోకి తీసుకు రానున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో ఇప్పుడు శాటిలైట్ రైట్స్ కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే, బుల్లితెర ప్రేక్షుకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'బేబీ' మూవీ శాటిలైట్ హక్కులను ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ 'ఈటీవీ' సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. 


‘బేబీ’ మూవీ శాటిలైట్ రైట్స్ ను ఈటీవీ ఫ్యాన్సీ రేటుకు దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. కొత్త సినిమాల నాన్ థియేట్రికల్ హక్కులు కొనుగోలు చేసే విషయంలో ఈటీవీ - ఈటీవీ WIN కాస్త వెనుకంజలో ఉంటాయనే సంగతి తెలిసిందే. మామూలుగా తెలుగు చిత్రాల శాటిలైట్ హక్కుల కొనుగోలులో స్టార్ మా, జీ తెలుగు, జెమిని వంటి ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ మధ్యే ప్రధాన పోటీ ఉంటుంది. కానీ ఇప్పుడు ఈటీవీ మిగతా ఛానల్స్ తో పోటీ పడి మరీ 'బేబీ' హక్కులను చేజిక్కించుకుందని, దీని కోసం బాగానే ఖర్చు చేశారని సమాచారం అందుతోంది. 


'ఈటీవీ' ఎవరూ ఊహించని విధంగా ‘బేబీ’ లాంటి లేటెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా ప్రసార హక్కులు తీసుకొని మిగతా ఛానల్స్ కు షాక్ ఇచ్చిందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మీమ్స్ వైరల్ అవుతున్నాయి. ఇకపై కొత్త సినిమాల రైట్స్ విషయంలో ఈటీవీ కూడా ప్రధాన పోటీదారుగా మారబోతోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. గతంలో 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' సినిమా శాటిలైట్ హక్కులను కొనుగోలు చేసినప్పుడు కూడా నెట్టింట ఇలాంటి చర్చే జరిగింది. 


ఏదైతేనేం ఈ డికేడ్ లో కల్ట్ బొమ్మగా పేర్కొనబడుతున్న ‘బేబీ’ మూవీ ఈటీవీలోనే వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారం కానుంది. ఇప్పటికైతే యాజమాన్యం టీవీ ప్రీమియర్ తేదీని అధికారికంగా ప్రకటించలేదు. జెనరల్ గా కొత్త చిత్రాలు ఈటీవీలో ఆలస్యంగా ప్రసారం అవుతుంటాయి. ఈ మూవీ కూడా కాస్త లేట్ గానే రావొచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరి త్వరలోనే వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ పై క్లారిటీ ఇస్తారేమో చూడాలి. 


కాగా, 'మొదటి ప్రేమకు మరణం లేదు, మనసు పొరల్లో శాశ్వితంగా సమాధి చేయబడి ఉంటుంది' అనే లైన్ తో దర్శకుడు సాయి రాజేశ్ ‘బేబీ’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్యలు ప్రధాన పాత్రలు పోషించారు. మాస్ మూవీ మేకర్స్ పతాకంపై ఎస్ కే ఎన్, దర్శకుడు మారుతి సంయుక్తంగా నిర్మించారు. విజయ్ బుల్గేని అద్భుతమైన సంగీతం సమకూర్చారు. ఈ న్యూ ఏజ్ ట్రయాంగిల్ లవ్ స్టోరీకి యూత్ ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారని చెప్పాలి. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిసింది. మెగాస్టార్ చిరంజీవి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాస్ మహారాజా రవితేజ లాంటి అగ్ర హీరోలు సైతం ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించారు.


Also Read: రజినీకాంత్, అనిరుధ్ మధ్య ఉన్న 'బంధుత్వం' ఏంటో తెలుసా?



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial