ప్రస్తుతం మన టాలీవుడ్ హీరోలంతా పాన్ ఇండియా జపం చేస్తున్నారు. కేవలం ఒక్క తెలుగుకే పరిమితం అవ్వకుండా, మిగతా భాషల్లోనూ తమ సినిమాలను విడుదల చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. నేషనల్ వైడ్ పాపులారిటీ సంపాదించుకొని, మార్కెట్ విస్తరించుకోవాలని ఆరాట పడుతున్నారు. భాషా, ప్రాంతీయత అడ్డుగోడలు తొలగించిన దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి వేసిన బాటలో పయనిస్తున్నారు. ఇప్పటికే ముగ్గురు నలుగురు హీరోలు జాతీయ స్థాయిలో క్రేజ్ దక్కించుకోగా, మరికొందరు హీరోలు అదే ప్లాన్ తో ముందుకు సాగుతున్నారు. 


ప్రభాస్.. పాన్ ఇండియా హీరోగా స్థిరపడతాడా?


టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, 'బాహుబలి: ది బిగినింగ్' , 'బాహుబలి: ది కన్ క్లూజన్' వంటి చిత్రాలతో భారీ విజయాలు సొంతం చేసుకొని పాన్ ఇండియా స్టార్ గా మారిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో చేసిన 'సాహో' సినిమా తెలుగులో పెద్దగా ప్రభావం చూపనప్పటికీ, హిందీలో మాత్రం బాగా ఆడింది. 'రాధేశ్యామ్' మూవీ డిజాస్టర్ అయినప్పటికీ, డార్లింగ్ తన ఇమేజ్ ను కాపాడుకునేలా ప్రాజెక్ట్స్ సెట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఈ ఏడాది 'ఆదిపురుష్' 'సలార్' వంటి రెండు భారీ చిత్రాలతో పలకరించనున్న ప్రభాస్.. వచ్చే సంక్రాంతికి 'ప్రాజెక్ట్ K' వంటి పాన్ ఇంటర్నేషనల్ మూవీని తీసుకురానున్నట్లు ఇటీవల అధికారికంగా ప్రకటించారు. దీని తర్వాత 'రాజా డీలక్స్' పేరుతో ప్రచారంలో ఉన్న మారుతి చిత్రం.. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో 'స్పిరిట్' సినిమాలను ప్రభాస్ లైన్లో పెట్టాడు.


జోరు మీదున్న బన్నీ, చెర్రీ, తారక్


⦿ 'పుష్ప: ది రైజ్' సినిమాతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు దక్కించుకున్నారు. ఇప్పుడు 'పుష్ప: ది రూల్' చిత్రంపైనే ఫుల్ ఫోకస్ పెట్టిన బన్నీ.. తన క్రేజ్ ను మరింతగా విస్తరించుకునేలా ప్లాన్స్ చేసుకుంటున్నారు.


⦿ 'ఆర్.ఆర్.ఆర్' చిత్రంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ & మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరూ పాన్ ఇండియా క్రేజ్ దక్కించుకున్నారు. గ్లోబల్ ఆడియన్స్ దృష్టిని ఆకర్షించడమే కాదు, ఆస్కార్ అవార్డ్స్ కు కూడా నామినేట్ అయిన నేపథ్యంలో, ట్రిపుల్ ఆర్ హీరోల తదుపరి ప్రాజెక్ట్స్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చరణ్ ఇప్పటికే శంకర్ దర్శకత్వంలో RC15 అనే వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా చేస్తున్నారు.. అలానే బుచ్చిబాబుతో కలిసి ఓ పాన్ ఇండియా మూవీని అనౌన్స్ చేశారు. 


⦿ మరోవైపు తారక్ సైతం కొరటాల శివ డైరెక్షన్ లో NTR30 చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇదే క్రమంలో 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ తో NTR31 సినిమాని పట్టాలెక్కించనున్నారు. దీని తర్వాత ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ పాన్ వరల్డ్ మూవీ ఉంటుందని నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రకటించారు.


పవర్ స్టార్, రౌడీ బాయ్‌కు సెకండ్ ఛాన్స్ వస్తుందా?


⦿ ఇక రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ 'లైగర్' తో పాన్ ఇండియాని టార్గెట్ చేసి బొక్క బోర్లా పడ్డారు. అయినా సరే ఏమాత్రం వెనక్కి తగ్గకుండా మల్టీ లాంగ్వేజెస్ ప్రాజెక్ట్స్ ని సెట్ చేసుకుంటున్నారు. 


⦿ అప్పుడెప్పుడో 'సర్ధార్ గబ్బర్ సింగ్' సినిమాతో పాన్ ఇండియాలో విఫలమైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఇప్పుడు 'హరి హర వీరమల్లు' చిత్రంతో మళ్లీ నేషనల్ వైడ్ ఫోకస్ చేయబోతున్నారు.


⦿ 'సైరా నరసింహా రెడ్డి' చిత్రాన్ని అన్ని ప్రధాన భాషల్లో విడుదల చేసిన మెగాస్టార్ చిరంజీవి.. 'గాడ్ ఫాదర్' మూవీని హిందీ ప్రేక్షకులకు అందించిన సంగతి తెలిసిందే.


⦿ 'కార్తికేయ 2' చిత్రంతో నార్త్ ఆడియన్స్ అందరి దృష్టిని ఆకర్షించిన నిఖిల్ సిద్ధార్థ్.. 'స్పై' అనే పాన్ ఇండియాని రెడీ చేస్తున్నారు.


⦿ ఈ మధ్య యువ హీరో సందీప్ కిషన్ సైతం 'మైఖేల్' అనే పాన్ ఇండియా మూవీతో వచ్చారు. అయితే, పెద్దగా సక్సెస్ కాలేదు. 


⦿ మాస్ మహారాజా రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు'.. నేచురల్ స్టార్ నాని నటించిన 'దసరా' చిత్రాలను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.


⦿ యూత్ కింగ్ అక్కినేని అఖిల్ నటిస్తున్న 'ఏజెంట్' సినిమాని తెలుగు తమిళ మలయాళ హిందీ భాషల్లో తీసుకొస్తున్నారు.


⦿ ఉస్తాద్ రామ్ పోతినేని - డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో ఓ పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతోంది. 


⦿ నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న 'డెవిల్' చిత్రాన్ని మల్టీ లాంగ్వేజెస్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.


⦿ ఇప్పటి వరకూ పాన్ ఇండియా జోలికి వెళ్లని సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం రాజమౌళి సినిమాతో అదే బాటలో వెళ్లనున్నారు.


ఇలా అనేక మంది టాలీవుడ్ హీరోలు పాన్ ఇండియా స్టార్ డమ్ కోసం ట్రై చేస్తున్నారు. మరి వీరిలో ఎవరెవరు 'పాన్ ఇండియా స్టార్స్' గా స్థిరపడిపోతారో చూడాలి.