టాలీవుడ్ లో ఇప్పుడు స్టార్ డైరెక్టర్స్ నుంచి కుర్ర దర్శకుల వరకూ అందరూ బాగా బిజీగా ఉన్నారు. ఒక సినిమా కంప్లీట్ అయిన వెంటనే మరో ప్రాజెక్ట్ ని సెట్ చేసుకుంటున్నారు. వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాను. అయితే కొందరు దర్శకులు మాత్రం హిట్టు కొట్టి కూడా సైలెంట్ గా ఉంటున్నారు. తమ తదుపరి సినిమాల విషయంలో ఎలాంటి ప్రకటన చేయకుండా కాలయాపన చేస్తున్నారు.  


పవర్ స్టార్ స్టార్ పవన్ కళ్యాణ్ తో "వకీల్ సాబ్" సినిమాని తెరకెక్కించి మంచి విజయాన్ని అందుకున్నారు డైరక్టర్ వేణు శ్రీరామ్. పాండమిక్ కారణంగా ఆశించిన స్థాయిలో వసూళ్ళు రానప్పటికీ వేణుకి మాత్రం మంచి పేరొచ్చింది. అయితే ఈ సినిమా వచ్చి దాదాపు రెండేళ్లు కావొస్తున్నా, ఇంతవరకూ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.


నిజానికి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో వేణు శ్రీరామ్ "ఐకాన్: కనబడుట లేదు" అనే సినిమా చేయాల్సి వుంది. అయితే వివిధ కారణాలలో ఈ ప్రాజెక్టు హోల్డ్ లో పడింది. 'వకీల్ సాబ్' తర్వాత ఆ చిత్రాన్ని సెట్స్ మీదకి తీసుకెళ్లడానికి ప్రయత్నాలు చేశారు కానీ, వర్కౌట్ కాలేదు. భవిష్యత్ లో అసలు ఆ ఐకాన్ ఉంటుందో లేదో కూడా చెప్పలేం.


ఇలాంటి పరిస్థితుల్లో వేణు శ్రీరామ్ కథ కోసం "తమ్ముడు" అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించారు నిర్మాత దిల్ రాజు. ఇది అఖిల్ అక్కినేనితో తీస్తారని అప్పట్లో రూమర్స్ వచ్చాయి. కానీ నిజం లేదు. ఇటీవల హీరో నాని ని ఒప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని వార్తలు వచ్చాయి. ఇలా అనేక రూమర్స్ తో రోజులు గడుస్తున్నాయి కానీ, వేణు శ్రీరామ్ నుంచి కొత్త సినిమా కబురు మాత్రం రావడం లేదు.


వేణు శ్రీరామ్ మాదిరిగానే డైరెక్టర్ సాగర్ కె చంద్ర నెక్స్ట్ సినిమా విషయంలో కూడా క్లారిటీ రావడం లేదు. పవన్ కళ్యాణ్ తో "భీమ్లా నాయక్" వంటి సక్సెస్ ఫుల్ మూవీ తీసిన సాగర్.. నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకూ కొత్త ప్రాజెక్ట్ ని ప్రకటించలేదు. 14 రీల్స్ బ్యానర్ లో ఓ సినిమా కమిటైనట్లు వార్తలు వచ్చాయి. వరుణ్ తేజ్ తో చేస్తాడని, నితిన్ తో సినిమా ఉంటుందని ఇలా అనేక రూమర్స్ వినిపించాయి. కానీ అధికారిక ప్రకటనైతే లేదు.


ఇక "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్" వంటి సినిమా తీసి అఖిల్ అక్కినేని కి ఫస్ట్ హిట్ రుచి చూపించారు బొమ్మరిల్లు భాస్కర్. ఈ మూవీ వచ్చి ఏడాదిన్న కావస్తున్నా టాలెంటెడ్ డైరెక్టర్ ఇంతవరకూ తదుపరి చిత్రాన్ని అనౌన్స్ చేయలేదు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అక్కినేని నాగ చైతన్యతో సినిమా ఉంటుందని ఆ మధ్య టాక్ వచ్చింది. ఆ తర్వాత అల్లు శిరీష్ తో చేస్తారని కూడా అన్నారు. కానీ ఇప్పటి దాకా ఏదీ అఫిషియల్ గా చెప్పలేదు.


ఇలా హిట్టు కొట్టి సక్సెస్ ఫుల్ డైరెక్టర్స్ అనిపించుకున్న ఈ ముగ్గురు టాలీవుడ్ దర్శకులు తమ కొత్త సినిమాల కబురు అందించడం లేదు. మంచి టాలెంట్ ఉన్న డైరెక్టర్లు ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా.. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేయాలని సినీ అభిమానులు ఆశిస్తున్నారు. మరి వీరు త్వరలోనే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి క్లారిటీ ఇస్తారేమో వేచి చూడాలి.