నందమూరి తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్టు పెట్టారు. తమ జీవితం పూల బాట కదని, కార్లలో నిద్ర పోయిన రోజులు కూడా ఉన్నాయని అలేఖ్య తన పోస్టులో పేర్కొన్నారు. తమను తారకరత్న ప్రేమించినంతగా ఎవ్వరూ ప్రేమించలేదని అందులో రాశారు.


అలేఖ్య రెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో ‘మనం కలిసి ఉండటానికి పోరాడాం. చివరి వరకు పోరాడుతూనే ఉన్నాం. మనం అంత సులభమైన జీవితం బతకలేదు. కార్లలో నిద్ర పోయిన రోజుల నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే మనం చాలా దూరం ప్రయాణించాం. నువ్వొక యోధుడివి. మమ్మల్ని నువ్వు ప్రేమించినట్లు ఎవరూ ప్రేమించలేదు.’ అని పేర్కొన్నారు. తారకరత్న చేతిని తాను పట్టుకున్న ఫొటోను కూడా షేర్ చేశారు.






నందమూరి తారకరత్న (Nandamuri Taraka Ratna) ఫిబ్రవరి 18వ తేదీన బెంగళూరులో ఆయన తుదిశ్వాస విడిచారు. సుమారు 22 రోజుల పాటు ఆయన ప్రాణాలతో పోరాటం చేశారు. తారకరత్నను రక్షించడం కోసం ఎంతో అనుభవం ఉన్న వైద్య బృందం శక్తి వంచన లేకుండా తీవ్రంగా శ్రమించింది. నందమూరి, నారా ఫ్యామిలీలు తమ కుటుంబ సభ్యుడి ప్రాణం కాపాడటం కోసం చేయని ప్రయత్నం లేదు. అయితే, విధి ఆయన్ను పై లోకాలకు తీసుకు వెళ్ళింది
 
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావుకు తారకరత్న స్వయానా మనవడు. ఎన్టీఆర్ కుమారుడు మోహనకృష్ణ కుమారుడు. ఆయన వయసు 39 సంవత్సరాలు మాత్రమే. చిన్న వయసులో తిరిగిరాని లోకాలకు తారకరత్న వెళ్ళిపోవడం నందమూరి అభిమానులను, తెలుగు దేశం పార్టీ శ్రేణులను తీవ్రంగా కలచివేస్తోంది.


ప్రతినాయకుడిగా తొలి సినిమాతో నంది
తాతయ్య ఎన్టీఆర్ నట వారసత్వం అందుకుని 2002లో తారక రత్న చిత్రసీమలోకి వచ్చారు. కథానాయకుడిగా కొన్ని సినిమాలు చేశారు. అయితే, ఆశించిన రీతిలో ఆయన విజయాలు అందుకోలేదు. ప్రతినాయకుడిగా తొలి చిత్రం 'అమరావతి'తో  రాష్ట్ర పురస్కారం నంది అందుకున్నారు. సినిమాల ఎంపికలో ఆయన ఆచితూచి వ్యవహరించేవారు. గత ఏడాది డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో విడుదలైన వెబ్ సిరీస్ '9 అవర్స్'లో సీఐ రోల్ చేశారు. హీరోగా 'ఒకటో నంబర్ కుర్రాడు', 'యువ రత్న', 'భద్రాద్రి రాముడు', 'నందీశ్వరుడు' తదితర చిత్రాలు చేశారు. అయితే, ఇటీవల నటన కంటే ఎక్కువ రాజకీయాలపై దృష్టి పెట్టారు. 


తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన 'యువ గళం' పాదయాత్రలో పాల్గొనడానికి జనవరి 27న తారకరత్న కుప్పం వెళ్ళారు. అక్కడ లక్ష్మీపురంలో గల మసీదులో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో లోకేష్‌ (Nara Lokesh) తో పాటు నందమూరి బాలకృష్ణతో పాటూ ఆయన కూడా పాల్గొన్నారు. మసీదు నుంచి త్వరగా బయటకు వచ్చిన తారకరత్న... ఒక్కసారిగా కింద పడిపోయారు. చుట్టుపక్కల తెలుగు దేశం పార్టీ శ్రేణులు వెంటనే కుప్పంలో కేసీ ఆస్పత్రికి తీసుకు వెళ్ళారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం పీఈఎస్‌ మెడికల్‌ కాలేజీకి తరలించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం అదే రోజు అర్ధరాత్రి బెంగళూరులోని నారాయణ హృదయాలయకు తీసుకు వెళ్ళారు.