Adipurush 1st Week Collections : భారీ అంచనాల మధ్య గత వారం, జూన్ 16న థియేటర్లలో విడుదలైన ప్రభాస్ 'ఆదిపురుష్' బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. వీకెండ్ తర్వాత అన్ని ప్రాంతాలలో ఈ చిత్రం భారీ డ్రాప్‌ను సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మొదటి వారంలో దాదాపు రూ.76 కోట్ల షేర్ వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా తెలుగు వెర్షన్ థియేట్రికల్ విలువ రూ.150 కోట్లు. తెలుగు వెర్షన్ 'ఆదిపురుష్' మొదటి వారం కలెక్ట్ చేసిన షేర్ దాదాపు రూ.98 కోట్లు.


'ఆదిపురుష్' హిందీలో భారతదేశంలో రూ. 121 కోట్ల నెట్‌ని వసూలు చేసింది. ఓవరాల్‌గా ఈ చిత్రం అన్ని భాషలతో కలిపి ప్రపంచవ్యాప్తంగా రూ.315 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. ఏది ఏమైనా ‘ఆదిపురుష్’ రిలీజ్ రోజు, గత వారాంతంలో వసూళ్లు చేసిన కలెక్షన్స్‌తో పోల్చితే.. సోమవారం నుంచి గురువారం వరకు లభించిన వసూళ్లు చాలా తక్కువగా ఉన్నాయి. ఇది ఒకింత నిర్మాతలకు ఆందోళన కలిగించే విషయమే. ఈ నేపథ్యంలో ఈ వారాంతంపైనే నిర్మాతలు ఆశలు పెట్టుకున్నారు.


ఓం రౌత్ దర్శకత్వం వహించిన 'ఆదిపురుష్'లో లార్డ్ రామ్/రాఘవగా ప్రభాస్, జానకి/సీతగా కృతి సనన్, రావణ్/లంకేశ్‌గా సైఫ్ అలీ ఖాన్, లక్ష్మణ్/శేషుగా సన్నీ సింగ్, లార్డ్ హనుమాన్/బజరంగ్ పాత్రలో దేవ దత్తా నాగే నటించారు. అజయ్-అతుల్, సచేత్ పరంపర ఈ చిత్రానికి సంగీత దర్శకులుగా వ్యవహరించారు. 


'ఆదిపురుష్‌'ను భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రెట్రోఫైల్స్‌కు చెందిన రాజేష్ నాయర్ భారీ స్థాయిలో నిర్మించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చింది. ఈ చిత్రం సేఫ్ జోన్‌లో ఉండటానికి బాక్సాఫీస్ వద్ద స్థిరమైన రన్ అవసరం, ప్రారంభంలో దూకుడు ప్రదర్శించినా.. సోమవారం నుంచి మాత్రం కలెక్షన్లు ఒక్కసారిగా పడిపోయాయి. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో పరిస్థితి ఘోరంగా ఉంది. దీంతో నిర్మాతలు టికెట్లపై ఆఫర్స్ కూడా ప్రకటించారు.


'ఆదిపురుష్'పై సుమన్ కామెంట్స్..


సీనియర్ హీరో సుమన్ 'ఆదిపురుష్' పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "రావణుడు సీతను ఎత్తుకుపోవడం నుంచి ఆమెను రక్షించడం వరకు మాత్రమే ఈ సినిమాని తీశారు. రామాయణం మొత్తాన్ని చూపించారని చాలా మంది అనుకున్నారు. కాబట్టి ఈ విషయంలో కొంతమందిని ఈ సినిమా నిరుత్సాహ పర్చింది. మనం చిన్నప్పటినుండి సినిమాల్లో రాముడిని నీలిరంగులో మాత్రమే చూశాం. అలాగే అప్పటి సినిమాల్లో నందమూరి తారక రామారావు గారిని కూడా బ్లూ కలర్ మేకప్ తో, మీసాలు, గడ్డం లేకుండానే చూశాం. కానీ కానీ ఇందులో రాముడిని చాలా సాధారణంగా చూపించారు.. అది చాలా పెద్ద రిస్క్.. అయినా రెండున్నర ఏళ్ల పాటు ప్రభాస్ ఆ బాడీని మెయింటైన్ చేయడం అనేది అంత తేలికైన విషయం కాదు. అందుకు ఆయనకి హ్యాండ్సాఫ్ చెప్పాలి. ఇక రావణుడికి మోడ్రన్ హెయిర్ కట్ చేశారు. వేషధారణ కూడా చాలా మార్చారు. అది చాలా పెద్ద తప్పు. ఇలా డైరెక్టర్ చేసిన కొన్ని ప్రయోగాలు సినిమాలో ఇబ్బందికరంగా అనిపించాయి.  అంతేకాదు కొన్ని చోట్ల గ్రాఫిక్స్ చాలా బాగున్నాయి.. ఇక మరికొన్ని చోట్ల మాత్రం గ్రాఫిక్స్ చాలా పాతవి లాగా కనిపించాయని" సుమన్ చెప్పుకొచ్చారు.


Read Also : Titanic Submarine Missing: భూమి మీద అత్యంత క్రూరమైన ప్రదేశం అదే - ‘టైటానిక్’ సబ్‌మెరిన్ విషాదంపై జేమ్స్ కామెరాన్ కామెంట్స్


Join Us on Telegram: https://t.me/abpdesamofficial