మాస్... 'సుడిగాలి' సుధీర్ మాస్... 'కాలింగ్ సహస్ర' సినిమా టీజర్ చూస్తే ముందు ఫీల్ అయ్యేది అదే! ఎందుకంటే... బుల్లితెరపై సుధీర్ నవ్వించడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. 'ఎక్స్ట్రా జబర్దస్త్', 'ఢీ', 'శ్రీదేవి డ్రామా కంపెనీ' ప్రోగ్రామ్స్‌లో ఆయన చేసే స్కిట్స్, యాంకరింగ్ ఆడియ‌న్స్‌కు ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ అందిస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. వెండితెరపై ఇప్పటి వరకూ సుధీర్ చేసిన పాత్రలు, హీరోగా చేసిన సినిమాలు కూడా కామెడీ నేపథ్యంలో సాగాయి. అయితే... 'కాలింగ్ సహస్ర'తో ఆయన రూట్ మార్చినట్టు ఉన్నారు.


ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ అంటే జస్ట్ కామెడీ మాత్రమే కాదు... యాక్షన్‌తో ప్రేక్షకుల్ని అలరించడం కూడా ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ కిందకు వస్తుంది. 'కాలింగ్ సహస్ర' టీజర్ చూస్తే... ప్రారంభంలో 'బ్రతకడం కోసం చంపడం సృష్టి ధర్మం. మరి, చంపడం తప్పు కానప్పుడు, దాన్ని చూపించడం తప్పు ఎలా అవుతుంది?' అనే డైలాగ్ వినిపిస్తుంది. ఓ అమ్మాయిని కిరాతకంగా చంపుతూ... వీడియో తీయడాన్ని చూపించారు. ఆ తర్వాత సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ పాత్రలో 'సుడిగాలి' సుధీర్‌ను పరిచయం చేశారు. మాస్ హీరోకి ఏమాత్రం తీసి పోనీ రీతిలో ఆయనతో ఫైట్స్ చేయించారు.


కొత్త సిమ్ కార్డు తీసుకున్న హీరో జీవితంలో ఊహించని ఘటనలు జరగడం, వాటి నుంచి హీరో ఎలా బయట పడ్డాడనేది కథగా తెలుస్తోంది. 'చావు అంటే కేవలం ప్రాణం పోవడం కాదురా. మన కళ్ళ ముందు మన ప్రేమించిన వాళ్ళు పోవడం' అని శివబాలాజీ చెప్పే డైలాగ్, తెరపై కనిపించే విజువల్ చూస్తే... హీరో ముందు అతడు ప్రేమించిన అమ్మాయిని ఎవరో బలంగా రాడ్డుతో కొట్టారని అర్థం అవుతుంది.


Also Read: 'మిషన్ ఇంపాజిబుల్' రివ్యూ: తాప్సీ పన్ను నటించిన ఈ సినిమా ఎలా ఉంది? మెగాస్టార్ చిరంజీవి చెప్పినట్టే ఉందా?


'కాలింగ్ సహస్ర' సినిమాలో శివ బాలాజీ ప్రధాన పాత్రలో నటించగా... డాలీ షా కథానాయికగా నటించారు. అర్జున్ విక్కిరాల దర్శకత్వం వహించారు. విజేష్ తయాల్, కాటూరి వెంకటేశ్వర్లు, పమిడి చిరంజీవి నిర్మించారు. త్వరలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 


Also Read: 'ఆర్ఆర్ఆర్' పోస్టులు ఎందుకు డిలీట్ చేశానంటే? - ఆలియా భట్ వివరణ