Vyuham Trailer: గత కొంతకాలంగా పొలిటికల్ జోనర్‌లో సినిమాలు తెరకెక్కిస్తూ.. రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు, రాజకీయ నాయకుల పరిస్థితి ఎలా ఉందని చెప్తూ.. కాంట్రవర్సీలు క్రియేట్ చేస్తున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. అందుకే మరో పొలిటికల్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు ఈ కాంట్రవర్షియల్ డైరెక్టర్. తన అప్‌కమింగ్ మూవీ ‘వ్యూహం’తో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిస్థితులు ఏ విధంగా మారాయి అని చూపించే ప్రయత్నం చేస్తున్నాడు వర్మ. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన టీజర్స్, ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. తాజాగా ‘వ్యూహం’ రెండో ట్రైలర్‌ను కూడా విడుదలయ్యింది.


అదే రెండు ట్రైలర్స్‌కు తేడా..
‘‘ఇంతకాలం మిమ్మల్ని పైకి రానివ్వకుండా తొక్కేసిన మనిషి పైకే పోయాడు’’ అని వైఎస్ మరణ వార్తకు సంబంధించిన డైలాగ్‌తో ‘వ్యూహం’ రెండో ట్రైలర్ మొదలయ్యింది. ఈ సినిమా మొదటి ట్రైలర్‌లో చంద్రబాబుపై, జగన్ పాదయాత్రపై, పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఎంట్రీపై ఎక్కువ ఫోకస్ పెట్టిన వర్మ.. రెండో ట్రైలర్‌లో మాత్రం జగన్ పాదయాత్రతో పాటు ఓదార్పు యాత్ర గురించి, పవన్ కళ్యాణ్ పార్టీ పట్టుదల గురించి చూపించాడు. అంతే కాకుండా ఈ ‘వ్యూహం’ రెండో ట్రైలర్‌లో చిరంజీవి పాత్రను కూడా యాడ్ చేశాడు. దీంతో ట్రైలర్ మరింత ఇంట్రెస్టింగ్‌గా మారింది.


ట్రైలర్‌లో చిరంజీవి, పవన్ కళ్యాణ్..
‘వ్యూహం’ రెండో ట్రైలర్‌లో రామ్ గోపాల్ వర్మ స్వయంగా పాడిన ‘ఏడవకండి’ పాటను కూడా యాడ్ చేశారు. ఆ పాట బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతూ ఉండగా జగన్.. తన ఓదార్పు యాత్ర కొనసాగిస్తున్నాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్‌ను రాజకీయాల్లోకి వద్దని చిరంజీవి హెచ్చరించినా.. తను వినకుండా ఉన్న విషయాన్ని కూడా ఈ ట్రైలర్‌లో చూపించారు. ‘‘క్షవరం అయితే కానీ వివరం తెలియదని ఊరికే అనలేదు పెద్దలు’’ అని పవన్ కళ్యాణ్ పెట్టే పార్టీ గురించి చిరంజీవి వ్యాఖ్యలు చేసినట్టుగా ట్రైలర్‌లో ఉంది. కాంట్రవర్సీలకు భయపడని రామ్ గోపాల్ వర్మ.. మరోసారి ఈ ‘వ్యూహం’ సినిమాతో ఎన్నో కాంట్రవర్సీలను క్రియేట్ చేయనున్నట్టుగా ట్రైలర్స్ చూస్తుంటే తెలుస్తోంది.


వారే జోకర్లు..
‘వ్యూహం’ ట్రైలర్స్‌ను బట్టి సినిమాలో వైఎస్ జగన్ పాత్రను పాజిటివ్‌గా చూపించే ప్రయత్నం చేశారు. ఇక పవన్ కళ్యాణ్, చంద్రబాబు పాత్రలను కాస్త వ్యంగ్యంగా చూపించినట్టు తెలుస్తోంది. డిసెంబర్ చివర్లో పలు తెలుగు సినిమాలు విడుదల ఉన్నా కూడా.. తన సినిమాపై నమ్మకంతో డిసెంబర్ 29న ‘వ్యూహం’ను విడుదలకు సిద్ధం చేశాడు వర్మ. ‘జోక్ అర్థం కానివారు జోకర్లు’ అనే క్యాప్షన్‌తో ‘వ్యూహం’ సెకండ్ ట్రైలర్‌ను ట్విటర్ ద్వారా విడుదల చేశాడు. ఈ సినిమాలో వైఎస్ జగన్ పాత్రలో నటించిన అజ్మల్ అమీర్.. ఇందులో కూడా అదే పాత్ర చేస్తున్నాడు. తన భార్య భారతి పాత్రలో మానసా రాధాకృష్ణన్ కనిపించనుంది. ఇతర ముఖ్య పాత్రల్లో ధనుంజయ్  ప్రభూనే, సురభి ప్రభావతి, రేఖా నిరోషా, వాసు ఇంటూరి, కోటా జయరామ్, ఎలినా నటించారు. ఇక ఈ చిత్రాన్ని దాసరి కిరణ్ కుమార్ నిర్మించారు. ఆర్జీవీ తెరకెక్కించిన ‘వ్యూహం’ కచ్చితంగా ఏపీ పాలిటిక్స్‌పై ప్రభావం చూపిస్తుందని ప్రేక్షకులు భావిస్తున్నారు.






Also Read: ‘హాయ్ నాన్న’పై శ్రీలీల రివ్యూ - నిన్ను చూస్తే గర్వంగా ఉందంటూ మృణాల్ రెస్పాన్స్