ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం, ఆ తర్వాత జరిగిన పరిస్థితుల నేపథ్యంలో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న సినిమా 'వ్యూహం' (Vyooham Movie). అతి త్వరలో సినిమా విడుదల కానుంది. ఈ రోజు టీజర్ విడుదల చేశారు.
వర్మ 'వ్యూహం'లో ఏముంది?
'వ్యూహం' ప్రారంభమే వైఎస్ రాజశేఖర్ రెడ్డిని చూపించారు రామ్ గోపాల్ వర్మ. ముఖ్యమంత్రి హోదాలో మరణానికి ముందు చేసిన హెలికాప్టర్ విజువల్స్ ఉపయోగించారు. వైయస్సార్ మరణం, ఆ తర్వాత వైయస్సార్ తనయుడు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిపై సీబీఐ కేసులు పెట్టడం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపనకు దారి తీసిన పరిస్థితులను 'వ్యూహం'లో చూపించనున్నారని టీజర్ చూస్తే అర్థం అవుతోంది.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి, జగన్ మోహన్ రెడ్డికి మేలు చేసే విధంగా రామ్ గోపాల్ వర్మ సినిమాలు తీస్తారని ముద్ర పడింది.
చంద్రబాబుకు వ్యతిరేకంగా ఆయన సినిమాలు ఉంటాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 'వ్యూహం' టీజర్ చివరి డైలాగుల్లో కూడా చంద్రబాబు ప్రస్తావన ఉంది. 'అలా ఆలోచించడానికి చంద్రబాబును కాదు' అని జగన్ పాత్రధారి చేత డైలాగ్ చెప్పించారు. 'వ్యూహం' సినిమాలో జగన్ మోహన్ రెడ్డి పాత్రలో తమిళ నటుడు, 'రంగం' ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన అజ్మల్ నటిస్తున్నారు. ఆయన జోడీగా భారతి పాత్రలో మానస నటిస్తున్నారు. శ్రీ రామదూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్‌కుమార్ నిర్మిస్తున్న చిత్రమిది.
'వ్యూహం' రియల్ సినిమా - వర్మ
'వ్యూహం' బయోపిక్ కాదని రామ్ గోపాల్ వర్మ చెబుతున్నారు. బయోపిక్ కంటే చాలా లోతైన రియల్ సినిమా అంటున్నారు. ఇందులో (వ్యూహం సినిమాలో) నూటికి నూరు పాళ్లు నిజాలే ఉంటాయని గతంలో కూడా ఓ సందర్భంలో ఆర్జీవీ తెలిపారు. మామూలుగా ఆర్జీవి ఏం చేసినా ట్రెండ్ అవుతుంది. అందులోనూ రాజకీయాలతో ముడి పడిన కామెంట్స్ చేయడం, రాజకీయాలపై సినిమాలు తీయడం వర్మకు వెన్నతో పెట్టిన విద్య.
Also Read : నాలుగు వందల కోట్లతో పవన్ కళ్యాణ్ సినిమా - ఒక్కొక్కరూ చెప్పేది వింటుంటే?
గతంలో రామ్ గోపాల్ వర్మ తీసిన రాజకీయ నేపథ్య చిత్రాలు నవ్యాంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో వాడి వేడి చర్చలకు దారి తీశాయి. ఇప్పుడీ 'వ్యూహం' టీజర్ కూడా యూట్యూబ్, డిజిటల్ మీడియాలో ట్రెండ్ అయ్యేలా ఉంది.
తాడేపల్లిలో సీఎంను కలిసిన వర్మ
'వ్యూహం' సినిమాకు ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అండదండలు పుష్కలంగా ఉన్నాయని ప్రజల్లో కొందరు కామెంట్ చేస్తున్నారు. ఇటీవల తాడేపల్లి వెళ్లి మరీ జగన్ రెడ్డిని వర్మ కలిసి రావడం ఆ వ్యాఖ్యలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. సినిమా విడుదల సమయంలో ఈ సినిమా మీద ఇంకెన్ని కామెంట్స్ వస్తాయో చూడాలి.
సాధారణంగా తనపై ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ 'డోంట్ కేర్' అన్నట్లు రామ్ గోపాల్ వర్మ వ్యవహరిస్తూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. తనకు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని చెబుతారు. మరి, ఈ సినిమా గురించి ఏం చెబుతారో చూడాలి. ఈ సినిమా విడుదల తేదీ గురించి చాలా మంది ఎదురు చూస్తున్నారు.
Also Read : డ్రగ్స్ కేసుతో సంబంధం లేదంటున్న అషు రెడ్డి - ఫోన్ నంబర్ బయట పెట్టొద్దని వార్నింగ్!