ఒక సినిమాకు ‘ఏ’ సర్టిఫికెట్ వచ్చిందంటే.. ఆడియన్స్ దానిని చూసే దృక్ఫథమే మారిపోతుంది. ప్రస్తుతం అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన ‘ఓఎమ్‌జీ 2’కి కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. సెన్సార్ బోర్డ్.. ఈ చిత్రానికి క్లీన్ ఏ సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత అదేంటి? అని చాలామంది ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. దీనిపై మూవీ టీమ్ మాత్రం పెద్దగా స్పందించడానికి ముందుకు రాలేదు. సెన్సార్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ)లో ఒక మెంబర్ అయిన దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి మాత్రం దీనిపై తన అభిప్రాయాన్ని బయటపెట్టాడు. ఈ నిర్ణయం అనేది సీబీఎఫ్‌సీపై మతపరంగా వచ్చిన ఒత్తిడి వల్లే తీసుకోవాల్సి వచ్చిందని స్టేట్‌మెంట్ ఇచ్చాడు. తమ నిర్ణయాన్ని తాము సమర్థించుకోవడం లేదు కానీ.. జరిగింది మాత్రం అదే అని చెప్తున్నాడు వివేక్ అగ్నిహోత్రి.
‘కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్ ఫైర్..
‘కశ్మీర్ ఫైల్స్’ లాంటి సెన్సేషనల్ సినిమాను తెరకెక్కించిన వివేక్ అగ్నిహోత్రి.. అటు తను పనిచేస్తున్న సీబీఎఫ్‌సీ నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకించకుండా ‘ఓఎమ్‌జీ 2’కి ఏ సర్టిఫికెట్ ఇవ్వడంపై స్పందించాడు. తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో తను ఇంకా సినిమా చూడలేదని, రివ్యూ కమిటీలో తను భాగం కాదని స్పష్టం చేశాడు వివేక్. ‘ఓఎమ్‌జీ 2’లో అనేక మార్పులు చెప్పి, ఏ సర్టిఫికెట్ ఇచ్చిన సీబీఎఫ్‌సీ బోర్డ్ లిస్ట్‌లో తను లేనని క్లారిటీ ఇచ్చాడు. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ శివుడి పాత్ర పోషించాడు. కానీ సెన్సార్.. సినిమాను చూసిన తర్వాత ఈ పాత్రను మెసెంజర్ ఆఫ్ గాడ్‌గా మార్చేశారు. అయితే దీనిని ఎలా సమర్ధిస్తారు అనే ప్రశ్న వివేక్‌కు ఎదురయ్యింది. ‘‘లేదు నేను దానిని సమర్ధించను. నేను దానికి అసలు ఒప్పుకోను. నేను సీబీఎఫ్‌సీలో భాగం అయినా కూడా దానికి పూర్తిగా వ్యతిరేకిని కాదు. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడంపై సీబీఎఫ్‌సీపై కూడా ఒత్తిడి ఉంటుంది’’ అని వివేక్ చెప్పుకొచ్చాడు.
27 కట్స్ అంటే దారుణం..
‘సీబీఎఫ్‌సీపై ఎలాంటి ఒత్తిడి ఉండకూడదు. కానీ ఇప్పుడు ఏదైతే జరుగుతుందో.. అదంతా సమాజం నుంచి మతపరంగా వస్తున్న ఒత్తిడి వల్లే జరుగుతోంది. అందరికీ సీబీఎఫ్‌సీ అనేది ఎలా పనిచేస్తుందో అర్థమయ్యింది. దానిపై ఒత్తిడి పెడితే.. ఏదైనా చేస్తుందని అనుకుంటున్నారు. అసలు ఒక సినిమాలో ఇన్ని కట్స్ ఏంటి అని నాకే అర్థం కావడం లేదు. 27 కట్స్ అంటే మీరు ఎవరు అది డిసైడ్ చేయడానికి.’ అంటూ కాస్త ఘాటుగానే స్పందించాడు వివేక్. అసలు సినిమాలకు సెన్సార్‌షిప్ అనేది ఎందుకు ఉంటుంది అని ప్రశ్నిస్తూ.. అసలు సీబీఎఫ్‌సీ లాంటిది ఉండకూడదు అని తన అభిప్రాయాన్ని ఓపెన్‌గా చెప్పాడు.
ప్రేక్షకులను ఆలోచించుకోనివ్వండి..
‘నేను నిరసనలు, సినిమా బ్యాన్ లాంటి వాటికి వ్యతిరేకిని. నేను స్వేచ్ఛగా మాట్లాడడాన్ని నమ్ముతాను. వారు తప్పుగా మాట్లాడినా కూడా అనిపించి మాట్లాడుతున్నారు కదా అని ఆలోచిస్తాను. ప్రేక్షకులు తెలివైన వారు. వారే సినిమాను చూడాలి, అర్థం చేసుకోవాలి. మీరు సినిమాలోని ప్రతీ అంశాన్ని వారి వరకు చేరకుండా ఆపితే.. మరి ప్రేక్షకులను మరింత తెలివిగా ఆలోచించే స్వేచ్ఛను అందించనట్టే కదా.. ఒకవేళ ఒక ఫిల్మ్ మేకర్ ఇంటెన్షన్ తప్పుగా లేకపోతే.. వదిలేయొచ్చు కదా..’ అని ‘ఓఎమ్‌జీ 2’పై సెన్సార్ ప్రవర్తనను పూర్తిగా ఖండించాడు వివేక్ అగ్నిహోత్రి. ‘ఓఎమ్‌జీ 2’ 27 కట్స్‌ను తీసుకున్న తర్వాత కూడా దానికి ఏ సర్టిఫికెట్ రావడం అనేది చాలామంది ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక ఈ సినిమా ఆగస్ట్ 11న థియేటర్లలో సందడి చేయనుంది.
Also Read: సమంత పేరు మీద ఇడ్లీ స్టాల్ పెట్టాలని ప్లాన్ చేశాం, కానీ..: విజయ్ దేవరకొండ
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial