Gangs Of Godavari: యంగ్ హీరో విశ్వక్ సేన్ మరోసారి తనకు బాగా కలిసొచ్చిన మాస్ ఫార్ములాను ఫాలో అవుతూ నటించిన సినిమానే ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ డిసెంబర్ నుంచి పలుమార్లు పోస్ట్‌పోన్ అవుతూ వస్తోంది. ఫైనల్‌గా మే 31న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యింది. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ రిలీజ్ డేట్‌కు ఇంకా కొన్నిరోజులే సమయం ఉండడంతో మూవీ టీమ్ అంతా ప్రమోషన్స్ విషయంలో బిజీ అయిపోయింది. అందులో భాగంగానే విశ్వక్ సేన్ కూడా ఈ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు బయపెట్టాడు. దీంట్లో తను ఎన్ని రిస్కులు తీసుకున్నాడో చెప్పాడు.


బెస్ట్ ఇస్తాం..


‘‘ఒకసారి సినిమా మా చేయి దాటి వెళ్లిపోయిన తర్వాత ఏం చేసినా తిరిగిరాదు. మన చేతి నుంచి బెస్ట్‌గా బయటికి వెళ్లాలి. దానికోసం ఎన్నిరోజులైనా షూటింగ్ చేయడానికి నేను, ఎంత ఖర్చు అయినా షూటింగ్ చేయడానికి వాళ్లు.. అలా అందరం ఒకే ఉద్దేశంతో ఉన్నాం. సినిమాలో ఎక్కడా బోర్ కొట్టే గ్యాప్ ఇవ్వకూడదు అనుకున్నాం. కచ్చితంగా సితార ఎంటర్‌టైన్మెంట్స్‌లో తెరకెక్కిన బెస్ట్ సినిమాల్లో ఇది కూడా ఒకటి అని మేము అనుకుంటున్నాం’’ అని విశ్వక్ సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’పై ఉన్న నమ్మకాన్ని బయటపెట్టాడు. పూజతో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ షూటింగ్ ప్రారంభించిన సరిగ్గా ఏడాది తర్వాత షూటింగ్ పూర్తయ్యిందని చెప్పాడు. అంటే 365 రోజులు ఈ మూవీ కోసం కష్టపడ్డామని చెప్పుకొచ్చాడు.


ప్రశాంతంగా ఉండకూడదు..


‘‘ప్రస్తుతం చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మమ్మల్ని చూసి మీరు అలిసిపోయేంత కష్టపడ్డాం. మేము అదంతా ఎలా చేశాం అని ఆలోచిస్తేనే అలసట వస్తుంది. ఎందుకంటే ఏదీ ఈజీగా జరగలేదు. ఒకసారి కదులుతున్న లారీపైన ఫైట్ ఉంటుంది, ఒకసారి ఊగిపోతున్న బోట్ మీద ఫైట్ ఉంటుంది. చైతూ అన్నీ పక్కాగా ప్లాన్ చేసే రాసుకున్నాడు. సెట్స్‌లో ప్రశాంతంగా ఉంటే మాకు టెన్షన్ వస్తుంది. అన్ని కరెక్ట్‌గానే చేస్తున్నామా, ఇంత ప్రశాంతంగా ఉండకూడదే అని డౌట్ వస్తుంది’’ అంటూ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ దర్శకుడు కృష్ణ చైతన్య డెడికేషన్ గురించి తన స్టైల్‌లో చెప్పుకొచ్చాడు విశ్వక్ సేన్. అంతే కాకుండా షూటింగ్ సమయంలో తనకు జరిగిన ప్రమాదం గురించి కూడా బయటపెట్టాడు.


గోదావరిలో దూకేశాను..


‘‘లారీపై నుంచి రోడ్ మీద పడిపోయాను. మోకాళు పగిలిపోయింది అనుకున్నాను. ఒక 10 నిమిషాలు నా కళ్లలో నీళ్లు తిరిగాయి. రెండేళ్లు సినిమాలు ఆగిపోతాయి. ఎవరెవరికి సమాధానం చెప్పుకోవాలో అంతా గుర్తొచ్చాయి. లేచి మెల్లగా నడుచుకుంటూ వెళ్లి కారులో కూర్చున్నా. డైరెక్ట్‌గా వెళ్లి స్కానింగ్ చేయించుకున్నా. చిన్న క్రాక్ కూడా లేదు. అప్పటినుంచి ఒళ్లు దగ్గర పెట్టుకొని ఉండాలనుకున్నా. కానీ మళ్లీ 4 రోజుల తర్వాత రోప్స్ లేకుండానే ఫైట్ చేశాను. ఒకరోజు షూటింగ్ అయిపోయింది, ప్యాకప్ అని చెప్పిన తర్వాత గోదావరిలో దూకేశాను’’ అని గుర్తుచేసుకున్నాడు విశ్వక్ సేన్. అంతే కాకుండా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ షూటింగ్ వీడియోలు తన దగ్గర ఉన్నాయని త్వరలో అప్లోడ్ చేస్తానని మాటిచ్చాడు.


Also Read: మాస్ కా దాస్‌కు.. గాడ్ ఆఫ్ మాస్ సపోర్ట్ - ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ కోసం బాలయ్య గ్రాండ్ ఎంట్రీ