Laila: 'ప్లీజ్.. పైరసీని ప్రోత్సహించొద్దు' - కనిపిస్తే సమాచారం ఇవ్వాలంటూ ప్రేక్షకులకు లైలా టీం రిక్వెస్ట్
Laila Team Request: టాలీవుడ్ పరిశ్రమను పైరసీ భూతం వేధిస్తుండగా తాజా 'లైలా' చిత్ర బృందం అప్రమత్తమైంది. పైరసీని ప్రోత్సహించొద్దని ప్రేక్షకులకు సూచించింది. పైరసీ కనిపిస్తే సమాచారం ఇవ్వాలని కోరింది.
'Laila' Movie Team Request To Audience About Piracy: మాస్ కా దాస్ విశ్వక్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'లైలా' (Laila) శుక్రవారం (ఫిబ్రవరి 14) ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. అయితే, ఇటీవల పైరసీ భూతం మళ్లీ విజృంభిస్తోన్న క్రమంలో మూవీ టీం అలర్ట్ అయ్యింది. 'లైలా' పైరసీని ప్రోత్సహించొద్దని ప్రేక్షకులకు విజ్ఞప్తి చేసింది. ఒకవేళ ఎక్కడైనా 'లైలా' పైరసీ కనిపిస్తే @blockxtechs సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా గానీ report@blockxtech.com మెయిల్ ద్వారా గానీ సమాచారం ఇవ్వాలని సూచించింది. ఎవరైనా పైరసీ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. సినిమాను థియేటర్లలోనే చూసి ఎంజాయ్ చేయాలని పేర్కొంది.
కాగా, టాలీవుడ్ పరిశ్రమకు ప్రస్తుతం పైరసీ సవాల్‌గా మారింది. టెక్నాలజీ పెరిగేకొద్దీ అంతకంతకూ విస్తరిస్తూ.. ముఖ్యంగా తెలుగు సినిమాలు పైరసీ బారిన పడి తీవ్రంగా నష్టపోతున్నాయి. ఇటీవల, రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' (Game Changer), నాగచైతన్య 'తండేల్' (Thandel) సినిమాలు పైరసీకి గురయ్యాయి. ఏకంగా ఆర్టీసీ బస్సుల్లోనే 'తండేల్' సినిమా ప్రదర్శించడం షాక్‌కు గురి చేసింది. దీనిపై దర్శక నిర్మాతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'తండేల్' పైరసీ చేసినా.. మువీ డౌన్ లోడ్ చేసి చూసిన వారిపైనా కేసులు నమోదు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఎవరైనా 'తండేల్' పైరసీ చేస్తే 9573225069 కు మెసేజ్ చేయాలని సూచించారు.
Also Read: 'ఛావా' ఫస్ట్ రివ్యూ - నేషనల్ క్రష్ రష్మిక బాలీవుడ్‌లో భారీ హిట్టు కొట్టిందా?
'లైలా'ను చుట్టుముట్టిన వివాదాలు
మాస్ కా దాస్ హీరోగా విశ్వక్ సేన్, ఆకాంక్ష శర్మ హీరోయిన్‌గా రామ్ నారాయణ్ దర్శకత్వంలో 'లైలా' సినిమా తెరకెక్కింది. ఈ మూవీలో విశ్వక్ లేడీ గెటప్‌లో విభిన్న పాత్రలో నటించారు. సినిమాను సాహు గారపాటి నిర్మించారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న రిలీజ్ కానుంది. అయితే, విడుదలకు ముందే 'లైలా' సినిమాను వివాదాలు చుట్టుముట్టాయి. మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ 30 ఇయర్స్ పృథ్వీరాజ్ చేసిన వ్యాఖ్యలతో ఇటీవలే సోషల్ మీడియా వేదికగా 'బాయ్ కాట్ లైలా'ను ట్రెండ్ చేశారు. అంతే కాకుండా విడుదల రోజే సినిమా పైరసీ లింక్స్ పోస్ట్ చేస్తామంటూ తమకు బెదిరింపులు వచ్చాయని హీరో విశ్వక్ చెప్పారు.
సారీ చెప్పిన 30 ఇయర్స్ పృథ్వీరాజ్
'లైలా' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడిన నటుడు పృథ్వీరాజ్.. 'మేకల సత్యం అనే క్యారెక్టర్ సీన్ షూట్ చేసేటప్పుడు యాదృచ్ఛికంగా ఒకటి జరిగింది. మొదట 150 మేకలు ఉన్నాయని చెప్పారు. చివరికి ఎన్ని ఉన్నాయని లెక్కిస్తే సరిగ్గా 11 ఉన్నాయి.' అని పేర్కొనగా.. పరోక్షంగా తమ పార్టీని టార్గెట్ చేశారంటూ వైసీపీ శ్రేణులు ఫైర్ అయ్యాయి. సినిమాను బాయ్ కాట్ చేయాలంటూ ట్రెండ్ చేశాయి. దీనిపై హీరో విశ్వక్, నిర్మాత సాహు గారపాటి వివరణ ఇచ్చారు. అది తమ నోటీస్‌లో జరగలేదని.. సినిమాను సినిమాగా చూడాలని విజ్ఞప్తి చేశారు. తాజాగా, నటుడు పృథ్వీరాజ్ సైతం సోషల్ మీడియా వేదికగా సారీ చెబుతూ ఓ వీడియో రిలీజ్ చేశారు.
'సినిమాను కిల్ చెయ్యుద్దు. సినిమాను ప్రేమిద్దాం. గౌరవిద్దాం. నా వల్ల ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ఉన్నాను. ఎవరివైనా మనోభావాలు దెబ్బతినుంటే మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నా. ఇంతటితో ఈ వివాదానికి ముగింపు పలకండి. లైలాను బాయ్ కాట్ చేయకండి. విశ్వక్‌సేన్‌కు ఫలక్‌నుమాదాస్‌కు మించిన విజయం ఈ సినిమా అందిస్తుందని ఆశిస్తున్నా.' అని పృథ్వీరాజ్ పేర్కొన్నారు.