Vishnu Manchu About RGV Praised On Kannappa Movie: విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మూవీని చూసిన పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా... సంచలన దర్శకుడు ఆర్జీవీ కూడా 'కన్నప్ప'పై రియాక్ట్ అయ్యారు. ఈ మేరకు విష్ణుకు వాట్సాప్ మెసేజ్ పంపించగా ఆయన దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. 

నిన్ను చూడడానికే వస్తున్నా...

విష్ణుపై ప్రశంసలు కురిపించారు ఆర్జీవి. ఈ మేరకు ఆయనకు వాట్సాప్ మెసేజ్ పంపించారు. 'నాకు దేవుళ్లు, భక్తులు ఇద్దరూ ఇష్టపడరు. అందుకే అలాంటి ఇతివృత్తంతో కూడిన మూవీని నేను ఎప్పుడూ చూడను. నా కాలేజీ డేస్‌లో అసలు సినిమాను 4 సార్లు చూశా. కానీ హీరో, హీరోయిన్, పాటల కోసం కాదు సబ్జెక్ట్ కోసమే చూశాను. ఈ మూవీలో తిన్నడిగా నువ్వు నటించడమే కాదు... అన్నీ బాధ్యతలను దగ్గరుండి నెరవేర్చావు.

నన్ను ఊపిరి ఆడకుండా చేసేంత ఎమోషన్‌ పండించావు. కొన్ని సీన్స్‌లో నన్ను ఊపిరి తీసుకోనివ్వలేదు. క్లైమాక్స్‌లో, తిన్నడు శివలింగం నుంచి రక్తస్రావం ఆపడానికి తన కళ్లను అందించే చోట నీ యాక్టింగ్ వేరే లెవల్. ఇది సాధారణంగా నాస్తికుడిగా నేను అసహ్యించుకునే సీన్. కానీ నువ్వు నన్ను ఇష్టపడేలా చేశావు. దానికి నాకు చాలా సంతోషంగా ఉంది. శివునికి పరమ భక్తుడిగా మారిపోవడంలో నువ్వు చూపించిన నిబద్ధత మాస్టర్ క్లాస్. ఆ టైంలో నీ ఎమోషన్స్, హావ భావాలు చేతులెత్తి నమస్కరించేలా ఉన్నాయి. అందరూ సినిమాలో ప్రభాస్ ఉన్నాడని థియేటర్‌కు వస్తున్నారు. కానీ, ఇప్పుడు నేను నిన్ను చూడటానికే టికెట్ కొని మరీ థియేటర్‌కు వెళ్తున్నా.' అంటూ రాసుకొచ్చారు.

విష్ణు ఎమోషనల్

ఆర్జీవీ మెసేజ్‌కు విష్ణు మంచు ఎమోషనల్ అయ్యారు. 'రాము గారూ! మీరు నన్ను ఏడిపించారు. నేను చాలా కాలంగా నా కన్నీళ్లను ఆపుకొంటున్నా. నేను దీన్ని సాధించగలననే నమ్మకంతో ముందుకు వెళ్లాను. ఇది నా జీవితంలో అత్యంత సవాల్‌తో కూడిన సమయాల్లో ఒకటి. నేను ఎక్కడికి వెళ్లినా, కనిపించిన ప్రతి వారికీ ఈ సినిమాపై అనుమానం లేదా ద్వేషాన్నే చూశాను.' అని పేర్కొన్నారు. ఈ చాట్‌ను షేర్ చేసిన విష్ణు.. 'ఈ మెసేజ్‌తో నటుడిగా ఓ కల నిజమైంది.' అంటూ రాసుకొచ్చారు.

Also Read: 'ప్యారడైజ్'లో అడుగు పెట్టిన నాని... 'పెద్ది' కోసం వెనక్కి వెళ్ళలేదు... రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసిన టీమ్!

బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో 'కన్నప్ప' దూసుకెళ్తోంది. ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా రూ.20 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వీకెండ్ కావడంతో ఈ కలెక్షన్స్ మరింత పెరగొచ్చని అంటున్నాయి. విష్ణు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా 'కన్నప్ప' నిలిచింది. ఈ మూవీకి ముకేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించగా... ప్రీతి ముకుందన్ హీరోయిన్. మోహన్ బాబు, రుద్రుడిగా ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.