కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘జవాన్’. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్, ట్రైలర్ అభిమానులను అలరించాయి. ఇక భారీ బడ్జెట్ తో, భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఆరంభం నుంచే ఓ రేంజిలో బజ్ క్రియేట్ అయ్యింది. సెప్టెంబర్ 7న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా అట్టహాసంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చెన్నైలో ‘జవాన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన విజయ్ సేతుపతి.. అట్లీ, షారుఖ్ గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
ఆ అమ్మాయిపై ఇన్నాళ్లకు పగ తీర్చుకున్నా- విజయ్
షారుఖ్ తో ప్రేమలో ఉన్న అమ్మాయినే తాను ప్రేమించానని విజయ్ వెల్లడించారు. కానీ, ఈ ప్రేమ విషయం ఆమె చెప్పేంత వరకు తనకు తెలియదన్నారు. ఆ అమ్మాయి మీద ఎప్పటికైనా పగ తీర్చుకోవాలని అప్పుడే అనుకున్నట్లు చెప్పారు. కానీ, ఇప్పుడు ‘జవాన్’ చిత్రంలో విలన్ గా నటించి.. ప్రతీకారం తీర్చుకున్నట్లు చెప్పారు. “నేను స్కూల్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించాను. కానీ, ఆమెకు ఆ విషయం తెలియదు. ప్రతి జానుకి రామ్ ఉంటాడు (విజయ్ 2018 చిత్రం '96’ ప్రేమకథ ప్రకారం). కానీ, ఆ అమ్మాయి అప్పటికే SRKతో ప్రేమలో ఉంది. ఆమె మీద ప్రతీకారం తీర్చుకోవడానికి నాకు చాలా సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు షారుక్ సినిమాలో కీలక పాత్ర పోషించి ఆమెపై రివెంజ్ తీర్చుకున్నా’’ అని సరదాగా కామెంట్ చేశారు. దీనికి షారుఖ్ స్పందిస్తూ, “సార్, మీరు పగ తీర్చుకోవచ్చు. కానీ, అమ్మాయిల మీద తీర్చుకోవద్దు” అన్నారు. దీంతో ఈవెంట్ లోని వారంతా నవ్వుల్లో మునిగిపోయారు.
షారుఖ్ తో కలిసి నటించడం సంతోషంగా ఉంది- విజయ్
ఇక మెల్‌బోర్న్ లో జరిగిన ఓ పార్టీలో షారుఖ్ ను తొలిసారి కలిసినట్లు విజయ్ సేతుపతి తెలిపారు. ఆయన పక్కన కూర్చునే అవకాశం లభించిందన్నారు. ఆరోజు తన నటన గురించి గొప్పగా ప్రశంసించారని చెప్పారు. వర్క్ స్టైల్ గురించి మెచ్చుకున్నట్లు చెప్పారు. ఆయన మాటలు విని ఆశ్చర్యపోయానన్నారు. షారుఖ్ తో కలిసి ‘జవాన్’ చిత్రంలో నటించడం చాలా సంతోషంగా ఉందన్నారు విజయ్.
సెప్టెంబర్ 7న ప్రపంచ వ్యాప్తంగా ‘జవాన్‘ విడుదల
‘జవాన్‘ సినిమాలో షారుఖ్ ఖాన్ కు జోడీగా నయనతార నటిస్తుంది. విజయ్ సేతుపతి విలన్ గా కనిపించనున్నారు. ప్రియమణి, సాన్య మల్హోత్రా, సునీల్ గ్రోవర్, యోగిబాబు, రిధి డోగ్రా కీలకపాత్రలు పోషిస్తున్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కిన ‘జవాన్’ మూవీ సెప్టెంబర్ 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. షారుఖ్ ఖాన్ నటించిన ‘పఠాన్’ సినిమా ఈ ఏడాది జనవరిలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ.1000 కోట్లకు పైగా వసూళు చేసింది. ఈ చిత్రం దేశంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రంగా నిలిచింది.
Read Also: ‘ఫ్యామిలీ మ్యాన్’ ఫస్ట్ ఛాయిస్ మెగాస్టార్ - కానీ, ఆ కారణంతో వదులుకున్నారట!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial