సినిమా పరిశ్రమలో చిత్ర విచిత్రాలు జరుగుతుంటాయి. ఒకరిని ఊహించుకుని రాసుకున్న కథలు, వారు ఒప్పుకోకపోవడంతో మరొకరి దగ్గరికి చేరిన సందర్భాలు చాలా ఉన్నాయి. కొందరికి కథ నచ్చకపోవచ్చు. మరికొంత మంది తమ అభిమానులు ఒప్పుకోరని చేయకపోవచ్చు. కారణాలు ఏవైతేనేం, కథలు వేరే హీరోల దగ్గరికి వెళ్తుంటాయి. కొందరు వదులుకున్న సినిమాలు ఇరత హీరోలు చేసి బ్లాక్ బస్టర్స్ సాధించిన సందర్భాలున్నాయి. మరికొన్నిసార్లు డిజాస్టర్లుగా మిగిలిని సంఘటనలూ ఉన్నాయి. ఫ్లాప్ అయితే పెద్దగా పట్టించుకోరు. కానీ, హిట్ అయితేనే, అనవసరంగా మంచి అవకాశాన్ని వదులుకున్నాం అనుకుంటారు సదరు హీరోలు.  


‘ఫ్యామిలీ మ్యాన్’ తొలి అవకాశం చిరంజీవిదే!


తాజాగా మెగాస్టార్ చిరంజీవికి సంబంధించి ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఇంతకీ అదేంటంటే, దేశ వ్యాప్తంగా అద్భుత గుర్తింపు తెచ్చుకున్న వెబ్ సిరీస్ ‘ఫ్యామిలీ మ్యాన్’. దీనిని తెలుగు దర్శకులు రాజ్, డీకే తెరకెక్కించారు. తొలి సీజన్ అద్భుత ప్రేక్షకాదరణ దక్కించుకోవడంతో రెండో సీజన్ ను మరింత గొప్పగా తీశారు. ఈ సిరీస్ లో నటించిన మనోజ్ బాజ్పేయ్ కి చక్కటి గుర్తింపు లభించింది. ఈ సిరీస్ తర్వాత వరుస అవకాశాలు వెల్లువెత్తాయి. ప్రస్తుతం ఆయన బాలీవుడ్ లో వరుస ప్రాజెక్టులు చేస్తున్నారు.  అయితే, వాస్తవానికి ‘ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ తొలి ఛాయిస్ మనోజ్ కాదట. మెగాస్టార్ చిరంజీవి ముందుకే ఈ స్టోరీ తొలుత వచ్చింది. కానీ, కొన్ని కారణాలతో ఆయన వదులుకున్నారట.


చిరంజీవి ఎందుకు ఈ ప్రాజెక్టును వదులకున్నారంటే?


వాస్తవానికి ‘ఫ్యామిలీ మ్యాన్’ కథతో సినిమా తీయాలని భావించారట రాజ్, డీకే. స్క్రిప్ట్ పూర్తి చేసుకున్నారట. ఈ కథనే నేరుగా నిర్మాత అశ్వినీ దత్ దగ్గరికి తీసుకెళ్లారట. ఆయనకు ఈ స్టోరీ చెప్పారట. నిర్మాతకు ఈ స్టోరీ బాగా నచ్చిందట. వెంటనే ఆయన ఈ కథను మెగాస్టార్ కు వినిపించారట. ఆ సమయంలో చిరంజీవి ‘ఖైదీ నెం.150’ మూవీ సక్సెస్ కావడంతో జోష్ లో ఉన్నారట. ఈ స్టోరీ విని, ఇద్దరు పిల్లల తండ్రిగా, అందులోనూ భార్య క్యారెక్టర్ సరిగా లేకపోవడం తన అభిమానులు యాక్సెప్ట్ చేయలేని చెప్పారట. కథలో కొన్ని మార్పులు చేస్తే నటిస్తాను అని చెప్పారట. కానీ, దర్శకులకు మార్పులు నచ్చలేదట. దీంతో ఈ సినిమా కథను వెబ్ సిరీస్ గా మార్చి, మనోజ్ బాజ్ పేయ్ ను తీసుకున్నారట. ఈ సిరీస్ ఓ రేంజిలో పాపులర్ అయ్యింది. దర్శకులతో పాటు ఇందులో నటించిన స్టార్స్ కు మంచి గుర్తింపు తెచ్చింది. అయితే, ఈ కథతో సినిమా తీస్తే నిజంగా ఈ స్థాయి గుర్తింపు వచ్చి ఉండేదో? లేదో? అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. మరికొంత మంది చిరంజీవి చేయకపోవడం వల్లే వెబ్ సిరీస్ బాగా పాపులర్ అయ్యిందని కామెంట్స్ చేస్తున్నారు. చిరంజీవి ఈ కథను వదులుకున్న విషయాన్ని తాజాగా నిర్మాత అశ్వినీ దత్ చెప్పినట్లు తెలుస్తోంది.


Read Also: బాలయ్య వస్తే తీన్మార్ కాదు, సౌమార్ కొట్టాల్సిందే - 'భగవంత్ కేసరి' ఫస్ట్ సాంగ్ ప్రోమో చూశారా?



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial