రాజకీయాల్లోకి తమిళ స్టార్ హీరో విజయ్ వస్తారా? లేదా? - తమిళనాడులో ఈ ప్రశ్నకు రకరకాల సమాధానాలు వినిపిస్తాయి. రాజకీయాల్లోకి వస్తానని విజయ్ ఎప్పుడూ చెప్పింది లేదు. కానీ, ఆయన సినిమాల్లో రాజకీయాల ప్రస్తావన ఉంటుంది. ప్రభుత్వాలపై సెటైర్లు ఉంటాయి. గతంలో జీఎస్టీ మీద 'అదిరింది' (తమిళ సినిమా 'మెర్సల్' తెలుగు అనువాదం)లో 'జీఎస్టీ' మీద సెటైరికల్ డైలాగులు ఉన్నాయి. విజయ్ కావాలని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మీద సెటైర్లు వేశారనే మాటలు వినిపించాయి.


ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర గవర్నర్, అప్పటి తమిళనాడు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) విభాగం అధ్యక్షురాలు తమిళసై సౌంద‌ర్‌ రాజ‌న్‌ జీఎస్టీ డైలాగులపై అభ్యంతరం వ్యక్తం చేశారు. 'అదిరింది'లో ఆ సన్నివేశం తొలగించాలని డిమాండ్ చేశారు. తొలగించారు కూడా! ఆల్రెడీ సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇచ్చిన సినిమాకు రీ సెన్సార్ ఏంటని కమల్ హాసన్ ప్రశ్నించారు. విజయ్‌కు అరవింద్ స్వామి, జీవీ ప్రకాష్ కుమార్ తదితరులు మద్దతు ప్రకటించారు. అదంతా గతం! ప్రస్తుతానికి వస్తే... విజయ్ నటించిన 'బీస్ట్' నేడు విడుదలైంది.


తీవ్రవాదులు మాల్ హైజాక్ చేస్తే... మాల్‌లో ఉన్న మాజీ 'రా' ఏజెంట్ ఎలా కాపాడాడు? అనేది కథ. సినిమా ప్రారంభంలో 'మరో రెండు నెలల్లో ఎన్నికలు వస్తున్నాయి' అనేది చెబుతారు. తీవ్రవాదులతో ప్రభుత్వం చర్చలు జరిపే సమయంలో 'ఎన్నికలకు ముందు 200 మంది ప్రాణాలు పోతే... మీ ప్రభుత్వానికి ఓకేనా?' అని ప్రభుత్వ ప్రతినిధితో తీవ్రవాది ఒకరు వ్యాఖ్యానిస్తారు. అందులో అభ్యంతరం లేదు. పతాక సన్నివేశాల్లో విజయ్ డైలాగులు వింటే... మోడీ ప్రభుత్వంపై సెటైర్లు వేసినట్టు ఉన్నాయనే అభిప్రాయం ప్రేక్షకుల్లో వ్యక్తం అవుతోంది.


'బీస్ట్' క్లైమాక్స్‌కు వస్తే... రా, భారత ప్రభుత్వ అధికారులకు చెప్పకుండా పాకిస్తాన్ భూభాగంలోకి హీరో చొరబడతాడు. అక్కడ ఒక తీవ్రవాద నాయకుడిని పట్టుకుని ఇండియాకు బయలుదేరతాడు. పాకిస్తాన్ ఆర్మీ ఎటాక్ చేయబోతే... భారత అధికారుల సాయం కోరాడతాడు. తమకు చెప్పకుండా వెళ్ళినందుకు సాయం అందించే అవకాశాలు లేవని చెబుతారు. ఎన్నికలకు ముందు పాకిస్తాన్ నుంచి ఒక తీవ్రవాదిని తీసుకొస్తే ఓట్లు పడతాయని, ఆ విషయం పై వాళ్లకు తెలుసని అర్థం వచ్చేలా హీరో మాట్లాడతాడు. పీఎం సైతం ఎన్నికల్లో లబ్ధి చేకూరుతుందని, హీరోకి మద్దతుగా ఫైటర్ జెట్స్ పంపమని ఆదేశిస్తారు. ఇదంతా సర్జికల్ స్ట్రైక్ మీద విజయ్ మార్క్ సెటైర్ అనేది ఆడియన్స్ టాక్. ఎన్నికల్లో విజయం కోసమే సర్జికల్ స్ట్రైక్స్ చేయించారనేలా సన్నివేశం ఉందంటున్నారు.


Also Read: 'బీస్ట్' రివ్యూ: సినిమా ఎలా ఉందంటే?


ఇటీవల రాజకీయ రంగ ప్రవేశం గురించి విజయ్‌ను దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ప్రశ్నించారు. 'నటుడిగా మీరు ప్రయాణం ప్రారంభించిన తొలినాళ్లలో ఇలయ దళపతి అన్నాడు. ఆ తర్వాత దళపతి (ఆదేశించే వాడు - కమాండర్) అన్నారు. మరి, తలైవన్ (నాయకుడు) అయ్యే అవకాశం ఉందా?' అని నెల్సన్ అడిగారు. ''ఆ బిరుదులు అభిమానులు ఇచ్చారు. పరిస్థితులు డిమాండ్ చేశాయి. నాయకుడు అనేది కూడా పరిస్థితులు, అభిమానుల అంచనాలపై ఆధారపడి ఉంటుంది'' అని విజయ్ చెప్పారు.


Also Read: ఫైట్‌తో విజయ్ ఎంట్రీ, సినిమా ఎలా ఉందంటే? - 'బీస్ట్' ట్విట్టర్ రివ్యూ