కోలీవుడ్ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్ - లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'లియో'. డ్రగ్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాపై కోలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. అందుకు మొదటి కారణం 'మాస్టర్' వంటి హిట్ తర్వాత లోకేష్ కనగరాజ్ తో విజయ్ రెండవసారి సినిమా చేయడం అయితే, రెండో కారణం 'విక్రమ్' వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత లోకేష్ తెరకెక్కిస్తున్న మూవీ కావడం. అది కూడా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా 'లియో' ఉండబోతుందని తెలియడంతో పై అంచనాలు నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా విజయ్ బర్త్ డే సందర్భంగా 'లియో' మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేశారు మేకర్స్ 'నా రెడీ' అంటూ స్వయంగా దళపతి విజయ్ పాడిన ఈ పాటకి అనూహ్య స్పందన రావడంతో ఇప్పుడు అందరి దృష్టి 'లియో' టీజర్ పైనే పడింది.
అనిరుద్ రవిచంద్రన్ కంపోజ్ చేసిన ఈ పాటకి విష్ణు ఎడ్వాన్ సాహిత్యం అందించగా.. లియో ఆల్బమ్తో మరోసారి మ్యూజికల్ హిట్ ని సాధించాలని చూస్తున్నారు అనిరుద్. ఈ సినిమా బిజినెస్ విషయానికొస్తే.. 'లియో' మూవీకి ఇండియా తో పాటు ఓవర్సీస్ మార్కెట్ లోనూ భారీ డిమాండ్ ఉంది. కాగా ఈ సినిమా తెలుగు రైట్స్ భారీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం 'లియో' మూవీ తెలుగు రైట్స్ ని ప్రముఖ సంస్థ డిస్నీ ఏకంగా రూ.22 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అటు విజయ్ కి ఇటు లోకేష్ కనగరాజ్ కి ఇది ఆల్ టైం రికార్డ్ బిజినెస్ అని చెప్పొచ్చు. తెలుగులో ఇప్పటికే 'ఖైదీ', 'మాస్టర్' మరియు 'విక్రమ్' వంటి విజయాల తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు దర్శకుడు లోకేష్ కనకరాజు. అందుకే 'లియో' మూవీకి రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది. విజయ్ నటించిన గత చిత్రం 'వారసుడు' సినిమాకి కూడా ఈ స్థాయిలో బిజినెస్ జరగలేదు.
ఈ సినిమాలో విజయ్ సరసన చెన్నై బ్యూటీ త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. ఈమెతో పాటు సినిమాలో భారీ తారాగణం ఉన్నారు. బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ ఈ సినిమాలో ఓ కీ రోల్ చేస్తున్నారు. సినిమాలో విజయ్ కి తండ్రి పాత్రలో సంజయ్ దత్ కనిపిస్తాడని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. ఆయనతో పాటు యాక్షన్ కింగ్ అర్జున్, ప్రియా ఆనంద్, మడోన్నా సెబాస్టియన్, గౌతమ్ మీనన్, మాథ్యూ థామస్, మన్సూర్ అలీ ఖాన్ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. విజయ్ కెరీర్ లో 67 వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమని సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ పై ఎస్, ఎస్ లలిత్ కుమార్, జగదీష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సుమారు రూ.250 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదల కాబోతోంది. ఈసారి స్ట్రైట్ తెలుగు మూవీస్ తో 'లియో' పోటీ పడబోతోంది. దసరాకి తెలుగులో బాలయ్య 'భగవంత్ కేసరి', రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఈ రెండు సినిమాలతో 'లియో' కి తెలుగు రాష్ట్రాల్లో గట్టి పోటీ ఉండే అవకాశం ఉంది. మరి భారీ అంచనాలతో వస్తున్న 'లియో' విజయ్ కి ఎలాంటి సక్సెస్ ని అందిస్తుందో చూడాలి.
Also Read: బోయపాటి - రామ్ మూవీ రిలీజ్ డేట్ మారిందండోయ్ - ముందే వచ్చేస్తారట!