సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. VD12 అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ మీదకు వెళ్ళిన ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇది గ్యాంగ్‌ స్టార్‌ బ్యాక్‌డ్రాప్‌‌లో తెరకెక్కుతున్న యాక్షన్ మూవీ అని తెలుస్తోంది. అయితే ఈ చిత్రంలో విజయ్ పాత్రకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం ఇప్పుడు లీకైంది.


VD12 సినిమా గ్యాంగ్‌స్టార్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందే యాక్షన్‌ థ్రిల్లర్‌ అని విజయ్ దేవరకొండ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ అప్‌డేట్‌ తో రౌడీ ఫ్యాన్స్‌లో అంచనాలు రెట్టింపు అయ్యాయి. గ్యాంగ్‌ స్టార్స్‌ను అంతమొందించే పోలీస్‌ ఆఫీసర్ గా వీడీ ఈసారి అదరగొడతాడని భావిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో విజయ్ ఒక కానిస్టేబుల్ రోల్ లో కనిపించనున్నాడనే తాజాగా రివీల్ అయింది. ఆ విషయాన్ని కారెక్టర్ ఆర్టిస్ట్ మురళీధర్ గౌడ్ లీక్ చేశారు.


డీజే టిల్లు, బలగం ఫేమ్ మురళీధర్ గౌడ్ ఇప్పుడు VD12 సినిమాలో నటిస్తున్నారు. లేటెస్టుగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన, తాను ఈ చిత్రంలో ఎస్సై పాత్రలో నటిస్తున్నట్లు చెప్పారు. తన భాగం షూటింగ్ పూర్తి చేసినట్లు తెలిపారు. అక్కడితో ఆగకుండా విజయ్ దేవరకొండ తన కింద పనిచేసే ఒక కానిస్టేబుల్ క్యారెక్టర్ లో కనిపించనున్నట్లు కీలక సమాచారం బయట పెట్టారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.


గౌతమ్ మూవీలో విజయ్ ఒక పవర్ ఫుల్ పోలీసాఫీసర్ నటిస్తున్నాడని ఇప్పటి వరకూ అందరూ భావిస్తున్నారు. అనౌన్స్ మెంట్ పోస్టర్ లో ఖాకీ డ్రెస్, నెత్తి మీద టోపీ చూసి అదేనని ఫిక్స్ అయ్యారు. కానీ ఇప్పుడు అది కానిస్టేబుల్‌ పాత్ర అని తెలిసిపోయింది. అలాంటి పాత్రకు విజయ్ చెప్పిన గ్యాంగ్ స్టర్ వరల్డ్ తో ఎలా ముడిపెడతారు? దర్శకుడు ఎలాంటి స్టోరీని చెప్పబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.


Also Read: మాస్ మహారాజా 'ఛాంగురే బంగారు రాజా' ట్రైలర్!


ఇప్పటి యంగ్ జనరేషన్ హీరోలలో యువ సామ్రాట్ నాగచైతన్య ఇటీవల 'కస్టడీ' మూవీలో కానిస్టేబుల్ పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్, బాక్సాఫీసు దగ్గర పరాజయం పాలైంది. అలానే 'లాఠీ' చిత్రంలో విశాల్.. 'సెబాస్టియన్' సినిమాలో కిరణ్ అబ్బరవం కూడా అలాంటి పాత్రల్లోనే నటించారు కానీ, ఆశించిన విజయాలను సాధించలేకపోయారు. మరి ఇప్పుడు విజయ్ దేవరకొండ కానిస్టేబుల్ గా ఎలాంటి రిజల్ట్ అందుకుంటారో వేచి చూడాలి.


'లైగర్' తో పాన్ ఇండియా బాక్సాఫీసు వద్ద బొక్కబోర్లా పడ్డ విజయ్ దేవరకొండ.. ఇటీవల 'ఖుషి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ మూవీ యావరేజ్‌ ఫలితాన్ని అందుకుంది. ఓవర్సీస్‌ లో గట్టెక్కినా, రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ సాధించలేకపోయింది. ఈ నేపథ్యంలో VD12 తో మాస్ బాట పడుతున్నాడు విజయ్. 'మళ్లీరావా' 'జెర్సీ' వంటి ఫీల్ గుడ్ చిత్రాలలో ఆకట్టుకున్న డైరక్టర్ గౌతమ్.. ఈసారి వీడీతో కలసి ఓ యాక్షన్ సబ్జెక్ట్ ని డీల్ చేస్తున్నాడు.


VD12 చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. సితార ఎంటర్‌టైనమెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌, శ్రీకర స్డూడియోస్‌ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. దీనికి సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్నారు. అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్ గా, నవీన్ నూలి ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు. ఈ పాన్ ఇండియా మూవీని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంది.


Also Read: రోడ్డుపై పడుకున్న పవన్ కల్యాణ్.. ఆర్జీవీ మార్క్ సెటైరికల్ ట్వీట్!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial