ఇప్పుడు విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) స్టార్ హీరో. 'అర్జున్ రెడ్డి' విజయం తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. అయితే... హీరోగా కంటే ముందు ఆయన దర్శకత్వ శాఖలో పని చేశారనే సంగతి తెలుసా? 'లైగర్' (Liger Movie) ఈ నెల 25న విడుదల కానున్న సందర్భంగా హైదరాబాద్‌లో మీడియాతో ముచ్చటించిన విజయ్ దేవరకొండ, ఆ విషయాన్ని వెల్లడించారు.
పూరిని కలవడానికి వెళితే...
పూరి జగన్నాథ్‌తో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు విజయ్ దేవరకొండ. ఈ 'లైగర్' తర్వాత 'జన గణ మణ' (JGM Movie) ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే... హీరో కాకముందు పూరిని కలవడానికి వెళ్ళితే పని కాలేదన్నారు. ''నాకు నటుడిగా అవకాశాలు లభించకపోవడంతో సహాయ దర్శకుడిగా పని చేస్తూ... పరిచయాలు పెంచుకుని, ఆ తర్వాత నటుడు కావాలనుకున్నా. అప్పుడు తేజ దగ్గర కొన్నాళ్లు పని చేశా. 'సహాయ దర్శకులకు పూరి ఎక్కువ డబ్బులు ఇస్తారు. ప్రయత్నించు' అని నాన్న చెప్పడంతో వెళ్లాను. పూరి ఆఫీసు అంతా బిజీ బిజీ. నాకు ఆయన్ను కలవడం కుదరలేదు. కానీ, ఇంటికి వెళ్ళాక కలిశానని నాన్నతో అబద్ధం చెప్పా'' అని విజయ్ దేవరకొండ తెలిపారు.
'డియర్ కామ్రేడ్' చేస్తున్న సమయంలో పూరి జగన్నాథ్ 'లైగర్' కథ చెప్పారని, విన్న వెంటనే నచ్చేసిందని ఆయన చెప్పారు.
అమ్మా నాన్నకు సంబంధం లేదు
'లైగర్' సినిమాకు, 'అమ్మా నాన్న తమిళమ్మాయి' సినిమాకు సంబంధం లేదని విజయ్ దేవరకొండ చెప్పారు. రీమేక్స్, ఇంతకు ముందు వచ్చిన చిత్రాలకు దగ్గరగా ఉండే సినిమాలను తాను ఎంపిక చేసుకోనని ఆయన తెలిపారు. 'లైగర్'లో తల్లీ కొడుకుల మధ్య భావోద్వేగాలు హైలైట్ అవుతాయన్నారు. తొలుత తెలుగులో తీయాలని అనుకున్నప్పటికీ... ఆ తర్వాత మన సినిమాలు హిందీలో కూడా సత్తా చాటుతున్నాయి కనుక తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కించామన్నారు. హిందీ ప్రేక్షకులను ఆకట్టుకునే కంటెంట్ సినిమాలో ఉందన్నారు.
Also Read : పూరి నాన్న, ఛార్మి అమ్మ - 'లైగర్' ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ
డ్యాన్స్ అంటే ఏడుపే!
'లైగర్' పాటల్లో విజయ్ దేవరకొండ బాగా డ్యాన్స్ చేసినట్లు అర్థం అవుతోంది. అయితే, డ్యాన్స్ గురించి ఆయన ఏమన్నారో తెలుసా? ''డ్యాన్స్ అంటే నాకు ఏడుపు వస్తుంది. చేయాలంటే ఎలాగోలా కింద మీద పడి చేస్తా'' అని విజయ్ దేవరకొండ చెప్పారు. ఆయనతో హీరోయిన్ అనన్యా పాండే కూడా మీడియాతో ముచ్చటించారు.
తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ సరసన అనన్యా పాండే (Ananya Panday) కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కించారు. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ (Mike Tyson), ప్రముఖ నటి రమ్యకృష్ణ నటించారు. కరణ్ జోహార్‌కు చెందిన ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ నిర్మించారు. ఈ సినిమాకు పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా నిర్మాతలు.