ఇప్పుడు యువతలో విపరీతమైన క్రేజ్ ఉన్న కథానాయకులలో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ఒకరు. ఆయన్ను చాలా మంది సూపర్ స్టార్‌గా చూస్తున్నారు. అయితే... తనను సూపర్ స్టార్ అంటుంటే చాలా ఇబ్బందిగా ఫీలవుతానని విజయ్ దేవరకొండ అంటున్నారు. ఆగస్టు 25న 'లైగర్' (Liger Movie) విడుదల సందర్భంగా పలు నగరాలలో ఆయన ప్రచారం చేస్తున్నారు. ఆదివారం రాత్రి వరంగల్‌లో వేడుక నిర్వహించారు. అందులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.


'లైగర్' సినిమా వేడుకలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ''ఇండియా సగం తిరిగిన తర్వాత ఇక్కడికి వచ్చాం. ఏ ఊరిలో ఉన్నా మనవాళ్ళ గురించే ఆలోచన. తెలుగు ప్రేక్షకుల్ని మస్తు మిస్ అయ్యా. నేను ఏ ఊరికి వెళ్లినా విపరీతమైన జనాలు వచ్చారు. చాలా ప్రేమ చూపించారు. ఎందుకు అనేది ఇప్పటి వరకు అర్థం కాలేదు. బహుశా... తెలుగు ప్రేక్షకుల వల్లే అది సాధ్యమైందని అనుకుంటున్నాను. మీరు ఇచ్చిన ప్రేమ, ఇండియా అంతటా ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమ నేను మరువను. ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటా'' అని అన్నారు.


ఆగస్టు 25న ప్రేక్షకులకు ఆ ప్రేమను తిరిగి ఇస్తానని విజయ్ దేవరకొండ తెలిపారు. 'లైగర్' సినిమా బ్లాక్ బస్టర్ అని, సినిమా మీద ఎలాంటి డౌట్స్ లేవని ఆయన అన్నారు. తానూ సినిమాపై కాన్ఫిడెంట్‌గా ఉన్నప్పటికీ... ప్రేక్షకులు థియేటర్లను షేక్ చేయాలని పిలుపు ఇచ్చారు.


''లైగర్' సినిమాలో తల్లీకొడుకులు కరీంనగర్ నుంచి ముంబై వెళతారు. ఇండియా షేక్ చేద్దామని! కొడుకును ఛాంపియన్ చేయాలని తల్లి తపన పడుతుంది. మా లైఫ్ కూడా అంతే! నేను కూడా ఇక్కడ చిన్న పిల్లాడినే. రోజూ సూపర్ స్టార్ సూపర్ స్టార్ అని పిలిస్తే ఇబ్బందిగా అనిపిస్తుంది. ఆ పేరుకు నేను తగినంత చేయలేదు. ఇంకా చాలా చేయాలి. సినిమాలో హీరోలా నేనూ హైదరాబాద్ నుంచి ముంబై బయలు దేరాను. పూరి మా నాన్నలాగా... ఛార్మి మా అమ్మలా... ముగ్గురం బయలుదేరాం. ఇండియా షేక్ చేద్దామని ముంబై వెళ్లాం. ఏ ఇబ్బంది వచ్చినా కొట్టాలని ఫిక్స్ అయ్యాం. పూరి గారు రాసిన డైలాగులు చెప్పాలంటే దేవుడి ఆశీర్వాదం ఉండాలి. నేను ఈ సినిమాలో పూరి గారి డైలాగులు చెప్పగలిగా'' అని విజయ్ దేవరకొండ అన్నారు.


తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ సరసన అనన్యా పాండే (Ananya Panday) కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కించారు. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ (Mike Tyson), ప్రముఖ నటి రమ్యకృష్ణ నటించారు. 


Also Read : దేశభక్తి ఎప్పుడూ హిట్టే - నెత్తురు మరిగితే ఎత్తరా జెండా, కొట్టరా బాక్సాఫీస్ కొండ


ప్రముఖ బాలీవుడ్ దర్శక - నిర్మాత కరణ్ జోహార్‌కు చెందిన ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ నిర్మించారు. ఈ సినిమాకు పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా నిర్మాతలు.



Also Read : బాలీవుడ్‌లో శ్రీదేవిని స్టార్ చేసినవి దక్షిణాది సినిమాలే - హిందీలో అతిలోక సుందరి చేసిన సౌత్ రీమేక్స్ ఇవే!