Vijay Devarakonda at Family Star Trailer Launch: రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఎక్కువగా ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నాలు చేస్తుంటాడు. తనను ఇష్టపడే అభిమానులను కలవడం, వారికి ఏదో ఒక విధంగా ఆఫర్లు ఇవ్వడం విజయ్‌కు అలవాటే. ఇక తాజాగా ‘ఫ్యామిలీ స్టార్’ ట్రైలర్ రిలీజ్ కోసం తిరుపతిలో ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్ అయ్యాడు ఈ హీరో. ఈవెంట్‌లో ముందుగా తిరుపతిపై తనకు ఉన్న ప్రేమను బయటపెట్టాడు. చాలామంది ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్ అవ్వాలని చూసినా కుదరలేదని వారికి సారీ చెప్పాడు. అంతే కాకుండా ఈవెంట్‌కు వచ్చిన ఫ్యాన్ బాయ్స్‌కు ఆఫర్ ఇచ్చాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ట్రైలర్ లాంచ్‌లాగా లేదు..


‘‘నేను తిరుపతికి చాలాసార్లు వచ్చాను. కొండ మీదున్న స్వామివారిని మొక్కడానికి వెళ్లాను. కానీ ఎప్పుడూ మిమ్మల్ని కలవలేదు’’ అంటూ ఫ్యాన్స్‌ను ఉద్దేశించి మాట్లాడాడు విజయ్ దేవరకొండ. తన ‘ఫ్యామిలీ స్టార్’ ప్రమోషన్స్‌ను తిరుపతిలో ప్రారంభించడం బాగుందంటూ సంతోషం వ్యక్తం చేశాడు. ఈవెంట్‌లో ఫ్యాన్స్ చేస్తున్న రచ్చ చూసి ‘‘దిల్ రాజుకు విపరీతమైన నమ్మకం ఉంది. అందుకే ప్రతీ సినిమా విడుదలయిన తర్వాత తిరుపతికి వస్తుంటారు. అందుకే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చిన్నగా తిరుపతిలో చేద్దామంటే ఓకే అన్నాను. కానీ ఇక్కడ చూస్తుంటే ప్రీ రిలీజ్ ఈవెంట్‌లాగా ఉంది. పెద్ద ఫంక్షన్‌లాగా ఉంది’’ అన్నాడు విజయ్.


గీతా గోవిందం ప్యాకేజ్..


దర్శకుడు పరశురామ్‌తో విజయ్ దేవరకొండ కలిసి చేసిన ‘గీతా గోవిందం’ ఏ రేంజ్‌లో హిట్ అయ్యిందో అందరికీ తెలుసు. ఇప్పుడు మరోసారి అదే కాంబినేషన్‌లో సినిమా అనగానే.. ‘గీతా గోవిందం’ రేంజ్‌లో అంచనాలు పెంచేసుకున్నారు ఫ్యాన్స్. ఆ అంచనాలను ‘ఫ్యామిలీ స్టార్’ అందుకుంటుందని విజయ్ ధీమా వ్యక్తం చేశాడు. ‘‘గీతా గోవిందం తరువాతి లెవెల్ ప్యాకేజ్ చేసి మీ దగ్గరికి తీసుకొస్తున్నాం. నేను ‘గీతా గోవిందం’ చేసేటప్పుడు అందరూ యాక్షన్ సినిమానా అని అడిగారు. యాక్షన్ సినిమా చేసినప్పుడు ‘గీతా గోవిందం’ లాంటి సినిమానా అని అడిగారు. అన్నీ కలిపి ఈసారి వస్తున్నాం. సినిమా మీరు విపరీతంగా ఎంజాయ్ చేస్తారని మేము గట్టిగా నమ్ముతున్నాం’’ అని నమ్మకంగా చెప్పాడు విజయ్.


బైక్ ర్యాలీ..


‘ఫ్యామిలీ స్టార్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కోసం విజయ్ దేవరకొండ తిరుపతికి వస్తున్నాడని తెలియగానే చాలామంది ఫ్యాన్స్ బైక్ ర్యాలీని ఏర్పాటు చేశారు. ఆ విషయాన్ని విజయ్ దేవరకొండ ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ‘‘నాకోసం బైక్‌పై వచ్చిన ఫ్యాన్స్ అందరికీ లీటర్ పెట్రోల్ కచ్చితంగా కొట్టించాలి. నేను తిరుపతి డిస్ట్రిబ్యూటర్‌ను రిక్వెస్ట్ చేస్తున్నాను. బైక్ మీద వచ్చిన బాయ్స్ అందరికీ మా తరపున లీటర్ పెట్రోల్ ప్లీజ్’’ అని విజయ్ అన్నాడు. దీంతో ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషీ అయ్యారు. ఎప్పుడు ఫ్యాన్స్‌ను కలిసినా వారికి ఏదో ఒక ఆఫర్ ఇచ్చే విజయ్.. ఈసారి పెట్రోల్ ఫ్రీగా ఇస్తానని ప్రకటించడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Also Read: ‘యానిమల్ పార్క్’ మొదలయ్యేది అప్పుడే - మూవీలో కొత్తగా ఎంట్రీ ఇచ్చే నటీనటులు వీరే