Animal Park Update: ఈరోజుల్లో సినీ పరిశ్రమలో సీక్వెల్స్ క్రేజ్ నడుస్తోంది. సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా ముందుగానే దాని సీక్వెల్స్‌ను ప్రకటించేస్తున్నారు మేకర్స్. అలాగే గతేడాది విడుదలయిన ‘యానిమల్’కు కూడా సీక్వెల్ ఉంటుందని, సీక్వెల్ మాత్రమే కాదు.. ఇదొక ఫ్రాంచైజ్‌లాగా తెరకెక్కిస్తానని సందీప్ రెడ్డి వంగా ఎప్పుడో ప్రకటించాడు. అయితే ‘యానిమల్’ను ఒక రేంజ్‌లో ఇష్టపడిన ప్రేక్షకులు.. దాని సీక్వెల్ అయిన ‘యానిమల్ పార్క్’ కోసం అప్పుడే ఎదురుచూపులు మొదలుపెట్టారు. తాజాగా ఈ మూవీ షూటింగ్ అప్డేట్‌కు సంబంధించిన రూమర్స్ బాలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్నాయి.


సమయం పడుతుంది..


‘యానిమల్’కంటే ప్రభాస్‌తో ‘స్పిరిట్’ సినిమాను అనౌన్స్ చేశాడు సందీప్ రెడ్డి వంగా. అందుకే ప్రస్తుతం ఆ మూవీ ప్రీ ప్రొడక్షన్‌లో బిజీ అయిపోయాడు. ప్రభాస్ కూడా బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్‌లో బిజీగా ఉండడంతో ‘స్పిరిట్’ సెట్స్‌పైకి వెళ్లడానికి ఇంకాస్త సమయం పడుతుందని తెలుస్తోంది. కానీ ఎలాగైనా 2024 డిసెంబర్‌లో ‘స్పిరిట్’ షూటింగ్‌ను ప్రారంభించాలని సన్నాహాలు చేస్తున్నాడట సందీప్. దీని తర్వాతే ‘యానిమల్ పార్క్’కు సమయాన్ని కేటాయించగలడు సందీప్. అయితే వచ్చే ఏడాదిలో అయినా ఈ మూవీ కచ్చితంగా షూటింగ్ ప్రారంభించుకుంటుంది అని ఫ్యాన్స్ నమ్ముతుండగా.. తాజాగా దానికి సంబంధించిన రూమర్స్ సినీ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతున్నాయి.


అన్ని సినిమాల తర్వాతే..


‘‘సందీప్ ఇప్పటికే యానిమల్ పార్క్ స్క్రిప్ట్ పనులు ప్రారంభించాడు. బేసిక్ కథను పూర్తిచేశాడు. యానిమల్‌లో కీలక పాత్రలు పోషించిన చాలామంది యానిమల్ పార్క్‌లో కూడా ఉండబోతున్నారు. రణబీర్ కపూర్, రష్మిక మందనా, తృప్తి దిమ్రీలు వారి వారి పాత్రల్లో మరోసారి కనిపించగా.. ఉపేంద్ర లిమాయేకు కూడా యానిమల్ పార్క్‌లో బలమైన రోల్ ఉండనుంది. ప్రస్తుతం పాత్రలు అన్నీ పేపర్‌పైనే ఉన్నాయి. వాటన్నింటిని స్క్రీన్ ప్లే ద్వారా దగ్గర చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎందరో కొత్త నటీనటులు కూడా ఇందులో భాగం కానున్నారు. యానిమల్ పార్క్ కంటే ముందే రణబీర్ కపూర్.. రామాయణ 1, 2తో పాటు లవ్ అండ్ వార్ షూటింగ్‌ను పూర్తిచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి’’ అని ప్రొడక్షన్ హౌజ్ సన్నిహితులు చెప్తున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే ఈ మూవీ 2026లో మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.


కొత్త నటీనటులు..


సీనియర్ నటుడు ఉపేంద్ర లిమాయే.. ‘యానిమల్’లో కూడా నటించారు. కానీ అందులో కేవలం ఒక్క సీన్‌లో మాత్రమే ఆయన కనిపించారు. అయితే ‘యానిమల్ పార్క్’లో మాత్రం ఆయన పాత్రకు నిడివితో పాటు ప్రాధాన్యత కూడా ఎక్కువ ఉంటుందని తెలుస్తోంది. వీరితో పాటు కొత్త నటీనటులు కూడా జాయిన్ అవుతారని తెలియడంతో అసలు వారు ఎవరు అయ్యింటారని ప్రేక్షకులు గెస్ చేయడం మొదలుపెట్టారు. 2023 డిసెంబర్ 1న విడుదలయిన ‘యానిమల్’.. ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్ల కలెక్షన్స్ సాధించింది. ఎంతోమంది విమర్శలు అందుకున్నా కూడా సినిమాను అభిమానించి ఇష్టపడిన వారు కూడా చాలామందే ఉన్నారు. ఆఖరికి ఈ సినిమాపై విమర్శలు అసెంబ్లీ వరకు కూడా వెళ్లాయి. దీంతో సినిమాను సినిమాలాగా మాత్రమే చూడాలని మూవీ లవర్స్ సలహా ఇచ్చారు. సందీప్ మాత్రం ఈ సినిమాపై వచ్చిన విమర్శలకు ఎప్పటికప్పుడు కౌంటర్ ఇస్తూనే ఉన్నాడు.


Also Read: నారా రోహిత్ ‘ప్రతినిధి 2’ టీజర్ - ఓటు వేయడం కుదరకపోతే చచ్చిపోండి, రూ.5 లక్షల కోట్ల అప్పు ఎలా తీర్చుతారు?