సినీ తారల పర్సనల్ లైఫ్ ఎలా ఉన్నా.. ఒక్కొక్కసారి వారి ప్రొఫెషనల్ లైఫ్ కోసం వారు ముందడుగు వేయాల్సి ఉంటుంది. పర్సనల్ లైఫ్‌లో ఎన్ని కష్టాలు ఎదుర్కుంటున్నా.. ఎంత బాధలో ఉన్నా.. కెమెరా ముందుకు రావాల్సిందే. తాజాగా విజయ్ ఆంటోనీ కూడా అదే పనిచేశారు. విజయ్ ఆంటోనీ.. తన పెద్ద కూతురిని పోగొట్టుకొని పది రోజులే అయ్యింది. అయినా ఆయన తరువాతి సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ విజయ్ ఆంటోనీ కావాలంటే ఆయన లేకుండా కూడా ప్రమోషన్స్ జరుగుతాయి. కానీ ఆయన మాత్రం స్వయంగా తన సినిమాను ప్రమోట్ చేయడానికి ముందుకొచ్చారు. ఈ విషయాన్ని ఆ చిత్ర నిర్మాత స్వయంగా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.


‘రత్తం’ ప్రమోషన్స్ కోసం


సెప్టెంబర్ 19న విజయ్ ఆంటోనీ పెద్ద కూతురు మీరా ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. ఈ మరణం సినీ పరిశ్రమను షాక్‌కు గురిచేసింది. అసలు ఆ అమ్మాయి ఎందుకిలా చేసింది అని చాలామంది సినీ ప్రముఖులతో పాటు ప్రేక్షకులు కూడా ఆశ్చర్యపోయారు. మీరా వయసు 16 ఏళ్లు మాత్రమే. దీంతో ఈ విషయం విజయ్ ఆంటోనీని ఎంతగా బాధపెడుతుందో.. తన ఫ్యాన్స్ ఊహించగలరు. అయినా కూడా తన సినిమా ‘రత్తం’.. త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. కూతురు చనిపోయింది అన్న బాధలో కూర్చొని ఉంటే.. మూవీ ప్రమోషన్స్ ఆగిపోతాయి. మూవీని సరిగా ప్రమోట్ చేయకపోతే.. సినిమాపై, దానికోసం పనిచేసిన టెక్నిషియన్లపై ప్రభావం పడుతుంది. అందుకే ఎంత బాధగా ఉన్నా.. విజయ్ ఆంటోనీ రంగంలోకి దిగారని ఆయన సన్నిహితులు తెలిపారు


ప్రేక్షకుల గురించి ఆలోచించే వ్యక్తి


విజయ్ ఆంటోనీ తన అప్‌కమింగ్ మూవీ ‘రత్తం’ ప్రమోషన్స్‌లో పాల్గొనడం మొదలుపెట్టారు. ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన ఫోటోలను నిర్మాత జీ ధనంజయన్ తన ట్విటర్‌లో షేర్ చేశారు. ‘‘ప్రొఫెషనలిజంకు సరైన ఉదాహరణ. నిర్మాతల పట్ల, ఆడియన్స్ పట్ల ఎంతో శ్రద్ధ వహిస్తారు విజయ్ ఆంటోనీ సార్’’ అంటూ క్యాప్షన్ కూడా పెట్టారు. ‘‘ఆయన మొత్తం ఇండస్ట్రీకి ఒక బెంచ్ మార్క్‌తో పాటు స్ఫూర్తిగా కూడా నిలిచారు. పర్సనల్ ట్రాజెడీని పక్కన పెట్టి మరీ తన టీమ్‌కు సపోర్ట్ చేసే వ్యక్తి. థాంక్యూ సార్’’ అంటూ విజయ్ ఆంటోనీని ప్రశంసించారు ధనంజయన్. నిర్మాత పెట్టిన ఈ పోస్టుకు నెటిజన్లు వివిధ రకాలుగా రియాక్ట్ అయ్యారు.






ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా


విజయ్ ఆంటోనీ.. తన పర్సనల్ లాస్‌ను పక్కన పెట్టి మరీ తన టీమ్‌కు సపోర్ట్ చేయాలని అనుకోవడం మంచి విషయమని కొందరు ఫ్యాన్స్ ప్రశంసించారు. కానీ మరికొందరు మాత్రం అందరికీ అలా ఉండడం సాధ్యం కాదు కాబట్టి.. ఇంకా ఏ సినీ సెలబ్రిటీకి అయినా ఇలాంటి నష్టం జరిగితే.. వారు వెంటనే కోలుకొని తమ ప్రొఫెషనల్ లైఫ్ మీద శ్రద్ధ పెట్టకపోతే.. వారు తక్కువ ప్రొఫెషనల్ ఏమీ అవ్వరని కామెంట్ చేశారు. మరికొందరు అయితే విజయ్ ఆంటోనీ చేస్తున్న పని తప్పు అని, ఆయన మానసికంగా కృంగిపోయి ఉన్నప్పుడు పనిచేస్తున్నందుకు ప్రశంసించడం తగదని అంటున్నారు. ఇక ‘రత్తం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం తన రెండో కూతురు లారాతో కలిసి కనిపించాడు విజయ్ ఆంటోనీ.


Also Read: విశాల్ ఆరోపణలపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం - విచారణకు ఆదేశం, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని వెల్లడి


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial