విభిన్న కథలను ఎంచుకోవడంలో వెంకీ మామ ఎప్పుడూ ముందు ఉంటాడు. టాలీవుడ్ సీనియర్ నటుడిగా తన ప్రత్యేకతను చాటుకుంటున్న విక్టరీ వెంకటేష్​ కెరీయర్​లో 75 వ చిత్రం విడుదలకు సిద్ధమవుతుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న పాన్ ఇండియా సినిమా ‘సైంధవ్’. ఈ సినిమాకు సంబంధించిన టీజర్​ని చిత్ర బృందం విడుదల చేసింది. వైల్డ్ లుక్​లో కనిపిస్తూ పాత విక్టరీ వెంకటేష్​ని గుర్తు చేశారు. సినిమా మొత్తం గన్స్, బుల్లెట్లు, రక్తపాతంతో నిండిపోయింది. “వెళ్ళే ముందే చెప్పి వెళ్ళాను వినలేదు. అంటే భయం లేదు లెక్క మారిద్ది” అంటూ విలన్స్ కి వెంకీ ఇచ్చే వార్నింగ్ అదిరిపోయింది. కీలకమైన ఆపరేషన్ కోసం మళ్ళీ వెంకటేష్ ని రంగంలోకి దింపినట్టుగా టీజర్ చూస్తే అర్థం అవుతోంది. ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ టీజర్ సినిమా మీద అంచనాలు మరింత పెంచేస్తుంది.


ఈ టీజర్​లో సినిమాలో కనిపించే రెండు విభిన్నమైన కోణాలు చూపించేశారు. భార్య, కూతురితో సంతోషంగా జీవితం సాగిస్తున్న వెంకీ అధికారులు ఇచ్చిన అసైన్ మెంట్ కోసం మళ్ళీ కథన రంగంలోకి అడుగుపెట్టాడు. విలన్ కి చుక్కలు చూపించాడు. ఇందులో విలన్ గా బాలీవుడ్ నటుడు నవాజుద్ధీన్ సిద్ధిఖీ కనిపించారు. తన పని నెరవేర్చుకోవడం కోసం ఎంతకైనా తెగించే ప్రతినాయకుడిగా కనిపించాడు. చిన్న పిల్లలకి తన పనుల కోసం నియమించుకుని వారికి శిక్షణ ఇచ్చి సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు ఉపయోగించుకోవడం టీజర్ లో చూపించారు.


దర్శకుడు శైలేష్ కొలను క్రైమ్, థ్రిల్లింగ్ సబ్జెక్ట్ ని హ్యాండిల్ చేయడంలో ఇప్పటికే తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. 'హిట్', 'హిట్ 2' సినిమాలతో టాలెంటెడ్ డైరెక్టర్​గా పేరు తెచ్చుకున్న శైలేష్ కొలను ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. వెంకటేష్ కెరియర్​లోనే భారీ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కుతుండగా.. ఇప్పటికే సినిమాపై ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. వెంకటేష్ నటిస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా కూడా ఇదే కావడం విశేషం. చంద్రప్రస్థ ఫిక్షనల్ పోర్ట్ ఏరియా బాగ్రాఫ్ లో సాగే సీక్రెట్ మిషన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో వెంకటేష్ కి జోడిగా జెర్సీ ఫేమ్ శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్గా నటిస్తుండగా.. రుహాని శర్మ, ఆండ్రియా జెర్మియా, జయప్రకాష్ కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. తమిళ హీరో ఆర్య కూడా ఓ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. 


Also Read: అశ్వినికి అర్థంకాని బిగ్ బాస్ - అమర్​ని పట్టుకుని అంత మాట అనేశారు ఏంటి!


ముందుగా ఈ చిత్రాన్ని డిసెంబర్ 22న క్రిస్మస్ కానుకగా విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఆరోజు ప్రభాస్ నటిస్తున్న 'సలార్' మూవీ రిలీజ్ ఉండడంతో సంక్రాంతికి జనవరి 13 న దక్షిణాది భాషలు, హిందీలో సినిమా విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై వెంకట్ బోయినపల్లి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా కిషోర్ తాళ్లూరి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.