Shriraj Nair Tweet on Annapoorani: నయనతార ల్యాండ్‌మార్క్ చిత్రమైన ‘అన్నపూర్ణి’ మూవీ చిక్కుల్లో పడింది. ఈ మూవీ ట్రైలర్ విడుదలయినప్పటి నుంచి చాలామంది ప్రేక్షకులు.. ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని, బ్రాహ్మణ కమ్యూనిటీని కించపరిచేలా ఉందని సినిమాను ఖండించడం మొదలుపెట్టారు. థియేటర్లలో విడుదలయిన తర్వాత కూడా కొంతకాలం వరకు ఈ సినిమాపై వివాదాలు నడిచాయి. ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్ నుంచి తొలగించాలని విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) ప్రతినిధి శ్రీరాజ్ నాయర్ ట్వీట్ చేశారు.




రామాయణంలో అలా చెప్పారంటూ డైలాగ్..


‘అన్నపూర్ణి’లోని ఒక సీన్‌ను శ్రీరాజ్ నాయర్ షేర్ చేశారు. అందులో ‘‘రాముడు, లక్ష్మణుడు, సీత వనవాసంలో ఉన్నప్పుడు.. వారికి ఆకలి అనిపించినప్పుడు జంతువులను చంపి, వండుకొని తిన్నారు. రామాయణంలోనే వారు నాన్ వెజ్ తిన్నారని రాసుంది. రాముడంటే శ్రీవిష్ణు అవతారమే కదా’’ అని హీరో జై.. నయనతారతో చెప్పిన డైలాగ్‌ను శ్రీరాజ్ నాయర్ ట్వీట్ చేశారు. ఇక దీనికి క్యాప్షన్‌గా ‘‘ఈ అరిష్టమైన సినిమాను వెంటనే తొలంగిచమని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను నెట్‌ఫ్లిక్స్. లేకపోతే చట్టపరమైన పరిణామాలను, బజరంగ్ దళ్ స్టైల్ యాక్షన్‌ను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి’’ అని క్యాప్షన్ కూడా పెట్టారు.






అలాంటి సందర్భంలో వచ్చే డైలాగ్..


నీలేష్ కృష్ణ తెరకెక్కించిన ‘అన్నపూర్ణి’లో నయనతార ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయిగా కనిపించింది. తను దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న చెఫ్ అవ్వాలని అనుకంటుంది. చెఫ్ అంటే అన్నిరకాల వంటలు చేయాలి. అదే క్రమంలో తను మాంసాహారం కూడా వండవలసి వస్తుంది. కానీ తన తండ్రి దానికి ఒప్పుకోడు. అలా బ్రాహ్మణ కుటుంబం, వారి నమ్మకాలు, హీరోయిన్ పాత్ర చెఫ్ అవ్వాలనుకునే కల చుట్టూనే ‘అన్నపూర్ణి’ కథ తిరుగుతుంది. అయితే తన తండ్రిని ఎదిరించి, తన కమ్యూనిటీ నమ్మకాలను కాదని మాంసాహారం వండాలా వద్దా అని సందేహంలో పడుతుంది. అదే సమయంలో తనకు నచ్చజెప్పడం కోసం జై చెప్పే డైలాగులనే శ్రీరాజ్ నాయర్ ట్వీట్ చేసినట్టు తెలుస్తోంది.


ఇప్పటికే ఎఫ్‌ఐఆర్ ఫైల్..


ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్ నుంచి ‘అన్నపూర్ణి’ని తొలగించాలని, సినిమాను పూర్తిగా బ్యాన్ చేయాలని శివసేన మాజీ లీడర్ రమేశ్ సోలంకి ఎఫ్‌ఐఆర్‌ను ఫైల్ చేసినట్టు సమాచారం. దానికే మూవీ టీమ్ ఇంకా స్పందించలేదు. నయనతారతో పాటు ఇతర మూవీ టీమ్ సభ్యులపై కూడా ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేశారు రమేశ్ సోలంకి. ‘అన్నపూర్ణి’ని యాంటీ హిందు సినిమా అని కూడా స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఒక బ్రాహ్మణ అమ్మాయి పాత్ర పోషిస్తూ.. మాంసం వండుతుంది. అలా వంట చేసేముందు తను నమాజ్ కూడా చేస్తుంది. సినిమాలోని ఈ సీన్స్.. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని రమేశ్ సోలంకి పేర్కొన్నారు. ఇక శ్రీరాజ్ నాయర్‌లాగానే హీరో జై పాత్ర రాముడిపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు.


Also Read: పాపం యశ్ - బాధను మిగిల్చిన బర్త్ డే, రెండు రోజుల్లో నలుగురు మృతి, హీరో వాహనం కిందే పడి..