దాదాపు నెల రోజులుగా ముంబైలోని సిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ ఆరోగ్యం ఇంకా పూర్తిగా కుదట పడలేదు. ఇప్పుడు ఆరోగ్యం మరింత క్షీణించింది. ఆమె పరిస్థితి విషమంగా మారిందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆమెను వెంటిలేటర్ సపోర్టుపై ఉంచారు. ఏబీపీ న్యూస్ తాజా నివేదిక ప్రకారం, ప్రముఖ గాయని ఆరోగ్యం క్షీణించింది. ఆమె ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్‌లోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స తీసుకుంటున్నారు.
92 ఏళ్ల లతామంగేష్కర్ జనవరి 8 ఆసుపత్రిలో చేరారు. కోవిడ్-19, న్యుమోనియాతో బాధపడుతున్న ఆమెను అప్పటి నుంచి వైద్యులు చికిత్స చేస్తున్నారు. డాక్టర్ ప్రతీత్ సమ్దానీ నేతృత్వంలోని వైద్యుల బృందం ఆమెకు వైద్యం చేస్తున్నారు. ఇవాళ లతా మంగేష్కర్ ఆరోగ్యంపై డాక్టర్ ప్రతీత్ సమ్దానీ ఓ కీలక ప్రకటన చేశారు. " సింగర్ లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితి మళ్లీ క్షీణించింది, ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఆమె వెంటిలేటర్‌పై ఉన్నారు. ఆమె ఇప్పటికీ ఐసియులో డాక్టర్ల పరిశీలనలో ఉన్నారు." -డాక్టర్ ప్రతిత్ సమదానీ, బ్రీచ్ కాండీ హాస్పిటల్
ఇంతకుముందు లతామంగేష్కర్ చికిత్సకు బాగా స్పందించారు. వెంటిలేటర్ కూడా తొలగించారు. దీంతో లతా కోలుకుంటున్నారని మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేష్ తోపే జనవరి 30న ప్రకటించారు. గాయని లతా మంగేష్కర్‌కి చికిత్స అందిస్తున్న ప్రతీత్ సమ్దానీతో మాట్లాడానని.. ఆమె కోలుకున్నారని... వెంటిలేటర్‌పై లేరని.. ఆక్సిజన్ మాత్రమే ఇస్తున్నారని పేర్కొన్నారు. చికిత్సకు బాగా స్పందిస్తున్నారని పేర్కొన్నారు.
లతామంగేష్కర్ టీం కూడా ఆమె ఆరోగ్యంపై స్పందించారు. అప్‌డేట్స్ అందిస్తూ వచ్చారు. ఆమెకు 'ట్రయల్ ఆఫ్ ఎక్స్‌ట్యూబేషన్' ఇచ్చినట్టు తెలియజేశారు.ఆమె ఆరోగ్యం విషమంగా ఉందని జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని అప్పట్లో వివరణ ఇచ్చారు.
కానీ ఇప్పుడు లంతామంగేష్కర్ అనారోగ్యం మరోసారి తిరగబెట్టింది. ఇప్పుడు వైద్యుల పర్యవేక్షణలో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఇది అభిమానులను తీవ్రంగా ఆందోళన కలిగిస్తోంది.
'క్వీన్ ఆఫ్ మెలోడీ' 'నైటింగేల్ ఆఫ్ ఇండియా' అని అభిమానులు ముద్దుగా పిలుపుచుకునే లతా మంగేష్కర్ ఏడు దశాబ్దాలుగా పాటలు పాడుతున్నారు. చాలా భాషల్లో తన గాత్ర మాధుర్యాన్ని పంచారు. 30వేలకుపైగా పాటలు పాడి అభిమానులను అలరించారు. అందుకే ఆమెకు భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం 'భారతరత్న అవార్డు' కూడా వరించింది.