చియాన్ విక్రమ్ (Chiyaan Vikram) కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'వీర ధీర సూర'. 'సేతుపతి', 'చిత్తా' సినిమాలతో పాపులరైన ఎస్.యు అరుణ్ కుమార్ దర్శకత్వం వహించారు. హెచ్.ఆర్. పిక్చర్స్, రియా శిబు నిర్మించారు. 'వీర ధీర సూర'ను రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. రెండో భాగం మార్చి 27న విడుదల కానుంది. ఎన్.వి.ఆర్ సినిమా తెలుగు రైట్స్ సొంతం చేసుకోగా... నైజాం ఏరియాలో మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా విడుదల అవుతోంది. ఈ రోజు తెలుగు టీజర్ విడుదల చేశారు.
జాతరలో స్పాట్ పెట్టిన ఎస్.జె. సూర్య...
వద్దురా అంటూ వార్నింగ్ ఇచ్చిన విక్రమ్!
Veera Dheera Soora Teaser Review: యాక్షన్, ఫ్యామిలీ డ్రామాగా 'వీర ధీర సూర' సినిమా తెరకెక్కించారు. విక్రమ్ తన భార్య (దుషార విజయన్), ఇంకా కుమార్తెతో కలిసి హ్యాపీగా ఉంటారు. అతనిది ఓ కిరాణా కొట్టు అని ఇంతకు ముందు విడుదల చేసిన గ్లింప్స్ ద్వారా అర్థమైంది. ఇప్పుడు అంతకు మించి అన్నట్టు చూపించారు.
ఎస్.జె. సూర్య ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ రోల్ చేశారు. ఆయన జాతరలో స్పాట్ పెడతారు. అక్కడికి హీరో విక్రమ్ వచ్చారా? లేదా? హీరోని చుట్టుముట్టిన గ్యాంగ్ ఎవరు? 'వద్దు' అంటూ విక్రమ్ వార్నింగ్ ఇచ్చింది ఎవరికి? పెళ్లి దుస్తుల్లో వచ్చి విక్రమ్ ఎందుకు ఫైట్ చేయాల్సి వచ్చింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
ఒక క్రైమ్ ఊరిలో జాతరకు అంతరాయం కలిగించినప్పుడు అక్కడి ప్రశాంతత అంతా చెదిరిపోతుంది. విక్రమ్ ప్రతీకారం తీర్చుకునేలా చేస్తుంది. ఆ తర్వాత ఏమైంది? అనేది సినిమా. విక్రమ్ మరోసారి అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. ఫ్యామిలీ మ్యాన్, రివెంజ్ తీర్చుకునే ఇంటెన్స్ మనిషిగా రెండు కోణాల్లో ఆదరగొట్టారు.
చియాన్ విక్రమ్, ఎస్.జె. సూర్య, సూరజ్ వెంజరమూడు, దుషార విజయన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కూర్పు: ప్రసన్న జికె, కళా దర్శకత్వం: సి.ఎస్.బాలచందర్, ఛాయాగ్రహణం: తేని ఈశ్వర్, సంగీతం: జి.వి. ప్రకాష్ కుమార్,దర్శకత్వం: ఎస్.యు. అరుణ్ కుమార్.