Varun Tej Pithapuram Campaign Schedule Details: జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే బరిలో నిలిచారు. ఏపీలోని పిఠాపురం నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల నామినేషన్ దాఖలు చేశారు. బాబాయ్ పవన్ (Pawan Kalyan)కు మద్దతుగా ప్రచారం చేయడానికి మెగా ప్రిన్స్, అబ్బాయ్ వరుణ్ తేజ్ కదిలారు. పిఠాపురంలో ఆయన పర్యటించనున్నారు.


పిఠాపురంలో వరుణ్ ప్రచారం చేసేది ఎప్పుడంటే?
వరుణ్ తేజ్ శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి రాజమండ్రి విమానంలో వెళ్లనున్నారని తెలిసింది. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో పిఠాపురం ప్రయాణం చేస్తారు. శనివారం, ఆదివారం... రెండు రోజుల పాటు పవన్ కళ్యాణ్ పోటీ చేసే నియోజకవర్గంలో ఆయన ప్రచారం చేయనున్నారు.


జనసేన పార్టీ తరఫున ప్రచారం చేయమని పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ఎవరినీ ఆహ్వానించలేదు. మెగా ఫ్యామిలీలో యంగ్ హీరోలను రాజకీయాలకు దూరంగా ఉండమని ఆయన సూచించినట్టు తెలిసింది. అయితే... బాబాయ్ పార్టీకి అండగా, బాబాయ్ నియోజకవర్గంలో తానూ ప్రచారం చేయాలని వరుణ్ తేజ్ ముందుకు వచ్చారని ఆయన సన్నిహిత వర్గాలు చెప్పాయి. వరుణ్ తండ్రి, మెగా బ్రదర్ నాగబాబు జనసేన పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు.


పవన్ కోసం చిరంజీవి సైతం ప్రచారం చేస్తారా?
పిఠాపురంలో మెగాస్టార్ చిరంజీవి సైతం ప్రచారం చేయనున్నారని రాజకీయ, సినీ వర్గాల్లోనూ, సోషల్ మీడియాలోనూ వినబడుతోంది. అయితే... ఆ ప్రచారంలో నిజం లేదని మెగా ఫ్యామిలీ వర్గాలు తెలిపాయి. రాజకీయ ప్రచారంలో చిరు పాల్గొనడం లేదని స్పష్టం చేశాయి. అయితే... తమ్ముడికి అన్నయ్య అండదండలు చాలా మెండుగా ఉన్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. జనసేన పార్టీకి ఆయన ఐదు కోట్ల రూపాయలు విరాళంగా ఇవ్వడమే కాదు... అబ్బాయ్ రామ్ చరణ్ చేత కూడా మరికొంత ఆర్థిక సహాయం చేయించారు. పార్టీకి ఫండ్ ఇప్పించారు.


Also Read: రత్నం రివ్యూ: సింగమ్ సిరీస్ హరి దర్శకత్వంలో విశాల్ హ్యాట్రిక్ ఫిల్మ్.... అవుట్ డేటెట్ యాక్షన్ సినిమాను చూడగలమా?



పవన్ నామినేషన్ ర్యాలీలో నిర్మాత బన్నీ వాసు, ఎస్కేఎన్!
పవన్ కళ్యాణ్ నామినేషన్ దాఖలు చేసిన ర్యాలీకి అనూహ్య స్పందన లభించింది. పిఠాపురంలో ప్రజలు అందరూ రోడ్డు మీదకు బైకులు, కార్లు వేసుకుని వచ్చారా? అనేంతలా జన సందోహం కనిపించింది. ఆ ర్యాలీలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సన్నిహితుడు, జీఏ 2 పిక్చర్స్ పతాకంపై సినిమాలు నిర్మించే 'బన్నీ' వాసుతో పాటు 'బేబీ' దర్శక నిర్మాతలు సాయి రాజేష్, ఎస్కేఎన్ కూడా పాల్గొన్నారు. సోషల్ మీడియాలోనూ జనసేనానికి మద్దతుగా పోస్టులు చేస్తున్నారు. 


పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం ఖాయమని, భారీ మెజారిటీతో ఆయన అసెంబ్లీలో అడుగు పెడతారని మెగా అభిమానులు, ఫ్యామిలీ వర్గాలు ధీమాగా చెబుతున్నాయి. ఏపీ అసెంబ్లీలోని అన్ని నియోజకవర్గాల కంటే ఈ నియోజకవర్గం మీద ఎక్కువ మంది దృష్టి పడిందని చెప్పవచ్చు.


Also Read: కాజల్‌ తో నవీన్ చంద్ర లవ్లీ రొమాంటిక్ సాంగ్ - సత్యభామ సరసం చూడండి