Varun Tej: తమ అభిమాన నటీనటుల గురించి, వారి పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవాలని ఫ్యాన్స్ ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటారు. అందుకే గూగుల్‌లో ఈ సమాచారం కోసం వెతుకుతుంటారు. కానీ కొన్నిసార్లు గూగుల్‌కు కూడా ఫ్యాన్స్ ప్రశ్నలకు సమాధానాలు తెలియదు. అందుకే అలాంటి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి మెగా హీరో వరుణ్ తేజ్ ముందుకొచ్చాడు. ప్రస్తుతం తన అప్‌కమింగ్ మూవీ ‘ఆపరేషన్ వాలెంటైన్’ ప్రమోషన్స్ బాధ్యత అంతా తనపై వేసుకున్నాడు వరుణ్. ఈ సినిమాను ఎక్కువగా ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా చేయాలని ఫ్యాన్స్‌తో ఎక్కువగా ఇంటరాక్ట్ అవుతున్నాడు. అందులో భాగంగా తన గురించి ఫ్యాన్స్ గూగుల్ చేసే ప్రశ్నలకు సమాధానాలిచ్చాడు.


హైట్ ఎంతంటే..?


ముందుగా వరుణ్ తేజ్ అసలు పేరు ఏంటి అనే ప్రశ్నకు సమాధానమిచ్చాడు వరుణ్. ‘‘నా అసలు పేరు సాయి వరుణ్ తేజ్ కానీ స్క్రీన్‌పైన పెద్దగా ఉంటుంది అని సాయి అని తీసేశారు. నా పాస్‌పోర్ట్‌తో పాటు మిగతావాటిలో కూడా సాయి వరుణ్ తేజ్ అనే ఉంటుంది’’ అని బయటపెట్టాడు. తన పెళ్లి గురించి ప్రేక్షకులు ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారని తెలిసి.. ‘‘మామూలుగా ఇద్దరు యాక్టర్లు పెళ్లి చేసుకున్నప్పుడు ప్రేక్షకులు ఆసక్తితో సెర్చ్ చేయడం కామన్. దాని గురించి ప్రత్యేకంగా చెప్పడానికి ఏం లేదు’’ అని స్టేట్‌మెంట్ ఇచ్చాడు. ఇక తన హైట్ గురించి మాట్లాడుతూ.. ‘‘మొదట్లో నేను హీరో అయినప్పుడు కూడా గూగుల్‌లో ఎక్కువగా నా హైట్ గురించే సెర్చ్ చేశారు. నేను 194 సెంటిమీటర్లు ఉన్నాను. అంటే దాదాపు 6.4 అడుగులు ఉంటాను’’ అని ఫ్యాన్స్ డౌట్‌కు క్లారిటీ ఇచ్చాడు వరుణ్ తేజ్.


బడ్జెట్‌ను బట్టి రెమ్యునరేషన్..


వరుణ్ తేజ్ రెమ్యునరేషన్ ఎంత అని కూడా ఫ్యాన్స్ గూగుల్ సెర్చ్ చేశారు. అది చూసిన వరుణ్.. ‘‘ఎంత అంటే ఎంతోకొంత’’ అని జోక్ చేశాడు. ఆ తర్వాత ‘‘సినిమాను బట్టి ఛార్జ్ చేస్తాను. ఒకే అమౌంట్ అనేది ఏం తీసుకోను. సినిమా బడ్జెట్‌ను బట్టి తీసుకుంటాను’’ అని బయటపెట్టాడు. అంతే కాకుండా తన డైట్, వర్కవుట్స్ గురించి కూడా చెప్పుకొచ్చాడు. ‘‘ముందుగా వర్కవుట్ విషయంలో అంత కఠినంగా ఉండేవాడిని కాదు. కానీ గని సినిమా తర్వాత ఎక్కువగా చేస్తున్నాను. ముందుగా లేవగానే 5 కిలోమీటర్లు కార్డియో చేస్తాను. సాయంత్రం సమయం ఉన్నా.. లేకపోయినా.. జిమ్‌కు వెళ్లినా, వెళ్లకపోయినా.. ఉదయం కార్డియో మాత్రం కచ్చితంగా చేస్తాను. ఇప్పుడు కొంచెం బ్రేక్ తీసుకున్నాను. కానీ రోజుకు 3 నుండి 4 సార్లు వెయిట్ లిఫ్టింగ్ చేస్తాను’’ అని స్పష్టం చేశాడు. ఇప్పటికీ తను తల్లిదండ్రులతో కలిసి మణికొండలోనే ఉంటున్నట్టు తెలిపాడు వరుణ్.


రెండుసార్లు వాయిదా..


‘ఆపరేషన్ వాలెంటైన్’ విషయానికొస్తే.. బాలీవుడ్ డైరెక్టర్ శక్తి సింగ్ ప్రతాప్.. ఈ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు. తెలుగుతో పాటు హిందీలో కూడా ఈ మూవీ షూటింగ్ జరిగింది. ‘ఆపరేషన్ వాలెంటైన్’తో బాలీవుడ్ ప్రేక్షకులను నేరుగా పలకరించనున్నాడు వరుణ్. ఇందులో మాజీ మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్ హీరోయిన్‌గా నటించింది. తాజాగా రామ్ చరణ్ చేతుల మీదుగా విడుదలయిన ట్రైలర్.. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ రుద్రగా వరుణ్ తేజ్ కనిపించనున్నాడు. ఇప్పటికే ‘ఆపరేషన్ వాలెంటైన్’ రెండుసార్లు విడుదలను వాయిదా వేసుకోగా.. ఫైనల్‌గా మార్చి 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Also Read: కాస్ట్లీ కార్ కొన్న ప్రియమణి - కాస్ట్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!