Varun Tej’s Matka: 'గాండీవధారి అర్జున' ఫ్లాప్ తర్వాత మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. రెండు పాన్ ఇండియా సినిమాలని లైన్ లో పెట్టారు. ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలని కసితో పని చేస్తున్నారు. ఇప్పటికే శక్తి ప్రతాప్‌ సింగ్‌ హడా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆపరేషన్ వాలెంటైన్' మూవీ రిలీజ్ కు రెడీ అయింది. దీని తర్వాత మట్కా అనే యాక్షన్ డ్రామాతో ప్రేక్షకులని పలకరించబోతున్నారు. 'పలాస' ఫేమ్ కరుణ కుమార్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే మేకర్స్ ఈ మూవీని ప్రస్తుతానికి హోల్డ్ లో పెట్టినట్లుగా ఓ రూమర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.


'మట్కా' అనేది 1958 - 1982 మధ్య కాలంలో వైజాగ్ బ్యాక్‌డ్రాప్‌లో సెట్ చేయబడిన పీరియాడిక్ యాక్షన్ మూవీ. యావత్ దేశాన్ని కదిలించిన ఓ వాస్తవ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అయితే భారీ స్థాయిలో తలపెట్టిన ఈ ప్రాజెక్టును బడ్జెట్ పరిమితుల కారణంగా మేకర్స్ హోల్డ్‌లో పెట్టారని గాసిప్స్ వినిపిస్తున్నాయి. నాన్-థియేట్రికల్ డీల్స్, రికవరీలను పరిగణనలోకి తీసుకుని, నిర్మాతలు బడ్జెట్ కంట్రోల్ పై దృష్టి పెట్టారని అంటున్నారు. ఈ క్రమంలో వరుణ్ తేజ్ ను రెమ్యునరేషన్ తగ్గించుకోవాలని చ‌ర్చ‌లు జరుపుతున్నారని కూడా పుకార్లు వస్తున్నాయి. 


'హాయ్ నాన్న' సినిమాని నిర్మించిన వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై మోహన్ చెరుకూరి (సివిఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల భారీ ఎత్తున 'మట్కా' సినిమాని ప్లాన్ చేశారు. అయితే నిర్మాతల్లో ఒకరైన చెరుకూరి మోహన్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోగా.. SRT ఎంటర్‌టైన్‌మెంట్స్ రామ్ తాళ్లూరి నిర్మాణంలో భాగస్వాములు అయ్యారు. ఇప్పుడు బడ్జెట్ పరిమితుల కారణంగా ఫిబ్రవరి, మార్చి షెడ్యూల్స్ రద్దు చేశారట. ఈ ప్రాజెక్ట్ ఆగిపోలేదు కానీ, ప్రస్తుతానికి తాత్కాలికంగా షూటింగ్‌ను నిలిపివేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.


Also Read: 'గుంటూరు కారం' తర్వాత అమ్మడికి కొత్త ఆఫర్స్ రావడం లేదా?


ఇదిలా ఉంటే మెగా హీరో మూవీకి బడ్జెట్ సమస్యలు తలెత్తాయనే వార్తల్లో నిజం లేదనే టాక్ కూడా బయటకి వచ్చింది. 'మట్కా' సినిమా హోల్డ్ లో పడటానికి వరుణ్ తేజ్ షూటింగ్ కు కాస్త బ్రేక్ తీసుకోవడమే కారణమనే వాదన వినిపిస్తోంది. 'ఆపరేషన్ వాలెంటైన్' తన కెరీర్ లోనే ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడంతో, దూకుడుగా ప్రమోషన్స్ చేయటం కోసమే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. త్వరలోనే తిరిగి కరుణ కుమార్ సినిమా సెట్స్ లో అడుగుపెడతారని అంటున్నారు.  


'మట్కా' 50, 80ల మధ్య జరిగే కథ కావడంతో, అదే వాతావరణాన్ని రీక్రియేట్ చేయడానికి భారీ సెట్‌లు రూపొందిస్తున్నారు. హైదరాబాద్‌లో ఓల్డ్ వైజాగ్‌ సిటీని తలపించే భారీ సెట్‌ని నిర్మిస్తున్నారు. ఇది వరుణ్ తేజ్ కెరీర్ లోనే హయ్యస్ట్ బడ్జెట్ మూవీ కానుంది. దీని కోసం మెగా ప్రిన్స్ పూర్తిగా మేక్ఓవర్ అయ్యారు. 24 ఏళ్ల స్పాన్ కలిగిన ఈ స్టోరీలో నాలుగు విభిన్నమైన గెటప్‌లలో కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ గ్లింప్స్ లో ఆకట్టుకున్నారు.


ఈ సినిమా వరుణ్ తేజ్ సరసన మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటిస్తున్నారు. నవీన్ చంద్ర, కన్నడ కిషోర్, రవీంద్ర విజయ్, పి. రవిశంకర్‌, అజయ్ ఘోష్, మైమ్ గోపి కీలక పాత్రల్లో కనిపిస్తారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాకి కిషోర్ కుమార్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. 'మట్కా' చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.


Also Read: తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్న కల్ట్ లవ్ స్టోరీల - ప్రేమికులు తప్పక చూడాల్సిన చిత్రాలు ఇవే!