తమిళ హీరో దళపతి విజయ్‌తో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన తమిళ సినిమా ‘వారిసు (తెలుగులో వారసుడు)’. గత కొంత కాలం నుంచి ఈ సినిమా వివాదాల్లో ఇరుక్కుంటున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి తెలుగునాట చిరంజీవి ‘వాల్తేర్ వీరయ్య’, బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ చిత్రాల కంటే ఎక్కువ థియేటర్లలో, పెద్ద స్థాయిలో విడుదల కానుందని వార్తలు వస్తుండటంతో తెలుగు సినిమా అభిమానులు ఈ సినిమాపై విరుచుకుపడుతున్నారు.


ఇప్పుడు ఈ సినిమా మరో వివాదంలో ఇరుక్కుంది. ముందస్తు అనుమతి లేకుండా ఏనుగులతో షూటింగ్ చేసినందుకు గానూ ‘యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా’ ఈ సినిమా బృందానికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరణను ఏడు రోజుల్లో అందించాల్సిందిగా నోటీసులో పేర్కొన్నారు. లేకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీనికి చిత్ర బృందం ఎలా స్పందిస్తుందో చూడాలి!


‘వారసుడు’ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుంది. శరత్‌కుమార్, శ్రీకాంత్, కిక్ శ్యామ్, ప్రభు, ప్రకాష్ రాజ్, ఖుష్బు, సంగీత, జయసుధ, యోగిబాబులు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. లేటెస్ట్ సెన్సేషన్ ఎస్ఎస్ థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇటీవలే విడుదలైన తమిళ పాట ‘రంజితమే’ సూపర్ హిట్ అయింది. 60 మిలియన్లకు పైగా వ్యూస్‌తో దూసుకుపోతుంది. ఈ పాటకు సంబంధించిన తెలుగు వెర్షన్‌ను ఇంకా నిర్మాణ సంస్థ విడుదల చేయలేదు.


కార్తీక్ పళణి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తుండగా, ప్రవీణ్ కేఎల్ ఎడిటింగ్ చేస్తున్నారు. తమిళనాట ప్రముఖ నిర్మాణ సంస్థ 7 స్క్రీన్ స్టూడియోస్ ఈ సినిమాను పంపిణీ చేస్తుంది. తెలుగులో వాల్తేర్ వీరయ్య, వీరసింహారెడ్డి, తమిళంలో అజిత్ ‘తునివు’తో ‘వారిసు’ పోటీ పడనుంది.