నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ 'భగవంత్ కేసరి'. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. విజయదశమి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. మరోవైపు మేకర్స్ జోరుగా ప్రమోషనల్ కార్యక్రమాలు నిర్వహిస్తూ సినిమాకు కావాల్సినంత బజ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా 'ఉయ్యాలో ఉయ్యాల' అనే పాట లిరికల్ వీడియోను విడుదల చేసారు.
‘భగవంత్ కేసరి’ చిత్రం నుంచి ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రచార చిత్రాలు, గ్లిమ్స్, టీజర్ మరియు ఫస్ట్ సింగిల్ నందమూరి ఫ్యాన్స్ ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం విడుదలైన 'ఉయ్యాలో ఉయ్యాల' సాంగ్ కూడా సంగీత ప్రియులను అలరిస్తోంది. 'ఉడతా ఉడతా ఉషా ఉష్.. సప్పుడు చెయ్యకురి.. నీకన్నా మస్తుగా ఉరుకుతాంది మా సిట్టి సిన్నారి' అంటూ తెలంగాణ జానపద శైలిలో ఈ పాట సాగింది.
తండ్రీ కూతుళ్ళ అనుబంధం నేపథ్యంలో ‘భగవంత్ కేసరి’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. బాలయ్య కూతురుగా యంగ్ బ్యూటీ శ్రీలీల కనిపించనుంది. 'ఉయ్యాలో ఉయ్యాల' పాటలో వీరిద్దరి మధ్య ప్రేమానురాగాలను, బాండింగ్ ను చూపించారు. స్కూల్ గర్ల్ గా, యుక్త వయసు అమ్మాయిగా శ్రీలీల చాలా అందంగా కనిపించింది. ఇందులో బాలయ్య తన కుమార్తెకు తల్లిగా మారి లాలి పాడటం, స్నానం చేయించడం, జడ వెయ్యడం, అన్నం తినిపించడం వంటివి మనసులను తాకుతాయి. మధ్యలో వచ్చే బతుకమ్మ లిరిక్స్ కూడా ఆకట్టుకుంటాయి.
ఒక రకంగా 'ఉయ్యాలో ఉయ్యాల' అనేది తండ్రులు తమ పిల్లల కోసం పాడుకునే జోల పాటలా ఉంది. సంగీతంతో పాటుగా పిక్చరైజేషన్ కూడా చాలా బాగుంది. ఈ సినిమాలో యాక్షన్ తో పాటుగా హృదయాన్ని కదిలించే ఎమోషన్స్ కూడా ఉన్నాయని ఈ పాట ద్వారా చెప్పకనే చెబుతున్నారు. దీనికి మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ వినసొంపైన మెలోడీ ట్యూన్ కంపోజ్ చేసారు. గీత రచయిత అనంత్ శ్రీరామ్ నేపథ్యానికి తగ్గట్టుగా తెలంగాణ సాహిత్యం అందించగా, ఎస్పీ చరణ్ అద్భుతంగా ఆలపించారు. ఈ సాంగ్ భాను మాస్టర్ కొరియోగ్రఫీ చేసారు. సి.రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ నిర్వహించగా.. రాజీవన్ ప్రొడక్షన్ డిజైనర్ గా, తిమ్మిరాజు ఎడిటర్ గా వర్క్ చేసారు.
'భగవంత్ కేసరి' చిత్రంలో బాలకృష్ణకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. దసరా సందర్భంగా అక్టోబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
Also Read: 'తలైవర్ 170'లో బిగ్ బి - 32 ఏళ్ళ తర్వాత ఒకే సినిమాలో ఇద్దరు 'సూపర్ స్టార్స్'
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial