తెలుగు సినీ ఇండస్ట్రీలో లో ఒకప్పుడు అగ్ర నిర్మాణ సంస్థగా పేరొందిన శ్రీ స్రవంతి మూవీస్ అధినేత ప్రముఖ నిర్మాత స్రవంతి రవి కిషోర్ నిర్మించిన తాజా చిత్రం 'దీపావళి'(Deepavali). ఆర్.ఏ వెంకట్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కృష్ణ చైతన్య సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. పూ రాము, కాళీ వెంకట్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం రవికిషోర్ నిర్మించిన తొలి తమిళ సినిమా 'కిడ' కి తెలుగు అనువాదం. ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం నవంబర్ 11న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కాబోతుంది.
ఈ క్రమంలోనే చిత్ర ట్రైలర్ ని ఉస్తాద్ హీరో రామ్ పోతినేని తన ట్విట్టర్ వేదికగా విడుదల చేస్తూ చిత్ర బృందానికి తన బెస్ట్ విషెస్ అందజేశారు. పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కిన 'దీపావళి' ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. అనగనగా ఓ మేక దాని పేరు అబ్బులు. దేవుడికి మొక్కుకున్న మేక అది. ఆ మేక అంటే ఇంట్లో చిన్నపిల్లాడైన గణేష్ కు ప్రాణం. దాని తోడు లేకుండా ఎక్కడికి వెళ్ళడు. అయితే దీపావళికి కొత్త డ్రెస్ వేసుకోవాలనే గణేష్ ఆశ ఆ మేకకు ముప్పు తిప్పులు తెచ్చిపెడుతుంది. ఆ తర్వాత ఏమైందనేది తెలుసుకోవాలంటే దీపావళి సినిమా చూడాల్సిందే.
ఇక ట్రైలర్ ని పరిశీలిస్తే.. పల్లెటూరిలో పేద, మధ్య తరగతి ప్రజల జీవితాలని ఎంతో న్యాచురల్ గా చూపించారు. తాత, మనవడు, ఓ మేక.. వీళ్ళ మధ్య బంధాన్ని ఎంతో బలంగా చూపించారు. దీపావళి పండుగకు కొత్త డ్రెస్ కొని ఇవ్వమని మనవడు తాతను అడగడంతో తాత మేకను అమ్మడానికి సిద్ధపడతాడు. అయితే అది మొక్కుబడి మేక కావడంతో ఊరి జనాలు దానిని కొనడానికి ముందుకు రారు. కానీ కొత్తగా మటన్ షాప్ పెట్టుకోవాలని వీరబాబు ఆ మేకను కొనడానికి ముందుకు వస్తాడు. ఆ తర్వాత మేకను మరొకరు దొంగతనం చేస్తారు. తర్వాత ఏమైందనేదే ఈ సినిమా కథ. మేకకు టాలీవుడ్ కమెడియన్ సప్తగిరి వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం.
ఇక ట్రైలర్ విడుదల సందర్భంగా నిర్మాత స్రవంతి రవి కిషోర్ మాట్లాడుతూ.." తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని నవంబర్ 11న విడుదల చేస్తున్నాం. నేటివిటీకి పెద్దపీట వేస్తూ తీసిన సినిమా ఇది. ప్రతి ఫ్రేమ్ లో సహజత్వం కనిపిస్తుంది. తాతయ్య, మనవడు, మేక మధ్య అనుబంధం, వాళ్ళ భావోద్వేగం ప్రేక్షకుల హృదయాలను కదిలిస్తుంది. అటు విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల మన్ననలు అందుకునే సినిమా ఇది. ఆదిత్య మ్యూజిక్ ద్వారా త్వరలో తెలుగు, తమిళంలో పాటలు విడుదల చేస్తాం" అని అన్నారు. దీపన్, పాండియమ్మ, విజయ, కమలి తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి థీసన్ సంగీతం అందించగా ఎం. జయ ప్రకాష్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. ఆనంద్ గెర్లడిన్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టగా కేబీ నందు ఆర్ట్ డైరెక్టర్ గా పని చేశారు.
Also Read : బాలీవుడ్ ను షేక్ చేస్తున్న హైదరాబాదీ ర్యాపర్ - కేడెన్ హైదరాబాదీ ర్యాప్ సాంగ్ విన్నారా!