'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం'... మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. అందువల్ల, ఈ వారం తెలుగులో భారీ, మీడియం బడ్జెట్ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రావడం లేదు. రాజ్ తరుణ్ 'స్టాండప్ రాహుల్' సహా కొన్ని చిన్న చిత్రాలు వస్తున్నాయి. అయితే... పునీత్ రాజ్ కుమార్ 'జేమ్స్', అక్షయ్ కుమార్ 'బచ్చన్ పాండే', దుల్కర్ సల్మాన్ 'సెల్యూట్', విద్యా బాలన్ 'జల్సా' వంటి పరభాషా చిత్రాలు ఉన్నాయి. ఈ వారం థియేటర్ / ఓటీటీల్లో విడుదలకు సిద్ధమైన చిత్రాల వివరాలు...


పునీత్ రాజ్ కుమార్ 'జేమ్స్'
పునీత్ రాజ్ కుమార్... భూలోకం వదిలి మరో లోకానికి వెళ్ళిపోయారు. చిన్న వయసులో పునీత్ మరణించడం పలువుర్ని కలచివేసింది. ఆయన వెళ్ళినా... సినిమాల రూపంలో పునీత్ జ్ఞాపకాలు పదిలంగా ఉన్నాయి. ఆయన నటించిన 'జేమ్స్' ఈ వరం విడుదలవుతోంది. కన్నడతో పాటు తెలుగులో ఈ నెల 17న విడుదల చేస్తున్నారు. ఇందులో తెలుగు హీరో శ్రీకాంత్ ప్రధాన పాత్ర చేశారు. పునీత్ మరణం తర్వాత వస్తున్న సినిమా కావడంతో 'జేమ్స్'కు వెళ్లాలని పాన్ చేస్తున్న కన్నడ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులు సైతం చాలా మంది ఉన్నారు. రివ్యూలకు అతీతంగా ఈ సినిమాను చూసే ప్రేక్షకులు ఎక్కువమంది ఉండవచ్చు. పునీత్ రాజ్ కుమార్‌కు ఇచ్చే గౌరవం అది!


'స్టాండ్ అప్ రాహుల్'
తెలుగులో ఈ వారం విడుదలవుతున్న చిత్రాల్లో చెప్పుకోదగ్గ చిత్రం 'స్టాండప్ రాహుల్'. రాజ్ తరుణ్ హీరోగా, వర్ష బొల్లమ్మ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి శాంటో మోహన్ వీరంకి దర్శకుడు. మార్చి 18న సినిమా విడుదలవుతోంది. ఇందులో స్టాండప్ కమెడియన్ రోల్ చేశారు రాజ్ తరుణ్. కొన్నాళ్లుగా ఆయన సరైన విజయం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాతో ఆ విజయం దక్కుతుందని ఆశిస్తున్నారు. 'స్టాండప్ రాహుల్'తో పాటు సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వం వహించిన '69 సంస్కార్ కాలనీ' సినిమా కూడా ఈ వారమే (మార్చి 18న) విడుదలవుతోంది. ఎస్తేర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా సైతం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. తెలుగులో మరో రెండు చిన్న చిత్రాలు 'నల్లమల', 'డైరెక్టర్' కూడా ఈ వారం విడుదల అవుతున్నాయి.


అక్షయ్ కుమార్ 'బచ్చన్ పాండే'
అక్షయ్ కుమార్ హీరోగా నటించిన సినిమా 'బచ్చన్ పాండే'. కృతి సనన్ హీరోయిన్. జాక్వలిన్ ఫెర్నాండేజ్ మరో హీరోయిన్. ఆమె ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో కనిపిస్తారు. ఈ సినిమా మార్చి 18న విడుదలవుతోంది. తమిళ సినిమా 'జిగ‌ర్తాండ‌'కు రీమేక్ ఇది. తెలుగులో 'గద్దలకొండ గణేష్' సినిమా ఉంది కదా! అదే కథ అన్నమాట. అయితే... తమిళంలో, తెలుగులో దర్శకుడి పాత్రను మరో హీరో చేశారు. హిందీలో ఆ పాత్రను హీరోయిన్‌గా మార్చారు. దాంతో కథ కొత్తగా అనిపించే అవకాశం ఉంది. ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలని ఎదురు చూస్తున్న తెలుగు ప్రేక్షకులు కూడా ఉన్నారు.



దుల్కర్ సల్మాన్ 'సెల్యూట్'
పోలీస్ అధికారి పాత్రలో దుల్కర్ సల్మాన్ నటించిన సినిమా 'సెల్యూట్'. సోనీ లివ్ ఓటీటీలో ఈ నెల 18న విడుదల కానుంది. 'హే సినామిక'తో థియేటర్లలో ఆశించిన విజయాన్ని అందుకోవడంలో విఫలమైన దుల్కర్, ఈ సినిమాతో బౌన్స్ బ్యాక్ అవుతారని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. ఇదొక థ్రిల్లర్ సినిమా.


విద్యా బాలన్ 'జల్సా'
హిందీ హీరోయిన్ విద్యా బాలన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జల్సా'. సురేష్ త్రివేది దర్శకత్వం వహించారు. ఇందులో షెఫాలీ షా, మానవ్ కౌల్, రోహిణీ హట్టంగడి తదితరులు నటించారు. హిట్ అండ్ రన్ కేస్ నేపథ్యంలో థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా మార్చి 18న అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విడుదల కానుంది. 


కిరణ్ అబ్బవరం 'సెబాస్టియన్ పీసీ 524'
తెలుగులో ఈ వారం ఓటీటీలో విడుదల అవుతున్న సినిమా 'సెబాస్టియన్ పీసీ 524'. కిరణ్ అబ్బవరం పోలీస్ కానిస్టేబుల్ రోల్ చేశారు. నువేక్ష హీరోయిన్. ఇందులో కోమలీ ప్రసాద్ హీరోయిన్. థియేటర్లలో మార్చి 4న విడుదలైంది. మార్చి 18న ఆహా వీడియో ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది.