Upasana Konidela about Vijay Political Entry: కోలీవుడ్‌లో స్టార్ హీరోగా ఎదిగి.. ఇప్పుడు తనకంటూ ఒక సొంత పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు విజయ్. ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్ నడుస్తోంది. పొలిటికల్ సర్కిల్స్‌లో మాత్రమే కాదు.. సినీ సర్కిల్స్‌లో కూడా ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. అందుకే ప్రస్తుతం విజయ్ పొలిటికల్ ఎంట్రీపై చాలామంది సినీ సెలబ్రిటీల అభిప్రాయం ఏంటని ప్రేక్షకులు తెలుసుకోవాలని అనుకుంటున్నారు. తాజాగా రామ్ చరణ్ భార్య, మెగా కోడలు ఉపాసన కొణిదెలకు కూడా అదే ప్రశ్న ఎదురయ్యింది. భవిష్యత్తులో తాను రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఏమైనా ఉందా అనే ప్రశ్నకు తను ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు.


సక్సెస్ అవ్వాలనే కోరుకుంటున్నాను..


బిజినెస్ ఫ్యామిలీ అయినా కూడా తమ కుటుంబంలో రాజకీయాల గురించి చర్చలు ఎక్కువగా జరుగుతుంటాయా అనే ప్రశ్నకు.. అలా ఏం జరగవని సమాధానమిచ్చారు ఉపాసన. అంతే కాకుండా తనకు కూడా రాజకీయాలపై ఎలాంటి అభిప్రాయం లేదని తెలిపారు. పాలిటిక్స్‌లోకి ఎంటరయ్యే అవకాశాల్లేవని స్పష్టం చేశారు. ‘‘రాజకీయ నాయకుల ఉద్దేశం మంచిదైతే.. దేశానికి మంచి జరుగుతుందని నమ్ముతాను. వారంతా ప్రజలను ఇన్‌స్పైర్ చేయాలి. వాళ్లపై నమ్మకంతోనే ప్రజలు ఓటు వేస్తారు. అందుకే ఓటర్ల నమ్మకాన్ని ఎప్పుడూ ఒమ్ము చేయకూడదు. ప్రజలను సంతోషంగా ఉంచాలని లీడర్లకు కూడా తెలుసు. ఏ పార్టీకి ఓటు వేసామన్నది కాదు.. మనిషికి మనిషి సాయం చేస్తేనే ఒకటిగా విజయం సాధిస్తాం’’ అని రాజకీయాల గురించి మాట్లాడారు. తమిళ హీరో విజయ్.. రాజకీయాల్లోకి ఎంటర్ అవుతుండగా.. అది చాలా డైనమిక్ నిర్ణయం అని కామెంట్ చేశారు ఉపాసన. సినిమాల్లో ఎలాగైతే సక్సెస్ సాధించాడో.. రాజకీయాల్లో కూడా అలాగే సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నానని తెలిపారు.


మెగా ఫ్యామిలీ నుండి ఆ ఇద్దరు..


తను రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఏమైనా ఉందా అని ప్రశ్నించగా.. అలాంటి అవకాశమే లేదని సమాధానమిచ్చారు ఉపాసన. ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుండి మెగాస్టార్ చిరంజీవి సొంతంగా పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారు. కానీ సినిమాల్లో దక్కినంత విజయం.. ఆయనకు రాజకీయాల్లో లభించలేదు. అందుకే రాజకీయాలకు పూర్తిగా గుడ్ బై చెప్పి మళ్లీ సినిమాలపై ఫోకస్ పెట్టారు. ఇప్పుడు చిరు పూర్తి దృష్టి సినిమాలపైనే ఉంది. చిరంజీవి తర్వాత పవన్ కళ్యాణ్.. మరో సొంత పార్టీతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటికే ఒకసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు టీడీపీతో పొత్తు పెట్టుకొని మరోసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు.


అప్పుడే అర్థమవుతుంది..


కొందరు నటీనటులు సినీ పరిశ్రమలో స్టార్‌గా, ఎనలేని పాపులారిటీతో విజయం సాధిస్తారు. కానీ అదే నటీనటులు పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇస్తే పరిస్థితి వేరే విధంగా ఉంటుంది. అలా సినీ పరిశ్రమలో స్టార్‌గా పేరు తెచ్చుకొని రాజకీయాల్లో ఫెయిల్ అయినవారు కూడా ఉన్నారు. అందుకే సినిమాలను, రాజకీయాలను లింక్ చేసి చూడవద్దని కొందరు ప్రజలు భావిస్తుంటారు. అయినా కూడా విజయ్ ఈ డేరింగ్ నిర్ణయంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. ఇప్పటికే తన ఫ్యాన్స్ అంతా విజయ్ పొలిటికల్ ఎంట్రీకి సపోర్ట్‌గా నిలబడ్డారు. మరి తన పొలిటికల్ ఎంట్రీ ఏ మాత్రం సక్సెస్‌ఫుల్ అయ్యిందో 2026 తమిళనాడు ఎలక్షన్స్‌లో అర్థమవుతుంది.


Also Read: అలా చేయడం అవసరమా - హీరోయిన్స్‌తో రామ్ చరణ్ ఇంటిమేట్ సీన్స్‌పై ఉపాసన రియాక్షన్