Two Men Arrested Who Gunshot ear Outside Salman Khan Residence: బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ ఇంటి ముందు కాల్పులకు తెగబడ్డ దుండగులను పోలీసులు తాజాగా ఆరెస్ట్‌ చేశారు. రెండు రోజుల క్రితం (ఏప్రిల్‌ 14) సల్మాన్‌ ఖాన్‌ ఇంటి ముందు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఆదివారం తెల్లవారు జామున ఇద్దరు అగంతకులు ద్విచక్ర వాహనంపై వచ్చి సల్మాన్‌ గెలాక్సీ ఆపార్ట్‌మెంట్స్‌ ముందు కాల్పులు జరిపి కలకలం సృష్టించారు. మొత్తం ఆరు రౌండ్ల కాల్పులు జరిపి ఆ తర్వాత మోటార్‌ సైకిల్‌పై పారిపోయారు. ఈ ఘటనపై అలర్ట్‌ అయిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తులో వేగం పెంచారు. కాల్పులు ఘటన అనంతరం సల్మాన్ ఖాన్ సెక్యూరిటీ గార్డు వాంగ్మూలం ఆధారంగా పోలీసులు కేసు నమోదు  చేసి పదికి పైగా బృందాలుగా ఏర్పడి గాలింపులు చేపట్టారు. ఫైనల్‌గా ఘటన జరిగిన రెండు రోజుల్లోనే నిందితులను అరెస్టు చేసి కేసును ఛేదించారు.


నిందితులు జరిపిన కాల్పుల ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు కాగా వాటి ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తును ముమ్మరం చేసి గాలింపులు జరుపగా నిందితులు గుజరాత్‌లో ఉన్నట్టు తెలిసింది నిందితులిద్దరు  విక్కీ గుప్తా(24), సాగర్ పాల్ (21) నిందితులుగా పోలీసులు గుర్తించారు. దీంతో గుజరాత్‌లోని భుజ్‌లో వారిద్దరిని అరెస్టు చేసినట్లు తాజాగా ముంబై పోలీసులు వెల్లడించారు. వారిద్దరు బీహార్‌లోని పశ్చిమ చంపారన్‌కు చెందినవారని, గతంలో వారిద్దరిపై చాలా చైన్‌ స్నాచింగ్‌ కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. నార్త్‌ ఇండియాలోని పలు రాష్ట్రాల్లో  దొంగతనాలు కూడా చేసినట్లు ఆధారాలు కూడా ఉన్నాయన్నారు. దొంగతనాలు, ఐన్‌ స్నాచింగ్‌లు చేసే సల్మాన్‌ ఇంటి ముందు కాల్పుల జరపడం, వారి వెనక ఎవరూ ఉన్నారనే కోణంలో ప్రస్తుతం పోలీసులు వారిద్దరి విచారిస్తున్నట్టు తెలుస్తోంది. వారిద్దరిని విచారించిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని ముంబై పోలీసులు చెప్పారు.


అందులో నిజం లేదు.. సీరియస్ గా తీసుకోకండి


అయితే సల్మాన్‌ ఇంటి ముందు కాల్పులు జరిగిన ఘటనపై కొందరు నెగిటివ్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. ఇది పబ్లిక్‌ స్టంట్‌ అని, సల్మాన్‌ కుటుంబ సభ్యులు ఇది పెద్ద ఎఫెక్ట్‌ కాదంటూ కొందరు తప్పుడు ప్రచారం చేశారు. తాజాగా దీనిపై సల్మాన్‌ ఖాన్‌ సోదరుడు ఆర్భాజ్‌ ఖాన్‌ స్పందించారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ షేర్‌ చేశాడు. "ఇటీవల ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ముంబైలో సలిమా ఖాన్‌ ఫ్యామిలీకి చెందిన గెలాక్సీ అపార్టుమెంట్స్‌ ముందు కాల్పులు జరిపారు. ఈ ఘటనతో మా కుటుంబం ఒక్కసారిగా ఉల్కిపడింది. మా కుటుంబం ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే కొందరు ఇది పబ్లిక్‌ స్టంట్‌ అంటూ తప్పుడు స్టేట్‌మెంట్స్‌ చేస్తున్నారు. ఇందులో ఏమాత్రం నిజం లేదు. అయితే మా కుటుంబం అంతా కాల్పుల ఘటనతో షాక్‌లో ఉండిపోయింది. ఈ ఇన్సిడెంట్‌పై పోలీసుల కేసు, విచారణలో వారికి సహాకరిస్తూ మా సలీమా ఖాన్‌ ఫ్యామిలీ బిజీగా ఉంది. అందువల్ల ఈ తప్పుడు వార్తలపై వారు స్పందించలేకపోయారు. సలీమా ఖాన్‌ ఫ్యామిలీ మెంబర్‌గా నేను ఈ వార్తలను ఖండిస్తున్నాను. దయచేసి ఇలాంటి తప్పుడు స్టేట్‌మెంట్స్‌ని నమ్మకండి. ఈ విషయంలో మాకు ముంబై పోలీసులపై పూర్తి నమ్మకం ఉంది. వారు మా కుటుంబానికి రక్షణ కల్పిస్తారని నమ్ముతున్నాము. థ్యాంక్యూ" అంటూ రాసుకొచ్చాడు.