Adipurush: ఓమ్ రౌత్ దర్శకత్వంలో రామాయణ ఇతిహాసాల ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘ఆదిపురుష్’ జూన్ 16 న గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఈ మూవీలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్ నటించారు. భారీ అంచనాలు, విమర్శలు మధ్య థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ మొదటి రెండు రోజుల్లో రూ.200 కోట్ల వసూళ్లు సాధించి రికార్డులు సృష్టించింది. భారీ విజువల్ ఎఫెక్టులతో కూడిన నేటితరం రామాయణాన్ని తెరపై చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. మరో వైపు ‘ఆదిపురుష్’ దర్శకుడి పై విమర్శలు సైతం కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మూవీపై సోషల్ మీడియాలో మరో కొత్త ప్రచారం జరుగుతోంది. మూవీపై సోషల్ మీడియాలో వస్తోన్న నెగిటివ్ రివ్యూలు అలాగే పోస్ట్ లను తొలగించేందుకు డబ్బులు ఆఫర్ చేస్తున్నారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 


నెగిటివ్ పోస్ట్ లు తొలగిస్తే డబ్బులిస్తున్నారా?


ఈ మూవీపై మొదటి నుంచీ విమర్శలు వస్తూనే ఉన్నాయి. అయితే సినిమా విడుదల అయిన తర్వాత దర్శకుడు ఓమ్ రౌత్ పై మండి పడుతున్నారు కొందరు ప్రేక్షకులు. అసలు సినిమాలో వేషధారణలు, కథను నడిపించిన తీరు, చూపించిన విధానం అన్నీ సరిగ్గా లేవనే విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా మూవీ కు సంబంధించిన కంప్యూటర్ గ్రాఫిక్స్ పై పెద్ద ఎత్తున విమర్వలు వస్తున్నాయి. దీనిపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ జరుగుతున్నాయి. అయితే ఈ మూవీ గురించి నెగిటివ్ రివ్యూలు, పోస్ట్ లు చేసిన వారికి డబ్బులు ఆఫర్ చేస్తున్నారట. అందుకు సంబంధించిన మెసేజ్ లను స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. అవి కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆదిపురుష్ నెగిటివ్ రివ్యూలను డిలీట్ చేసి పాజిటివ్ రివ్యూ పోస్ట్ చేసినందుకు రూ.9500 చెల్లించారని ఒకరు స్క్రీన్ షాట్ ను షేర్ చేశారు. మరొకరు నెగిటివ్ ట్వీట్ ను డిలీట్ చేసినందుకు ట్వీట్ కు రూ.5500 ఆఫర్ చేశారని షేర్ చేశారు. ఇలాంటి స్క్రీన్ షాట్ లు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి. నిజంగా మూవీ టీమ్ సభ్యులే ఇలా ఆఫర్ చేస్తున్నారా లేదా ఇంకెవరైనా ఇలా చేస్తున్నారా అనేది తెలీదు. అయితే దీనిపై మూవీ టీమ్ కూడా ఇప్పటి వరకూ స్పందించలేదు.


చర్చనీయాంశంగా హనుమంతుడి డైలాగ్స్..


సినిమాలో హనుమంతుడి పాత్రను భజరంగ్ గా చూపించారు. అయితే ఈ భజరంగ్ పాత్ర గురించి కూడా దర్శకుడిపై విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో మాటల రచయిత మనోజ్ ముంతాషిర్ పై కూడా విమర్శలు వస్తున్నాయి. సినిమాలో భజరంగ్ తోకకు రావణుడి కొడుకు ఇంద్రజిత్ నిప్పు పెట్టినపుడు ఆయన చెప్పే డైలాగ్ పై విమర్శలు తలెత్తుతున్నాయి.  అయితే ఇటీవల కొన్ని మీడియా చానెళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో ఆయన మాట్లాడుతూ భజరంగ్ పాత్ర డైలాగులకు మద్దతు పలికారు. అదేమీ పొరపాటు కాదన్నారాయన. భజరంగ్ పాత్రకు చాలా లోతుగా ఆలోచించే డైలాగులు రాశామని అన్నారు. తన చిన్నప్పుడు ఊర్లలో పెద్దవాళ్లు ఇలాంటి భాషలోనే రామాయణాన్ని కథలా చెప్పేవారని అన్నారు. అలాగే ఇలాంటి భాషతో రామాయణం చెప్పడం గతంలో కూడా చాలా సార్లు జరిగాయని తనేమి మొదటి వ్యక్తిని కాదని చెప్పుకొచ్చారు. 


‘ఆదిపురుష్’ గ్రాఫిక్స్ వర్క్స్ పై విమర్శలు..


‘ఆదిపురుష్’ సినిమా మొదటి ట్రైలర్ విడుదల చేసినప్పటి నుంచీ ఈ మూవీలో గ్రాఫిక్స్ బాలేదంటూ విమర్శలు వస్తూనే ఉన్నాయి. తర్వాత వంద కోట్లు ఖర్చు పెట్టి గ్రాఫిక్స్ వర్క్స్ చేశామని చెప్పారు మూవీ మేకర్స్. తీరా సినిమా రిలీజ్ అయిన తర్వాత నటీనటుల నటన, పాటలు, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అన్నీ బాగున్నా.. కథను నడిపించే తీరు చూపించే విధానం ముఖ్యంగా గ్రాఫిక్స్ వర్కౌట్ కాలేదనే టాక్ వచ్చింది. అక్కడక్కడ కొన్ని సీన్స్ తప్ప మిగతా సినిమా మెప్పించలేదనే వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా రావణుడి పాత్రను పూర్తిగా పాడు చేశారనే విమర్శలు కూడా వస్తున్నాయి. దీంతో ఈ మూవీ గ్రాఫిక్స్ వర్క్స్ పై సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలైయ్యాయి. ఇప్పుడు నెగిటివ్ ట్రోల్స్ ను డిలీట్ చేసి పాజిటివ్ పోస్ట్ లు చేస్తే డబ్బులిస్తున్నారనే ప్రచారం రావడంతో ఈ విమర్శలు ఇంకా ఎక్కువయ్యాయి. మరి దీనిపై మూవీ టీమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.