Trivikram speech at Jigra Telugu Pre Release Event: తనకు ఇష్టమైన హీరోయిన్లలో ఒకరు ఆలియా భట్, మరొకరు సమంత అని... వాళ్ళిద్దరూ ఇవాళ ఇక్కడ ఉండడం, వారితో గంట సేపు సరదాగా సంభాషించడం తనకు ఎంతో సంతోషంగా ఉందని మాటల మాంత్రికుడు, గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ అన్నారు.
విజయ దశమికి తెలుగులోనూ 'జిగ్రా' విడుదల
విజయ దశమికి థియేటర్లలో విడుదల అవుతున్న సినిమాలలో 'జిగ్రా' (Jigra Movie) ఒకటి. ఆలియా భట్ (Alia Bhatt) ప్రధాన పాత్రలో రూపొందిన ఆ సినిమా హిందీతో పాటు తెలుగులోనూ అక్టోబర్ 11న (ఈ శుక్రవారం) విడుదల అవుతోంది. ఈ చిత్రాన్ని సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా రానా దగ్గుబాటి తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు. త్రివిక్రమ్, సమంత ముఖ్య అతిథులుగా మంగళవారం సాయంత్రం హైదరాబాద్ సిటీలో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు.
ట్రైలర్ చూసిన తర్వాత సినిమా చూడాలనిపించింది!
''పోస్టర్ లేదా ట్రైలర్ చూసిన తర్వాత కొన్ని సినిమాలు మమ్మల్ని చూడండి అని పిలుస్తాయి. జిగ్రా ట్రైలర్ యూట్యూబ్ లో చూసిన తర్వాత నాకు సినిమా చూడాలని అనిపించింది'' అని త్రివిక్రమ్ అన్నారు. ఈ సినిమా కోసం ఆలియా భట్ ఫిజికల్ గా కూడా ఎంత కష్టపడి ఉంటారో అనేది ట్రైలర్ చూస్తే అర్థమవుతుందని ఆయన అన్నారు. ''ట్రైలర్ చూసిన వెంటనే సూపర్ హిట్ అని కొన్ని సినిమాలు గురించి మనం చెబుతాం కదా! ఈ సినిమా కూడా అంతే. ట్రైలర్ చూశాక సూపర్ హిట్ అనిపించింది'' అని త్రివిక్రమ్ అన్నారు. 'జిగ్రా' దర్శకుడు వాసన్ బాలా తన పెద్ద కుమారుడికి ఇష్టమైన దర్శకుడు అని త్రివిక్రమ్ తెలిపారు. ఆయన తీసిన సినిమా ఒకటి చూశానని, ఎటువంటి భయాలు లేకుండా చాలా ధైర్యంగా సినిమా తీసే దర్శకులలో ఆయన ఒకరు అని గురూజీ చెప్పారు.
బన్నీ గారు అప్పట్లో సమంతకు పెద్ద ఫ్యాన్!
సమంతతో తాను మూడు చిత్రాలకు పని చేశానని... తెలుగు, తమిళ్, మలయాళం అన్ని భాషలలోనూ ఒకే విధమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న యాక్టర్లు తనకు తెలిసి రజనీకాంత్ గారు, అలాగే సమంత గారు అని త్రివిక్రమ్ చెప్పారు. 'ఏం మాయ చేసావే' సినిమా విడుదలైన తర్వాత పని తనకు ఫోన్ చేసి 'సమంత అని ఒక కొత్త హీరోయిన్ వచ్చింది. మీరు వెళ్లి సినిమా చూడండి' అని చెప్పారని త్రివిక్రమ్ గుర్తు చేసుకున్నారు. సమంతకు అప్పట్లో బన్నీ పెద్ద ఫ్యాన్ అని తెలిపారు.
Also Read: ప్రభాస్ పాన్ ఇండియా సినిమాకు పని చేసిన కుర్రాడు ఓటీటీ సినిమా 'తత్వ' దర్శకుడని మీకు తెలుసా?
సమంత హైదరాబాదు రావడానికి దారేది అని ట్రెండ్ చేద్దాం!
ఇప్పుడు సమంత ముంబైలో ఎక్కువ ఉంటున్నారని, ఆవిడ అప్పుడప్పుడూ ఇక్కడికి (హైదరాబాద్) కూడా వస్తూ ఉండాలని కోరుకుంటున్నట్లు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలిపారు. ఆయన మాటలకు బదులుగా సమంత సైగలతో తన సమాధానం చెప్పారు. తన కోసం క్యారెక్టర్లు రాస్తే తప్పకుండా వస్తాను అన్నట్లు తెలిపారు. సమంత చేయరు ఏమో అనే భయంతో తాను రాయడం లేదని త్రివిక్రమ్ సరదాగా అన్నారు. తాను అత్తారింటికి దారేది సినిమా చేశానని, ఇప్పుడు ప్రేక్షకులు అందరూ సమంత గారు హైదరాబాదు రావడానికి దారేది అనేది చెప్పాలని అన్నారు. తెలుగు వాళ్ళు అందరం కలిసి ఒక హ్యాష్ ట్యాగ్ ఏదైనా క్రియేట్ చేసి ట్విట్టర్ అంతా ట్రెండ్ చేద్దామని త్రివిక్రమ్ సూచించారు.
Also Read: మహేష్ ఫ్రెండ్‌కు మిస్టర్ పెర్ఫెక్షనిస్ట్ ఛాన్స్ - ఆమిర్ ఖాన్ నెక్స్ట్ సినిమాకు టాలీవుడ్ డైరెక్టర్!?