దర్శకుడు త్రినాథరావు నక్కిన (Trinadha Rao Nakkina) తీరు మీద ప్రేక్షక లోకం మండి పడింది. హైదరాబాద్ సిటీలో జరిగిన 'మజాకా' టీజర్ విడుదల (Mazaka Teaser Launch) కార్యక్రమంలో హీరోయిన్ అన్షు (Actress Anshu Ambani) మీద ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల మహిళలు మాత్రమే కాదు ప్రేక్షకులు అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటు సినిమా ఇండస్ట్రీలో సైతం కొంత మంది 'ఇదేం పద్ధతి' అంటూ చీదరించుకున్నారు. ఈ నేపథ్యంలో మహిళలు అందరికీ ఆయన క్షమాపణలు తెలియజేస్తూ ఒక వీడియో విడుదల చేశారు.
నవ్వించే ప్రయత్నమే తప్ప... మరొకటి కాదు!
''నమస్తే అండీ... నా పేరు త్రినాథ రావు నక్కిన. 'మజాకా' టీజర్ లాంచ్ ప్రోగ్రాంలో నేను చేసిన వ్యాఖ్యలు చాలామంది మహిళల మనసును నొప్పించిన విషయం నాకు అర్థం అయింది. నవ్వించే ప్రయత్నంలో అనుకోకుండా నా నోటి నుంచి వచ్చిన మాటలే తప్ప... ఎవరి మనోభావాలు గాయపరిచే ఉద్దేశం నాకు లేదు. అయినా సరే... మహిళల అందరి మనసు నొప్పించింది కనుక తప్పు తప్పే. కాబట్టి మనస్ఫూర్తిగా మహిళలు అందరికీ క్షమాపణలు తెలియజేస్తున్నాను. పెద్ద మనసు చేసుకొని నన్ను క్షమించాలని కోరుతున్నాను. మా ఇంట్లోనూ ఆడవాళ్లు ఉన్నారు. హీరోయిన్ అన్షు గారికి కూడా క్షమాపణలు తెలియజేస్తున్నాను'' అని త్రినాథ రావు నక్కిన వీడియో విడుదల చేశారు.
Also Read: సొంత ఊరికి ఎంతో చేసిన శోభన్ బాబు... కనీసం ఒక్క విగ్రహం కూడా లేదు, ఎక్కడో తెల్సా?
రేవంత్ రెడ్డి - అల్లు అర్జున్ ఇష్యూలోనూ సారీ!
హీరోయిన్ రీతు వర్మను ఏడిపించే క్రమంలోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇష్యూను రీ క్రియేట్ చేసినట్లు తన మాటల ద్వారా త్రినాథ రావు నక్కిన తెలిపారు. అయితే... తన వీడియోలో ఎక్కడ రేవంత్ రెడ్డి లేదా అల్లు అర్జున్ ప్రస్తావన లేకుండా ఆయన జాగ్రత్త పడడం గమనార్హం.
''నేను ఏదో కామెడీ కోసం మా హీరోయిన్ రీతు వర్మను ఏడిపించే ప్రాసెస్ లో వారి మేనరిజమ్ (అల్లు అర్జున్ మేనరిజమ్) చేశాను. పెద్ద తప్పు జరిగిపోయింది. అది కూడా నేను కావాలని చేసినది కాదు. ఆ కార్యక్రమంలో ఉన్న వారందరినీ నవ్విద్దామని అనుకున్నాను. అయితే ఇంత పెద్ద ఇష్యూ అవుతుందని అనుకోలేదు. ఆ విషయంలో ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే వారందరికీ కూడా నేను బేషరతుగా క్షమాపణ చెబుతున్నాను. మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నా. దయచేసి పెద్ద మనసు చేసుకొని నన్ను క్షమించండి'' అని త్రినాథ రావు నక్కిన తెలిపారు. సినిమా యూనిట్ తరఫున హీరో సందీప్ కిషన్ సైతం సారీ చెప్పారు. నక్కిన విడుదల చేసిన వీడియో తన సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేశారు.
మహిళల శరీరాకృతి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను త్రినాథ రావు నక్కినను వివరణ కోరుతూ మహిళా కమిషన్ అధ్యక్షురాలు నేరెళ్ల శారద నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం అందుతోంది. ఆయన క్షమాపణలు చెప్పిన నేపథ్యంలో నోటీసులు ఇస్తారా లేదా అనేది చూడాలి.