ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వాన్ని అభినందించడానికి తెలుగు చలన చిత్ర పరిశ్రమలో పెద్దలు, ప్రముఖ నిర్మాతలు వెళుతున్నారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత, ప్రముఖ కథానాయకుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)ను సోమవారం ఆయన క్యాంపు కార్యాలయంలో కలవనున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే... 


పవన్ దగ్గరకు ఎవరెవరు వెళుతున్నారు?
వైజయంతీ మూవీస్ అధినేత సి. అశ్వినీ దత్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత చినబాబు (సూర్యదేవర నాగవంశీ), మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నాగవంశీ సూర్యదేవర, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్, ఆ సంస్థ సహ నిర్మాత వివేక్ కూచిభొట్లతో పాటు తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత 'దిల్' రాజు, దామోదర్ ప్రసాద్, భోగవల్లి ప్రసాద్, డీవీవీ దానయ్య తదితరులు పవన్ కళ్యాణ్ దగ్గరకు వెళుతున్న నిర్మాతల జాబితాలో ఉన్నారు.


దామోదర ప్రసాద్ మినహా మిగతా నిర్మాతలు అందరూ పవన్ కళ్యాణ్ హీరోగా సినిమాలు చేసిన వారే. ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తున్న 'ఓజీ'కి దానయ్య  నిర్మాత.


చిత్రసీమ సమస్యల పరిష్కారం అజెండా... 
ప్రధానంగా టికెట్ రేట్ల పెంపు మీద చర్చ!
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం ఏపీలో అధికారంలో ఉన్న సమయంలో తెలుగు చలన చిత్ర పరిశ్రమ పెద్దలు పలు సమస్యలు ఎదుర్కొన్నారు. ఆయా సమస్యలో ముఖ్యమైనది టికెట్ రేట్లు! పవన్ దగ్గర ఆ సమస్యల పరిష్కారంతో పాటు టికెట్ రేట్స్ గురించి చర్చకు వచ్చే అవకాశం ఉంది.


Also Readప్రభాస్ ఒక్కో సినిమాకు ఏవరేజ్‌ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 300 కోట్లు... ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే రేంజ్‌ డార్లింగ్స్.... రెబల్ స్టార్‌ను 'ఢీ' కొట్టేదెవరు


పవన్ కళ్యాణ్ 'భీమ్లా నాయక్' విడుదల సమయంలో సూర్యదేవర నాగవంశీ, 'వకీల్ సాబ్' విడుదల సమయంలో 'దిల్' రాజు, 'బ్రో' విడుదల సమయంలో టీజీ విశ్వ ప్రసాద్ వైసీపీ ప్రభుత్వం నుంచి సమస్యలు ఎదుర్కొన్నారు. పవన్ సైతం ఒక వేదిక మీద వైసీపీ పెడుతున్న ఇబ్బందులకు తలొగ్గేది లేదని, అవసరం అయితే తన సినిమాలను యూట్యూబ్‌లో విడుదల చేస్తానని చెప్పారు. పరిశ్రమ సమస్యల మీద ఆయనకు అవగాహన ఉంది. అందువల్ల, సానుకూలంగా స్పందించడంతో పాటు అవసరమైన చర్యలు తీసుకుంటారని టాలీవుడ్ పెద్దలు విశ్వాసంతో ఉన్నారు.


భేటీలో ఏపీలో 'కల్కి' టికెట్ రేట్స్ మీద క్లారిటీ!
ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువు దీరిన తర్వాత థియేటర్లలోకి వస్తున్న భారీ సినిమా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సి అశ్వినీదత్ నిర్మించిన 'కల్కి 2898 ఏడీ'. ఈ నెల 27న థియేటర్లలోకి వస్తోంది. ఈ చిత్రానికి తెలంగాణ ప్రభుత్వం ఎనిమిది రోజుల పాటు సింగిల్ స్క్రీన్లలో 75, మల్టీప్లెక్స్ స్క్రీన్లలో 100 రూపాయలు పెంచుకునే వెసులుబాటు ఇచ్చింది. ఏపీలో టికెట్ రేట్లు ఎంత పెంచుతారు? అనేది రేపు పవన్, నిర్మాతల భేటీలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆయన్ను కలుస్తున్న పెద్దల్లో 'కల్కి 2898 ఏడీ' ప్రొడ్యూసర్ సి అశ్వినీదత్ కూడా ఉన్నారు.


Also Read: టాప్ విప్పేసిన అనసూయ... ముద్దులతో అయేషా... ఏడ్చిన అమర్ దీప్... ఏందిరా మీ రచ్చ!