Vishwak Sen Anger On Reviewers About Peddi Movie : ఏ మూవీ రిలీజ్ అయినా సోషల్ మీడియాలో రివ్యూస్ కామన్. కొందరు మాత్రం కావాలనే నెగిటివ్ రివ్యూస్ ఇస్తుంటారు. దీనిపై పలు సందర్భాల్లో నిర్మాతలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, సినిమా రిలీజ్ కాకుండానే కొందరు రివ్యూ ఇవ్వడం, నెగిటివ్ కామెంట్స్ చేయడం చేస్తున్నారు. ఇలాంటి వారిపై టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
'పెద్ది'పై కామెంట్స్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేం బుచ్చిబాబు కాంబోలో రాబోతోన్న అవెయిటెడ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది'. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన గ్లింప్స్, పెద్ది సిగ్నేచర్ షాట్‌తో పాటు 'చికిరి చికిరి' సాంగ్, రామ్ చరణ్ లుక్స్ గూస్ బంప్స్ తెప్పించాయి. వచ్చే ఏడాది మార్చి మార్చి 27న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, తాజాగా సోషల్ మీడియాలో 'పెద్ది'పై కొందరు నెగిటివ్ కామెంట్స్ చేశారు.
చికిరి గికిరీలు అవసరమా?
కొందరు రివ్యూయర్స్ వీడియో కాల్‌లో మాట్లాడుకుంటూ 'పెద్ది' సినిమా గురించి వెటకారంగా మాట్లాడారు. 'మీకు పెద్ది సినిమా స్టోరీ తెలుసా? నాకు తెలుసు.' అంటూ ఓ వ్యక్తి చెప్పగా... 'లీకులు, స్పాయిలర్స్ వద్దు' అంటూ మరో వ్యక్తి అంటాడు. 'లీక్స్ ఏమీ చేయను. ఒకవేళ చేస్తే నాపై కేస్ వేస్తారు.' అని చెప్పాడు. మరో వ్యక్తి 'అసలు స్టోరీ ఎలా ఉంది? బాగుంటుంది అనిపించిందా? అది చెప్పండి ముందు' అని అడగ్గా... సదరు వ్యక్తి... 'నాకు అసలు ఇలాంటి స్టోరీతో సినిమా తీస్తున్నావా? మళ్లీ ఆ చికిరీలు గికిరీలు అని పెట్టి' అంటూ దర్శకుడిని అవహేళన చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read : 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
విశ్వక్ తీవ్ర ఆగ్రహం
దీనిపై హీరో విశ్వక్ సేన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండస్ట్రీ నుంచి ప్రయోజనం పొందిన వ్యక్తులు ఇలాంటి కామెంట్స్ చేయడం ఎంతవరకు కరెక్ట్? అని ప్రశ్నించారు. 'అతని లాంటి వ్యక్తిని సినిమాకి పరాన్న జీవి అని పిలవడం న్యాయమా? అతను పరిశ్రమ నుంచి ప్రయోజనం పొందుతాడు. దాని ద్వారా తన కుటుంబాన్ని పోషించుకుంటాడు. అయినప్పటికీ సినిమా రిలీజ్ కాక ముందే దాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇది అతను తిన్న ప్లేట్‌లోనే ఉమ్మేసినట్లే.' అంటూ ఘాటుగా రాసుకొచ్చారు.
మరోవైపు ఈ వీడియోపై నెటిజన్లు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇండస్ట్రీ, సినిమా అంటే తెలియని వారు కూడా సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం ఇలాంటి వీడియోస్ చేస్తుంటారని... సినిమా రిలీజ్ కాక ముందే బురద జల్లే ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సినిమా అంటే ఎంతోమంది కష్టమని... దాన్ని చులకనగా చేసి మాట్లాడకూడదంటూ మరికొందరు అభిప్రాయపడుతున్నారు.