Kamal Haasan's Thug Life Advance Bookings Record: దాదాపు 37 ఏళ్ల తర్వాత యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, మణిరత్నం కాంబోలో వస్తోన్న 'థగ్ లైఫ్' మూవీ రిలీజ్‌కు ముందే రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ నెల 5న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా.. అడ్వాన్స్ బుకింగ్స్‌లో జోరు కొనసాగిస్తోంది.

ప్రీ బుకింగ్ కలెక్షన్స్ ఎంతంటే?

ఈ మూవీ ప్రీ బుకింగ్స్ ఈ నెల 1 నుంచి ప్రారంభం కాగా.. అడ్వాన్స్ బుకింగ్స్‌లో దూసుకెళ్తోంది. ఇప్పటివరకూ రూ.15 కోట్లకు చేరుకున్నట్లు తెలుస్తోంది. 'కన్నడ'లో తప్ప అన్నీ భాషల్లోనూ దాదాపు 2 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయని సమాచారం. దీంతో ప్రీ సేల్స్‌లో భారత్‌లో కలెక్షన్స్ రూ.3.4 కోట్లకు చేరుకున్నాయి. దేశవ్యాప్తంగా దాదాపు 8,432 షోస్ ప్రదర్శితం కానున్నట్లు ట్రేడ్ వెబ్ సైట్ కథనం వెల్లడించింది. ఈ ఏడాది విడుదలైన తమిళ చిత్రాల్లో ఫస్ట్ డే అత్యథిక వసూళ్లు సాధించిన చిత్రంగా థగ్ లైఫ్ నిలవనుందనే టాక్ వినిపిస్తోంది.

కలెక్షన్స్ ఓకే కానీ..

'థగ్ లైఫ్' అడ్వాన్స్ బుకింగ్స్ కలెక్షన్స్ బాగానే ఉన్నప్పటికీ.. కమల్ ముందు చిత్రాల కంటే ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచిన 'ఇండియన్ 2' ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు రూ.17.9 కోట్లు కాగా.. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన హిట్ మూవీ 'విక్రమ్' మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.15.3 కోట్లు జరిగింది. సినిమా రిలీజ్‌కు ఇంకా ఒక రోజు మిగిలి ఉండగా, 'థగ్ లైఫ్' ముందస్తు బుకింగ్‌ను రూ.15 - 17 కోట్ల గ్రాస్ మధ్య ముగించే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ విశ్లేషకుల అంచనా. దీని వల్ల బాక్సాఫీస్ వద్ద రూ.15 - 20 కోట్ల నికర వసూళ్లు సాధించే అవకాశం ఉంది. 

Also Read: ఫన్ మ్యాడ్ నెస్ స్టార్ట్ అయ్యిందిగా.. - బన్నీ వాస్ సమర్పణలో ఫస్ట్ మూవీ ప్రీ లుక్ అదుర్స్.. ఫస్ట్ లుక్ ఎప్పుడంటే?

కర్ణాటకలో నో రిలీజ్.. లాస్ ఎంతంటే?

'థగ్ లైఫ్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో 'తమిళం నుంచే కన్నడ పుట్టింది' అంటూ కమల్ హాసన్ చేసిన కామెంట్స్ పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ కామెంట్స్‌పై కర్ణాటక అధికార, విపక్ష సభ్యులు సహా కన్నడిగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఈ మూవీని బ్యాన్ చేయాలని నిర్ణయించింది. కమల్ 'సారీ' చెప్పి తీరాల్సిందేనని డిమాండ్ చేశాయి. దీనిపై హైకోర్టును సైతం ఆశ్రయించగా.. కమల్‌పై న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 

అయితే.. తన కామెంట్స్‌పై వెనక్కు తగ్గని కమల్.. ఆ వ్యాఖ్యల వెనుక ఉద్దేశాన్ని వివరిస్తూ కేఎఫ్‌సీసీకి లేఖ రాశారు. మరోవైపు.. తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ సైతం కేఎఫ్‌సీసీకి లేఖ రాసింది. కమల్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించగా.. కర్ణాటకలో రిలీజ్ చేయకూడదని నిర్ణయించారు. దీంతో దాదాపు రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకూ నష్టం వాటిల్లే అవకాశం ఉండనున్నట్లు తెలుస్తోంది. ఒక్క కన్నడలో తప్ప తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ మూవీ గురువారం రిలీజ్ కానుంది.