పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ వైపు రాజకీయాలతో మరోవైపు సినిమా షూటింగ్స్ తో క్షణం తీరిక లేకుండా బిజీబిజీగా గడుపుతున్నారు. ఈమధ్య చంద్రబాబునాయుడు అరెస్టుతో ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సమయం దొరికినప్పుడు మాత్రమే షూటింగ్స్ కి హాజరవుతున్నారు. పవన్ నటిస్తున్న తాజా చిత్రాల్లో 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bagahatsingh) కూడా ఒకటి. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. 'గబ్బర్ సింగ్' లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ - హరీష్ కాంబినేషన్లో రాబోతున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి.


అందుకు తగ్గట్టుగానే హరీష్ శంకర్ తన మార్క్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు ఓ సోషల్ మెసేజ్ తో 'ఉస్తాద్ భగత్ సింగ్' ని తెరకెక్కిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమా కోసం స్టార్ కాస్ట్ ని కూడా ఎంపిక చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సినిమాలో సీనియర్ నటి గౌతమి పవన్ కి తల్లిగా నటిస్తోందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమాలో పవన్ ని ఢీ కొట్టే విలన్ గురించి ఓ వార్త ఫిలిం సర్కిల్స్ లో హల్చల్ చేస్తోంది. నిజానికి 'ఉస్తాద్ భగత్ సింగ్' తమిళంలో విజయ్ నటించిన 'తేరి' మూవీ రీమేక్ అని అప్పట్లో ప్రచారమైన విషయం తెలిసిందే కదా. దీనిపై హరీష్ శంకర్ ను అడిగినప్పటికీ సరైన క్లారిటీ ఇవ్వలేదు.


అయితే ఒరిజినల్ వెర్షన్ లో ప్రతి నాయకుడిగా మహేంద్రన్ అద్భుతంగా నటించారు. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ లో విలన్ రోల్ లో తమిళ యాక్టర్ ఆర్ పార్తీబన్ దాదాపు ఖరారు అయినట్లు సమాచారం అందుతుంది. తమిళంలో ఈయన దర్శకుడిగా, నటుడిగా సుమారు మూడు దశాబ్దాల నుంచి కొనసాగుతున్నారు. తెలుగులో అప్పట్లో రామ్ చరణ్ నటించిన 'రచ్చ' మూవీలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో కాసేపు కనిపించి ఆకట్టుకున్నారు. ఇంకా చెప్పాలంటే కార్తీ నటించిన 'యుగానికి ఒక్కడు' సినిమాలో చోళ రాజుగా నటించాడు. ఇటీవల మణిరత్నం తెరకెక్కించిన 'పొన్నియన్ సెల్వన్' సినిమాలోనూ ఓ పాత్రలో కనిపించి సందడి చేశారు.


ఇప్పుడు 'ఉస్తాద్ భగత్ సింగ్' లో మాత్రం ఫుల్ లెన్త్ విలన్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. హరిశ్ శంకర్ సినిమాలో ఆయన పాత్రను చాలా బాగా డిజైన్ చేశారట. ఇప్పటివరకు ఈ న్యూస్ పై అధికారికంగా సమాచారం లేనప్పటికీ త్వరలోనే మూవీ టీం నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో పవన్ సరసన యంగ్ సెన్సేషన్ శ్రీ లీల, ఏజెంట్ బ్యూటీ సాక్షి వైద్య కథానాయికలుగా నటిస్తుండగా.. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాని వీలైతే వచ్చే సంక్రాంతికి లేదా 2024 వేసవి కానుకగా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.


Also Read : సంక్రాంతి బరిలో విజయ్ దేవరకొండ, పరశురాం మూవీ - టైటిల్, ఫస్ట్ లుక్ ఎప్పుడంటే?






Join Us on Telegram: https://t.me/abpdesamofficial