బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ దాదాపు దశాబ్దకాలం తర్వాత 'పఠాన్' సినిమాతో సూపర్ హిట్ ను దక్కించుకున్నారు. ‘జీరో’ సినిమా తర్వాత షారుఖ్ ఖాన్ ఏకంగా నాలుగేళ్ల గ్యాప్ తీసుకుని ‘పఠాన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ‘పఠాన్’ సినిమా రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించడంతో పాటు ‘బాహుబలి 2’ రికార్డులను సైతం బ్రేక్ చేసింది. ఇక షారుఖ్ ఖాన్ పనైపోయిందంటూ విమర్శలు చేసిన వారికి ఆ కలెక్షన్సే సమాధానం అంటూ ఫ్యాన్స్ తెగ సంతోషపడిపోతున్నారు.
‘పఠాన్’ సినిమా సూపర్ హిట్ తర్వాత షారుఖ్ నుంచి వస్తున్న సినిమా 'జవాన్'. సౌత్ స్టార్ దర్శకుడు అట్లీ రూపొందిస్తున్న ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ మధ్య విడుదలైన గ్లింప్స్ సినిమా స్థాయిని అమాంతం పెంచేశాయి. ‘పఠాన్’ సినిమా భారీ వసూళ్లు సాధించిన నేపథ్యంలో ‘జవాన్’ పై మరింత ఆసక్తి నెలకొంది.
అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘జవాన్’ సినిమాకు సంబంధించిన ఓ యాక్షన్ సన్నివేశం సోషల్ మీడియాలో లీక్ అయ్యింది. ఆ వీడియోలో షారుఖ్ ఖాన్ లుక్ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే విధంగా ఉంది. సిల్వర్ బెల్ట్ తో విలన్స్ ను కొడుతున్న దృశ్యాలు చూసి ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. దీంతో ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో కొన్ని నిమిషాల్లోనే వైరల్ అయింది. దాంతో షారుఖ్ ఖాన్ నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ప్రతినిధులు రంగంలోకి దిగి వెంటనే ఆ వీడియోను తొలగించేలా చర్యలు తీసుకుంది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడా ఆ వీడియో లేదు. అప్పటికే చాలా మంది ఫ్యాన్స్ వీడియోను చూసేశారు. ‘జవాన్’ సినిమా.. ‘పఠాన్’ కు ఏమాత్రం తగ్గకుండా ఉంటుందని ఆ చిన్న వీడియోను చూస్తుంటేనే అర్థం అవుతోందని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కచ్చితంగా ఈ సినిమా కూడా రూ.1000 కోట్లతో రికార్డులను సృష్టించబోతుందని అభిప్రాయపడుతున్నారు.
నయనతార బాలీవుడ్ ఎంట్రీ
షారుఖ్ ఖాన్ మొదటి సారి తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఇప్పటి వరకు అట్లీ రూపొందించిన చిత్రాలన్నీ కూడా భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. కేవలం కమర్షియల్ సినిమాలే కాకుండా అట్లీ మంచి మెసేజ్ ఓరియంటెడ్ కథలతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేశారు. కాబట్టి అట్లీ మీద ఉన్న నమ్మకం, షారుఖ్ ఖాన్, నయనతార, విజయ్ సేతుపతి, ప్రియమణి, యోగిబాబు ఇంకా పలువురు స్టార్స్ నటించడం వల్ల ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంతేగాకుండా ఇందులో చాలామంది సౌత్ స్టార్స్ ఉన్నందున సౌత్ ఇండియాలో కూడా మంచి సక్సెస్ దక్కించుకుంటుందని యూనిట్ సభ్యులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాతో లేడీ సూపర్ స్టార్ నయనతార బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతుంది. ‘జవాన్’ సినిమాను 2 జూన్, 2023న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.
తమిళ సూపర్ స్టార్ విజయ్ అతిథి పాత్రలో నటించబోతున్నారు. అంతేగాకుండా తెలుగు స్టార్ హీరో ఒకరు కూడా గెస్ట్ రోల్ లో నటించబోతున్నట్లుగా ఇటీవల వార్తలు వచ్చాయి. త్వరలోనే ఆ విషయమై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకునే కూడా ఈ సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించబోతుందనే వార్తలు జోరుగా వస్తున్నాయి. ఇంకా ఎంతో మంది పాన్ ఇండియా స్టార్స్ ఈ సినిమాలో సందడి చేయబోతున్నారని బాలీవుడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
Read Also: ‘ఉ అంటావా’ పాటకు అక్షయ్, నోరా ఫతేహీ డ్యాన్స్ - బన్నీ, సామ్‌లను దింపేశారుగా, ఇదిగో వీడియో