రెండున్నర గంటలు మాట్లాడితే... అందులో విషయం అంతా వదిలేసి, రెండు నిమిషాల క్లిప్ తీసుకుని ఎవరు పడితే వాళ్ళు రియాక్ట్ అవుతున్నారని దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ (Tammareddy Bharadwaj) తెలిపారు. ఇటీవల జాతీయ పురస్కార గ్రహీత రాజేష్ టచ్‌రివర్ నిర్వహించిన ఓ సెమినార్‌కు ఆయన అటెండ్ అయ్యారు. అందులో 'ఆర్ఆర్ఆర్' సినిమాపై తమ్మారెడ్డి భరద్వాజ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.
తమ్మారెడ్డి భరద్వాజపై దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పరుష పదజాలంతో దూషించడం స్టార్ట్ చేశారు. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు, మెగా బ్రదర్ కొణిదెల నాగబాబు సైతం స్పందించడంతో వివాదం మరింత రాజుకుంది. ముఖ్యంగా రాయలేని భాషలో నాగబాబు ట్వీట్ చేశారు. ఈ గొడవ పెద్దగా మారుతుండడంతో తమ్మారెడ్డి ఓ వీడియో విడుదల చేశారు.
నాకు సంస్కారం ఉంది! - తమ్మారెడ్డి
రెండున్నర గంటలు మాట్లాడిన విషయం చూసి రియాక్ట్ అయితే బాగుండేదనే అభిప్రాయం తమ్మారెడ్డి భరద్వాజ మాటల్లో వ్యక్తం అయ్యింది. ఒకరు లెక్కలు అంటున్నారని, మరొకరు ఇంకొకటి అంటున్నారని, ఆ మాటలు బాధించాయని ఆయన చెప్పుకొచ్చారు.
Also Read : వింతైన ప్రేమాయణం, త్వరలో ప్రెస్‌మీట్ పెట్టి అన్నీ చెబుతా - పెళ్లి ప్రశ్నలపై నరేష్
''చాలా అసహ్యంగా, అసభ్యంగా ఉంది. నేను ఆ విధంగా రియాక్ట్ అవ్వాలంటే అవ్వొచ్చు. కానీ, సంస్కారం అడ్డం వస్తోంది. వాళ్ళ సంస్కారం వాళ్ళది. నా సంస్కారం నాది. దానిపై నేను రియాక్ట్ కావాలని అనుకోవడం లేదు. నేను చెప్పాలనుకున్నది యూట్యూబ్ లో వీడియో పోస్ట్ చేశా. మళ్ళీ ఆవేశపడి ఆరోగ్యం చెడగొట్టుకోవడం ఎందుకు? ఇప్పుడు నాకు ఐడెంటిటీ క్రైసిస్ లేదు. నన్ను టార్గెట్ చేసి వాళ్ళ ఐడెంటిటీ పెంచుకోవాలని అనుకుంటున్నారేమో నాకు తెలియదు. దీన్ని పెంచి పోషించాల్సిన అవసరం లేదు. మూడు రోజుల క్రితం భారత దేశానికి గౌరవం తెస్తున్న రాజమౌళిని మనం అభినందించాలని ఓ వీడియో చేశా. 99 శాతం అవార్డు మనకు వస్తుందని చెప్పా. ఆస్కార్ అనేది కలలో కూడా ఎవరూ ఊహించలేదని, అటువంటిది ఆస్కార్ బరిలో మన సినిమా పాట నిలిచిందని చెప్పా. ఆ రోజు ఎవరూ భలే చెప్పానని అభినందించిన వాళ్ళు ఎవరూ లేరు. ఏదో సెమినార్ లో చేసిన వ్యాఖ్యలు పట్టుకుని లెక్కలు, తల్లిదండ్రుల వరకూ వెళ్లారు. బూతులు మాట్లాడటం నాకూ వచ్చు. అయితే, అవసరం లేదు. నా తల్లిదండ్రులు సంస్కారంతో పెంచారు. అది కోల్పోవడం నాకు ఇష్టం లేదు'' అని తమ్మారెడ్డి భరద్వాజ లేటెస్టుగా విడుదల చేసిన వీడియోలో పేర్కొన్నారు.
Also Read : : గుండెల్లో దేశాన్ని నింపుకొని, భారతీయుడిగా ఆస్కార్స్ రెడ్ కార్పెట్ మీద నడుస్తా - ఎన్టీఆర్
తమ్మారెడ్డి అసలు ఉద్దేశం ఏమిటి?
'నాటు నాటు...' పాటకు ఇంకా ఆస్కార్ రాలేదు. కానీ, అవార్డు రావడం ఖాయమని అందరూ భావిస్తున్నారు. అయితే, ఆ అవార్డు వేడుకకు వెళ్ళడానికి 'ఆర్ఆర్ఆర్' టీమ్ ఫ్లైట్ టికెట్లకుపెట్టిన ఖర్చుతో ఎనిమిది సినిమాలు తీయవచ్చని తమ్మారెడ్డి భరద్వాజ చెప్పారు.'ఆర్ఆర్ఆర్' టీమ్ 80 కోట్లు చేసిందని తమ్మారెడ్డి కామెంట్స్ చేసిన కార్యక్రమంలో దర్శకుడు రాజమౌళి గురించి గొప్పగా మాట్లాడారు. అయితే, సోషల్ మీడియాలో ఆ వ్యాఖ్యలకు పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు. 'బాహుబలి' కోసం ఆ రోజుల్లో 200 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని, బుర్ర ఉన్నవాళ్లు ఎవరూ ఆ విధంగా చేయరని, కానీ రాజమౌళి అనుకున్నది సాధించాడని తమ్మారెడ్డి పొగిడారు. మంచి కథ ఉంటే ఈ రోజుల్లో బడ్జెట్ అనేది పెద్ద సమస్య కాదన్నారు.