Thandel Collections Day 1 Prediection: నాగ చైతన్య కెరీర్‌లోనే హయ్యెస్ట్ - 'తండేల్' మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ జోరు, ఎన్ని కోట్లో తెలుసా?
Thandel Box Office Collections: నాగచైతన్య 'తండేల్' మూవీ అడ్వాన్స్ బుకింగ్స్‌లోనూ సత్తా చాటుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు కన్నడ, హిందీ ప్రాంతాల్లోనూ ఇప్పటివరకూ 30 శాతం ఆక్యుపెన్సీ నమోదైనట్లు సమాచారం.

Thandel Day 1 Collection Prediction: నాగచైతన్య (Naga Chaitanya), సాయి పల్లవి జంటగా నటించిన తాజా చిత్రం 'తండేల్' (Thandel). ఈ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహించగా.. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ నిర్మించారు. సముద్ర నేపథ్యంలో సాగే ఈ సినిమా ప్రేమ కథతో పాటు సర్వైవల్ డ్రామాగా తెరకెక్కింది. శుక్రవారం (ఫిబ్రవరి 7) ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానుంది. చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చగా.. బన్నీ వాస్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ మూవీగా నిలిచింది. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్‌లో చిత్ర బృందం బిజీబిజీగా ఉంది.
అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్లు ఎంతంటే..?
ఈ సినిమాకు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్‌కు మంచి స్పందన లభిస్తున్న ట్రేడ్ వర్గాలు తెలిపాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు కన్నడ, హిందీ ప్రాంతాల్లోనూ ఇప్పటివరకూ 30 శాతం ఆక్యుపెన్సీ నమోదైనట్లు సమాచారం. సుమారు వెయ్యికి పైగా షోలు ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అటు, అమెరికాలోనూ భారీగానే అడ్వాన్స్ బుకింగ్ నమోదవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను 300 లొకేషన్లలో.. 600 షోలను స్క్రీనింగ్ చేయనున్నారు. ఇప్పటికే దాదాపు 7 వేల టికెట్లు అమ్ముడుపోయాయి. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా సుమారుగా రూ.90 లక్షలు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
అమెరికాలో ప్రీమియర్స్ ముగిసే సమయానికే 'తండేల్' భారీ కలెక్షన్లు రాబడుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రీమియర్స్, అడ్వాన్స్ బుకింగ్స్ కలిసి ఈ సినిమాకు దాదాపు రూ.2.70 కోట్లు వసూళ్లు రాబడుతుందని అంచనా వేస్తున్నారు. పాజిటివ్ టాక్ వస్తే ఈ నెంబర్స్ మరింత పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు.
అటు, ఏపీ ప్రభుత్వం సైతం తాజాగా 'తండేల్' టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతిచ్చింది. చిత్ర బృందం విజ్ఞప్తి మేరకు ధరలు పెంచుకునేలా అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సింగిల్ స్క్రీన్స్‌లో జీఎస్టీతో కలిపి రూ.50, అదే మల్టీఫ్లెక్స్‌ల్లో జీఎస్టీతో కలిపి రూ.75 పెంచుకునేలా వీలు కల్పించింది. సినిమా విడుదలైన నాటి నుంచి వారం పాటు అదనపు ధరలు అమల్లో ఉంటాయి.
నాగచైతన్య కెరీర్‌లోనే బిగ్ బడ్జెట్ సినిమాగా..
ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన పలువురు మత్స్యకారులు వేటకు వెళ్లి.. పాకిస్థాన్ కోస్ట్ గార్డుకు చిక్కి రెండేళ్లు జైలు శిక్ష అనుభవించిన ఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దర్శకుడు చందూ మొండేటి భావోద్వేగాలకు ప్రేమకథను ముడిపెట్టి దేశభక్తి అంశాలను మేళవించి సినిమాను రూపొందించినట్లు తెలుస్తోంది. కాగా.. నాగచైతన్య కెరీర్‌లోనే బిగ్ బడ్జెట్ సినిమాకు 'తండేల్' తెరకెక్కింది. సుమారు రూ.75 కోట్లతో ఈ చిత్రాన్ని తెరకెక్కించామని నిర్మాత బన్నీ వాసు పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. సముద్రంలో తుపానుకు సంబంధించిన సన్నివేశాలకే దాదాపు రూ.18 కోట్లు ఖర్చైందని.. ఇవి సినిమాకే హైలైట్‌గా ఉంటాయని తెలిపారు. అటు, శ్రీకాకుళం యాసలో మాట్లాడేందుకు ప్రత్యేక ట్యూషన్ తీసుకున్నానని.. ఇదొక మంచి ప్రేమకథగా ప్రేక్షకుల మదిలో నిలిచిపోతుందని నాగచైతన్య తెలిపారు.
అందుకే సాయిపల్లవి..
మరోవైపు, ఈ చిత్రంలో సాయిపల్లవి (Sai Pallavi) ఎంపిక తన నిర్ణయమే అని అల్లు అరవింద్ తెలిపారు. 'ముంబయి నుంచి వచ్చిన వైట్ స్కిన్ అమ్మాయిలు ఈ పాత్రకు జీవం తీసుకురాలేరనిపించింది. ఇది ఎన్నో భావోద్వేగాలతో కూడిన పాత్ర. ప్రేక్షకులకు చిరకాలం గుర్తుండిపోతుంది. ఇలాంటి గొప్ప పాత్రను నిజాయతీగా చేయాలి. సాయిపల్లవి అయితేనే వంద శాతం న్యాయం చేయగలరని నాకు అనిపించింది. ఆమె అసాధారణ నటి. అందుకే ఆమెను ఎంపిక చేశాం. తాము అనుకున్నట్లుగానే ఈ పాత్రకు ఆమె వంద శాతం న్యాయం చేసింది.' అని పేర్కొన్నారు.