Pattudala Movie Review - పట్టుదల రివ్యూ: హాలీవుడ్ స్టైల్‌లో అజిత్ యాక్షన్ ఫిల్మ్ - హిట్టా? ఫట్టా?
Pattudala Movie Review Telugu: అజిత్ కుమార్ హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ ఫిల్మ్ 'పట్టుదల' (తమిళంలో 'విడాముయర్చి'). తెలుగు, తమిళ భాషల్లో ఈ రోజు విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది? అనేది చూడండి.

మగిళ్ తిరుమేని
అజిత్, త్రిష, అర్జున్, రెజీనా తదితరులు
Ajith Kumar's Vidaamuyarchi movie review in Telugu: యాక్షన్ ఫిలిమ్స్ చేయడంలో అజిత్ కుమార్ స్టైల్ సపరేట్. స్వతహాగా కార్ రేసర్ కావడంతో డూప్ లేకుండా ఛేజింగ్ సీక్వెన్సులు చేయడం ఆయనకు అలవాటు. హాలీవుడ్ తరహాలో స్టైలిష్ అండ్ స్లీక్ యాక్షన్ ఫిలిమ్స్ చేసి విజయాలు అందుకున్నారు. ఆయన హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ ఫిల్మ్ 'పట్టుదల'. తమిళంలో తెరకెక్కిన 'విడాముయర్చి'కి తెలుగు అనువాదం ఇది. ఇందులో త్రిష హీరోయిన్. యాక్షన్ కింగ్ అర్జున్, రెజీనా ప్రధాన పాత్రలు పోషించారు. మగిళ్ తిరుమేని దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందించారు. ఈ సినిమా ఎలా ఉంది?
కథ (Pattudala 2025 movie story): అర్జున్ (అజిత్ కుమార్), కాయల్ (త్రిష) ప్రేమ వివాహం చేసుకున్నారు. భర్త తనకు అటెన్షన్ ఇవ్వడం లేదని భార్య బాధ పడటమే కాదు, మరొక వ్యక్తితో ప్రేమలో పడుతుంది. తనకు ఎఫైర్ ఉందని డివోర్స్ కావాలని భర్తను అడుగుతుంది. విడాకులు మంజూరు అయ్యేవరకు పుట్టింట్లో ఉంటానని కోరుతుంది. భార్యాభర్తలు ఇద్దరూ కారులో బయలు దేరతారు.
పెట్రోల్ పంప్ దగ్గర ఆగినప్పుడు అక్కడ ఉన్న సూపర్ మార్కెట్టులో కాయల్‌కు దీపికా (రెజీనా), రక్షిత్ (అర్జున్) దంపతులతో పరిచయం అవుతుంది. ఏదో సాంకేతిక లోపం వల్ల హైవేలో కారు ఆగిపోతుంది. అప్పుడు రక్షిత్, దీపికల ట్రక్ ఎక్కుతుంది కాయల్. కారు రిపేర్ చేసుకుని వెళ్లిన అర్జున్ షాక్ తింటాడు. ట్రక్కులో కాయల్ లేదు. అర్జున్ ఎవరో తనకు తెలియదని, అతడిని తొలిసారి చూస్తున్నానని రక్షిత్ చెబుతాడు.
కాయల్ ఏమైంది? భార్య ఆచూకీ తెలుసుకోవడం కోసం అర్జున్ ఏం చేశాడు? అర్జున్ ఎవరో తనకు తెలియదని రక్షిత్ ఎందుకు చెప్పాడు? దీపిక ఏమైంది? భార్యాభర్తలను హైవేలో ఇబ్బంది పెట్టిన ఆకతాయిలు ఎవరు? కాయల్ కిడ్నాప్ వెనుక ఎవరు ఉన్నారు? చివరకు ఏమైంది? ప్రాణాలకు తెగించి అర్జున్ ఎటువంటి ఫైట్ చేశాడు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ (Pattudala Review Telugu): అమెరికన్ క్రైమ్ థ్రిల్లర్ 'బ్రేక్ డౌన్' ఆధారంగా 'పట్టుదల' (విడాముయర్చి) తెరకెక్కింది. హాలీవుడ్ స్టైల్ ఫిల్మ్ మేకింగ్, ఫ్రేమింగ్‌తో సినిమా చేయాలనుకోవడంలో తప్పు లేదు. రీమేక్ చేయడం తప్పు కాదు. కానీ, మన ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా కథ చెప్పారా? లేదా? అనేది ముఖ్యం. ఓటీటీలకు భారతీయులు సైతం అలవాటు పడ్డాక, హాలీవుడ్ సినిమాలు చూడటం మొదలు పెట్టిన తర్వాత రీమేక్ వంటివి చేయడం కరెక్టా? కాదా? అనేది మరీ మరీ ముఖ్యం.
దర్శకుడు మగిళ్ తిరుమేని మేకింగ్ బావుంది. ఓం ప్రకాష్ సినిమాటోగ్రఫీ కూడా! ఆ విజువల్స్ చూస్తే... హాలీవుడ్ స్టైల్ ఫీల్ తెప్పించారు. తమిళ, తెలుగు నేటివిటీతో కూడిన కథలకు ఇంగ్లీష్ లిరిక్స్‌తో సాంగ్స్ చేయడం అనిరుధ్ స్టైల్. స్క్రీన్ మీద హాలీవుడ్ స్టైల్ యాక్షన్ సీన్స్ ఉండటంతో ఆ తరహా మ్యూజిక్ చేశారు. టెక్నికల్ పరంగా సినిమాలో స్టాండర్డ్స్ ఉన్నాయి. కానీ, ఎమోషనల్ పరంగా ఆడియన్స్ కనెక్ట్ అయ్యేంత సోల్ లేదు.
తెలుగు, తమిళ ప్రేక్షకులు అలవాటు పడిన కమర్షియల్ హంగుల జోలికి మగిళ్ తిరుమేని వెళ్ళలేదు. అలాగని రేసీ యాక్షన్ థ్రిల్లర్ తీయలేదు. ఆయన రచన - దర్శకత్వంలో తడబాటు కనిపించింది. కథలోకి వెళ్లడానికి ఎక్కువ టైమ్ తీసుకున్నారు. అజిత్, త్రిష మధ్య ప్రేమ - పెళ్లి కథలో సోల్ లేదు. అందువల్ల, త్రిష మిస్ అయినప్పుడు అజిత్ పడే బాధను ప్రేక్షకులు ఫీల్ అవ్వలేరు. ఆల్మోస్ట్ గంట పాటు ఆ కథ సాగింది. తర్వాత వచ్చే ఛేజింగ్ / యాక్షన్ సీక్వెన్సులు, ట్విస్టులు కొంత ఆసక్తిగా సాగినా ఇంటర్వెల్ తర్వాత ప్రిడిక్టబుల్ స్టోరీ, స్క్రీన్ ప్లే కావడంతో 'వావ్' మూమెంట్స్ ఏవీ లేకుండా సినిమా చప్పగా సాగింది. క్రైమ్ ఎలిమెంట్ కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ చేయలేదు.
తెలుగు డబ్బింగ్ విషయంలో అసలు కేర్ తీసుకోలేదు. విధానం బదులు విధం అని పలకడం ఏంటో? నెలలు బదులు మాసాలు అనడం ఏమిటో? ఇప్పుడు మాసం అని ఎవరు అంటున్నారు? హీరో హీరోయిన్లకు డబ్బింగ్ ఆర్టిస్టులు సెలక్షన్ కూడా బాలేదు. ఈ తరహా డబ్బింగ్ చెప్పిస్తే అజిత్ నెక్స్ట్ సినిమాలకు ఆడియన్స్ ఎవరూ రారు.
యాక్షన్ సీక్వెన్సుల్లో అజిత్ కుమార్ అసలు తగ్గలేదు. ఈ సినిమా కోసం ఒక ఛేజింగ్ సీక్వెన్స్ చేసేటప్పుడు యాక్సిడెంట్ అయ్యింది. ఆ గ్లింప్స్ కొంత కనబడుతుంది. యాక్షన్ పరంగా ఎప్పటిలా బాగా చేశారు. అయితే, అజిత్ యంగ్ లుక్ మాత్రం అందరికీ సర్‌ప్రైజ్. చాలా బావుంది. అజిత్ హ్యాండ్సమ్‌గా ఉన్నారు. త్రిష తన పాత్ర పరిధి మేరకు చేశారు. అర్జున్, రెజీనా క్యారెక్టర్స్ ఫ్లాష్‌బ్యాక్ స్టోరీస్ బాలేదు. ఆయా పాత్రల్లో వాళ్ళ నటన ఓకే.
'పట్టుదల' కథకు, తన పాత్రకు ఏం కావాలో అది చేశారు అజిత్. ఆయన యాక్టింగ్, స్టైల్ బావున్నాయి. సినిమా మేకింగ్ కూడా స్టయిలిష్‌గా ఉంది. అయితే, ఈ కథను మగిళ్ తిరుమేని చెప్పిన తీరు అసలు ఆకట్టుకునేలా లేదు. అనిరుధ్ సంగీతంలో మెరుపులు లేవు. అజిత్ వీరాభిమానులను సైతం డిజప్పాయింట్ చేస్తుంది. సో, థియేటర్లకు వెళ్లే ముందు ఆలోచించుకోండి.