తెలుగులో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ప్రయాణం ప్రారంభమై ఎంతో కాలం కాలేదు. అయితేనేం? 'వెంకీ మామ', 'ఓ బేబీ', 'ధమాకా', 'కార్తికేయ 2' విజయాలతో అతి తక్కువ కాలంలో అగ్ర నిర్మాణ సంస్థగా ఎదిగింది. పాతిక చిత్రాల మైలురాయి చేరుకుంది. ఈ జూలై 29న విడుదల కానున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'బ్రో' ఆ సంస్థలో 25వ సినిమా. ఇక, ఈ వారం రెబల్ స్టార్ ప్రభాస్ 'ఆదిపురుష్'ను తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ మీడియాతో ముచ్చటించారు. 'ఆదిపురుష్'తో పాటు తమ సంస్థలో సినిమాల గురించి ఆయన చెప్పిన విశేషాలు ఆయన మాటల్లో...
ప్రభాస్ (Prabhas)తో మంచి అనుబంధం
''ఆదిపురుష్' సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ట్రైలర్ బాగుంది. బాక్సాఫీస్ బరిలో ఖచ్చితంగా సంచలనాలు సృష్టిస్తుందని భావించాం. మార్కెట్ లెక్కలు వేసుకుని రూ. 165 కోట్లు ప్లస్ జీఎస్టీకి తెలుగు హక్కులను తీసుకున్నాం. ప్రభాస్ గారి 'స్పిరిట్'ని కూడా తెలుగులో మేమే విడుదల చేస్తాం. భవిష్యత్తులో టి సిరీస్ నిర్మించే సినిమాలను ఓ అవగాహనతో తెలుగులోకి తీసుకొచ్చే ఆలోచన ఉంది. ప్రభాస్ గారు అందరితో మంచిగా ఉంటారు. ఆయనతో మాకు మంచి అనుబంధం ఏర్పడటం మా అదృష్టం. 'ఆదిపురుష్' ప్రీ రిలీజ్ వేడుకలో మిమ్మల్ని తమ కుటుంబ సభ్యుడిగా పేర్కొనడం మా అదృష్టం''
ఫ్లాపులు వస్తే ఆ తప్పులు రిపీట్ కాకుండా...
''మేం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థను ఫ్యాక్టరీ మోడల్ విధానంలో స్టార్ట్ చేశాం. మా అదృష్టం ఏమిటంటే... విజయాల శాతం ఎక్కువగా ఉంది. అయితే... ఇండస్ట్రీలో జయాపజయాలు ఉంటాయి. అవన్నీ ఆలోచించి సినిమా రంగంలో అడుగు పెట్టాం. ఫ్లాప్స్ వస్తే... మళ్ళీ ఆ తప్పులు రిపీట్ కాకుండా ఉండేలా కృషి చేస్తాం. అదొక లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్. మంచి సినిమాలు అందించడానికి ప్రయత్నిస్తాం''
విడుదల విషయంలోనే సవాళ్ళు
''పవన్ కళ్యాణ్ గారి 'బ్రో' మా సంస్థలో 25వ సినిమా. మరో నాలుగైదు సినిమాల నిర్మాణం పూర్తి అయ్యింది. వచ్చే ఏడాది ఆఖరుకి 50 సినిమాల లక్ష్యాన్ని చేరుకుంటాం. ప్రస్తుతం మా సంస్థలో 15కు పైగా సినిమాలు నిర్మాణ దశలో ఉన్నాయి. ప్రతి సినిమాకు ఓ ప్లాన్ ఉంది. దాని ప్రకారం ముందుకు వెళ్తాం. వేగంగా వంద సినిమాలు పూర్తి చేయాలని మేం ఓ లక్ష్యం పెట్టుకున్నాం. అది ఇటీవల పెట్టుకున్నది. ఎక్కువ సినిమాలు చేయడం వల్ల క్రియేటివిటీ పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. విడుదల సమయంలో మాత్రం కొన్ని సవాళ్లు ఎదురు అవుతాయి. ఒక నెలలో రెండు మూడు సినిమాలు విడుదల చేయడం కష్టమే''.
ఓటీటీ ఆదాయం వల్లే వంద సినిమాలు
''ఓటీటీ రాకతో నిర్మాణ సంస్థలు అదనపు ఆదాయం చేకూరుతోంది. నిజం చెప్పాలంటే... దాని వల్లే మేం వంద సినిమాలు చేయబోతున్నాం. థియేట్రికల్ బిజినెస్ మీద మాత్రమే ఆధారపడితే... వంద సినిమాలు చేయడం సాధ్యం కాదు. ఓటీటీ బిజినెస్ కూడా ఇప్పుడు చాలా కీలకం. అందుకే వచ్చే ఏడాదిన్నరలో మరో 25 సినిమాలు చేస్తామని ధైర్యంగా చెప్పగలుగుతున్నా''.
ఆరు నెలల్లో 50వ సినిమా ప్రకటన
''మా 50వ సినిమా ప్రకటన ఆరు నెలల్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. పాన్ వరల్డ్, హాలీవుడ్ సినిమాలు చేయాలనేది మా లక్ష్యం. అయితే, ఇంత తక్కువ వ్యవధిలో హాలీవుడ్ ప్రాజెక్ట్ సాధ్యం కాదు. నిజానికి, కొవిడ్ కంటే ముందు అమెరికాలో ఓ స్టూడియో ఏర్పాటు చేశాం. కానీ, కరోనాతో పాటు వివిధ కారణాల వల్ల పనులు ముందుకు సాగలేదు. వచ్చే మూడేళ్ళలో తప్పకుండా హాలీవుడ్ సినిమా చేస్తాం''
సమయం వచ్చినప్పుడు చెబుతాం
''ప్రతి సినిమాకు ఓ ప్లాన్ ఉంటుంది. సమయం వచ్చినప్పుడు ఆ సినిమా ప్రకటిస్తాం. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో చేస్తున్న సినిమా వివరాల్ని సైతం సమయం వచ్చినప్పుడు చెబుతాం. ఇప్పటికి అయితే చెప్పలేం''
Also Read : అమెరికాలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు అడ్డం పడిన తెలుగు కమ్యూనిటీ