'సినిమా బండి', 'ముఖ చిత్రం' సినిమాలతో పేరు తెచ్చుకున్న యువ హీరో వికాష్ వశిష్ఠ (Vikas Vasishta). ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 'నీతోనే నేను' (Neethone Nenu Movie). సీత రామ్ ఆయేషా... అనేది ఉప శీర్షిక. అంజి రామ్ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో మోక్ష‌, కుషిత క‌ళ్ల‌పు (Kushita Kallapu) కథానాయికలు. శ్రీ మామిడి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఎమ్‌. సుధాక‌ర్ రెడ్డి నిర్మిస్తున్నారు. 


గురువు గొప్పతనం చెప్పే పాట
'నాతో నేను' సినిమాలో గురువు గొప్పతనం చాటి చెప్పేలా ప్రముఖ కవి, గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ (Suddala Ashok Teja) 'గురుః బ్ర‌హ్మ గురుః విష్ణు' పాట రాశారు. టీచర్స్ డే సందర్భంగా ఆ పాటను విడుదల చేశారు. 


'ఎదిగి పేరు తెస్తావని నాన్న కోరుకోవచ్చు...
పెరిగి తనను చూస్తావని అమ్మ ఆశించవచ్చు... 
ఏమిస్తావనిరా... నీ లేత వేళ్లకు రాత రాయ నేర్పి నాడు!
ఏమొస్తుందనిరా... నీ పెదవులతో శ్లోకం పలికించి నాడు!
ఏమీ ఆశించకనే... ఏదీ బదులు అడకనే... 
నీ మెదడు బీడున బీజాక్షరాలు నాటి నాడు'


అంటూ సాగిన ఈ గీతాన్ని ప్రముఖ గాయకులు మనో ఆలపించారు. కార్తీక్ బి కొడకండ్ల సంగీతం అందించారు. అఖిల్ చంద్ర, శ్రీ ధృతి, గాయత్రీ సింధూజ బ్యాగ్రౌండ్ వోకల్స్ అందించారు.


Also Read : 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' ఆడియన్స్ రివ్యూ - అనుష్క కమ్‌బ్యాక్ హిట్టు, హీరోకి హ్యాట్రిక్కు!






ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా వికాస్ వశిష్ఠ
ఈ సినిమాలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా వికాస్ వశిష్ఠ నటిస్తున్నారు. చిత్ర నిర్మాత ఎమ్. సుధాకర్ రెడ్డి సినిమా గురించి ''రామ్ ఓ గవర్నమెంట్ టీచర్. విద్యా బోధన, వ్యవస్థలోని లోపాలను హీరో సరిదిద్దే విధంగా సినిమా కథ ఉంటుంది. మంచి సమాజం కావాలంటే గొప్ప టీచర్స్ కావాలి. గురువుల వ‌ల్లే అది సాధ్యం అవుతుంది. అటువంటి ఉపాధ్యాయుల గొప్ప‌తనాన్ని తెలియ‌జేసేలా సుద్దాల అశోక్ తేజ‌ గారు మంచి పాట రాశారు. మనో గారు అంతే అద్భుతంగా పాడారు. ఈ పాట‌ను టీచ‌ర్స్ డే సంద‌ర్భంగా విడుద‌ల చేయ‌టం ఎంతో సంతోషంగా ఉంది. నేను కూడా ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడినే. టీచర్ పాత్రకు వికాస్ వశిష్ఠ వంద శాతం న్యాయం చేస్తున్నారు. సీత పాత్రలో మోక్ష, ఆయేషాగా కుషిత కనిపిస్తారు. చిత్రీకరణ, పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో సినిమా విడుదల తేదీ వెల్లడిస్తాం. కార్తీక్ గారు అద్భుతమైన సంగీతం అందిస్తున్నారు'' అని చెప్పారు.


Also Read : పబ్లిగ్గా నరేష్‌కు ముద్దు పెట్టిన పవిత్రా లోకేష్ - మీరు చూశారా?



దర్శకుడిని నమ్మి ఈ సినిమా చేస్తున్నట్లు హీరో వికాస్ వశిష్ఠ తెలిపారు. కార్తీక్ బి కొడకండ్ల మంచి పాటలు ఇచ్చారని, హీరోయిన్ కుషిత కళ్లపుతో పాటలకు డ్యాన్స్ చేయడం అంత సులభం ఏమీ కాదని ఆయన పేర్కొన్నారు.  


వికాస్ వశిష్ఠ, మోక్ష‌, కుషిత కళ్లపు హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో అకెళ్ల ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం : ముర‌ళీ మోహ‌న్, సంగీతం :  కార్తీక్ బి. క‌డ‌గండ్ల‌, నిర్మాత‌ : ఎమ్‌. సుధాక‌ర్ రెడ్డి, ద‌ర్శ‌క‌త్వం : అంజి రామ్‌. 


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial