Emraan Hashmi And Tanushree Dutta: ఆన్ స్క్రీన్ ఒక హీరో, హీరోయిన్ కెమిస్ట్రీ బాగుందంటే చాలు.. వారిపై రకరకాలుగా కామెంట్స్ వస్తూనే ఉంటాయి. వారు ఆఫ్ స్క్రీన్ డేటింగ్ చేస్తున్నారని, లవ్‌లో ఉన్నారని.. ఇలా చాలారకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు కొందరు ప్రేక్షకులు. అలాగే ఒకప్పుడు ఒక బాలీవుడ్ జోడీ కూడా అలాంటి కామెంట్స్‌ను ఎదుర్కుంది. ఒకప్పుడు వారిద్దరూ కలిసి చేసిన సినిమా, అందులో పాట ఒక సెన్సేషన్. ఆ పెయిర్ మరెవరో కాదు.. ఇమ్రాన్ హష్మీ, తనుశ్రీ దత్తా. వీరిద్దరూ ఆన్ స్క్రీన్ మంచి కెమిస్ట్రీ ఉన్న జోడీగా పేరు తెచ్చుకున్నారు. తాజాగా ఈ జంటపై వచ్చిన కామెంట్స్‌నపై తనుశ్రీ దత్తా స్పందించింది.


ఆఫ్ స్క్రీన్ అన్నాచెల్లెళ్లు..


ఇమ్రాన్ హష్మీ, తనుశ్రీ దత్తా కలిసి ‘ఆషిఖ్ బనాయా ఆప్నే’, ‘చాక్లెట్’, ‘గుడ్ బాయ్ బ్యాడ్ బాయ్’ లాంటి హిట్ చిత్రాల్లో నటించారు. ఈ సినిమాల్లో ఇమ్రాన్‌తో వర్కవుట్ అయిన కెమిస్ట్రీకి, తన బోల్డ్ యాక్టింగ్‌కు చాలా ట్రోల్స్‌ను ఎదుర్కుంది. ఆ ట్రోల్స్‌పై తనుశ్రీ ఘాటుగానే స్పందించింది. ‘‘పెద్ద పెద్ద టాప్ నటీమణులు కూడా కిస్ సీన్స్, బోల్డ్ సీన్స్‌లో నటించారు. వారిని ఎవరూ ఏమనరు. కానీ నేను మాత్రం చాలా కష్టాలు ఎదుర్కున్నాను. నేను పొట్టి బట్టలు వేసుకున్నా, బోల్ట్ సీన్ చేసినా అందరికీ ప్రాబ్లమే. అది కేవలం యాక్టింగ్. నాకు, ఇమ్రాన్‌కు మధ్య పర్సనల్‌గా ఏం లేదు. నాది, తనది అన్నాచెల్లెళ్ల లాంటి అనుబంధం’’ అని చెప్పుకొచ్చింది తనుశ్రీ దత్తా.


ఇమ్రాన్ స్పందన..


ఇక తనుశ్రీ దత్తా చేసిన వ్యాఖ్యలకు ఇమ్రాన్ హష్మీ సైతం స్పందించాడు. ‘‘తనుశ్రీ దత్తా చెప్పిన మాటలను మీరు విన్నారా? అది తను మామూలుగా చెప్పిందా ఏంటి అని నాకు తెలియడం లేదు. తను మాది అన్నాచెల్లెళ్ల అనుబంధం అని చెప్పింది’’ అంటూ నవ్వాడు ఇమ్రాన్ హష్మీ. ఇక తాము నటించిన సినిమాలను.. తన స్టేట్‌మెంట్‌తో పోలుస్తూ.. ‘‘అసలు తనకు డైరెక్టర్ ఏం చెప్పుంటాడు? ఆయన నాకేం చెప్పాడు? నా మైండ్‌లో ఆ కథ గురించి వేరే ఐడియా ఉంది. తన మైండ్‌లో దానికి భిన్నంగా పూర్తిగా వేరే ఐడియా ఉన్నట్టుంది. మేము చేసిన సినిమా కథలు అక్రమ సంబంధానికి సంబంధించినవి అని నాకు ఎవరూ చెప్పలేదే. తను అసలు ఏమనుకొని అలా మాట్లాడిందో నాకు తెలియదు’’ అని వ్యంగ్యంగా సమాధానమిచ్చాడు.


ఒకప్పుడు హీరో.. ఇప్పుడు విలన్..


ఒకప్పుడు బాలీవుడ్‌లో రొమాంటిక్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు ఇమ్రాన్ హష్మీ. ప్రేక్షకులంతా తనను సీరియల్ కిస్సర్ అని పిలిచేవారు. అలాంటి రొమాంటిక్ హీరోకు సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. అందుకే విలన్‌గా నటించడానికి కూడా తను వెనకాడడం లేదు. తన దగ్గర వచ్చిన ప్రతీ విలన్ ఆఫర్‌ను తను ఒప్పుకుంటున్నారు. అదే విధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఓజీ’తో విలన్‌గా టాలీవుడ్‌కు పరిచయం కానున్నాడు. ఇప్పటికే ‘ఓజీ’లో నుండి ఇమ్రాన్ ఫస్ట్ లుక్ విడుదల కాగా.. ఇందులో తను పవర్ స్టార్‌కు ధీటైన విలన్‌గా కనిపిస్తున్నాడని ప్రేక్షకులు ప్రశంసించారు.



Also Read: డెడ్‌పూల్ అండ్ వోల్వరైన్ కలెక్షన్స్ ఊచకోత - మూడు రోజుల్లో మూడున్నర వేల కోట్లు!