సినిమా ఇండస్ట్రీలో దక్షిణాది సినిమాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ మధ్య దక్షిణాది నుంచి వస్తోన్న సినిమాలు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్నాయి. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల తర్వాత ప్రేక్షకులు సినిమాను చూసే కోణం కూడా మారింది. అది ఇదీ అని లేకుండా ఏ భాష సినిమా అయినా బాగుంటే చూసేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పాన్ ఇండియా ట్రెండ్ కూడా పెరిగింది. అయితే కొన్ని సినిమాలు అన్ని భాషల్లో ఆకట్టుకుంటుంటే.. కొన్ని సినిమాలు మాత్రం కేవలం స్థానిక భాషల్లో మాత్రమే హిట్ ను అందుకుంటున్నాయి. ఇందుకు ఉదాహరణ క్లాసిక్ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ‘పొన్నియిన్ సెల్వన్’. ఈ సినిమా తమిళనాట భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే తెలుగులో అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు ఈ సినిమా రెండో భాగం ఏప్రిల్ 28న విడుదల అవుతుంది. అయితే, తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు ఎలాంటి బజ్ లేకపోవడంతో సినీ నిర్మాతలు ఇక్కడ రిలీజ్ చేయాలా, వద్దా అనే ఆలోచనలో ఉన్నారు. అయితే, ఈ సందర్భంగా తమిళ మీడియా తెలుగు ప్రేక్షకులపై విమర్శలు గుప్పిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.


తమిళంలో ఉన్న స్టార్ హీరోలలో దాదాపు అందరికీ తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. అందుకే అక్కడ విడుదలయ్యే సినిమాలు దాదాపు ఇక్కడ కూడా విడుదల అవుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమా కూడా తెలుగులో విడుదలైంది. కానీ ఇక్కడ అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇదే అంశంపై ఓ తమిళ జర్నలిస్ట్‌లు దర్శకుడు మణిరత్నం ను ప్రశ్నించారని తెలిసింది. తమిళ సినిమాలను తెలుగు ప్రజలు ఎందుకు సపోర్ట్ చేయడం లేదని ఆయన్ని అడిగారట.


ధీటైన సమాధానం చెప్పిన మణిరత్నం


దీనిపై మణిరత్నం స్పందిస్తూ.. ‘‘మనం తీసే ప్రతీ సినిమాను అందరూ చూడాలి అనుకోవడం సరైనది కాదు. వాస్తవానికి మనం వారిని ప్రశ్నించడం కరెక్ట్ కాదు. ప్రతీ ఒక్కరికీ ఒక్కోరకమైన అభిరుచి ఉంటుంది. ‘పొన్నియిన్ సెల్వన్’ విషయంలో వారి అభిప్రాయం ఇంకోలా ఉంది. అయితే తమ ప్రాజెక్టు పట్ల తాము గర్వంగా, నమ్మకంగా ఉన్నాం. అదే ముఖ్యం’’ అని చెప్పారని తెలిసింది.


నిజంగా తమిళ సినిమాలను తెలుగు ప్రేక్షకులు తొక్కేస్తున్నారా?


వాస్తవానికి తమిళ సినిమాలకు స్థానిక మార్కెట్ ల తర్వాత అత్యధిక వసూళ్లు వచ్చేది తెలుగు మార్కెట్ ల నుంచే. ఈ విషయం అందరికీ తెలిసిందే. అందుకే ఈ మధ్య తమిళ సినిమాలు అన్నీ తెలుగులోనూ ఒకేసారి విడుదల చేసే ప్రయత్నాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే అన్ని సినిమాలు అన్ని చోట్లా ఒకేలా వసూళ్లు రాబట్టలేకపోవచ్చు కూడా. ఉదాహరణకు.. ఐ (మనోహరుడు), 24, అపరిచితుడు, యుగానికి ఒక్కడు లాంటి సినిమాలు తమిళం కంటే తెలుగులోనే పెద్ద హిట్ అయ్యాయి. ఇక పొన్నియిన్ సెల్వన్ విషయంలో అందులో ఉండే కంటెంట్ తెలుగు ప్రేక్షకులకు సరిపోకపోవడం వలనే ఆ రిజల్ట్ వచ్చింది. అందుకే సెకండ్ పార్ట్ తెలుగు పబ్లిసిటీ పై మేకర్స్ అంతగా ఇంట్రస్ట్ చూపించడం లేదు. ఇక్కడ ఎవరూ ఏ సినిమా పై ద్వేషం చూపించరు, సినిమాలో అందరికీ సరిపోయే కంటెంట్ ఉంటే అందరికీ నచ్చుతుంది. అందుకే తమిళ సినిమాలను తెలుగు ప్రేక్షకులు ద్వేషిస్తున్నారు అని చేసే ఆరోపణలు కేవలం హాస్యాస్పదమే అంటున్నారు సినీ నిపుణులు.


ఒకప్పుడు తమిళ సినిమాలనే ఆధరించిన తెలుగు ప్రేక్షకులు


పరభాషా చిత్రాలను అక్కున చేర్చుకొనేది తెలుగు ప్రేక్షకులు మాత్రమే. కంటెంట్ నచ్చితే తమిళం, హిందీ, కన్నడ, మలయాళం అనే తేడాలు చూడరు. చివరికి మరాఠి చిత్రమైనా సరే చూసేస్తారు. తెలుగులోకి డబ్ కాకపోయినా.. సబ్ టైటిల్స్‌తోనైనా చూసేంత సినిమా పిచ్చి మన తెలుగు ప్రేక్షకులకు ఉంది. ఒకప్పుడైతే తెలుగులోకి డబ్బింగైన తమిళ సినిమాలను తెగ చూసేవారు. ముఖ్యంగా దర్శకులు మణిరత్నం, శంకర్ సినిమాలంటే పడి చచ్చిపోయేవారు. ‘జీన్స్’, ‘భారతీయుడు’, ‘రోజా’, ‘పందెం కోడి’, ‘అపరిచితుడు’, ‘రోబో’, ‘ప్రేమ పుస్తకం’, ‘గజినీ’.. నుంచి నేడు ‘ఖైదీ’, ‘24’, ‘మాస్టర్’, ‘విక్రమ్’ వరకు ప్రతి సినిమాను ఆధరించిన పెద్ద మనసు తెలుగు ప్రేక్షకులది. పైగా, తెలుగు హీరోలు కంటే ఎక్కువ ప్రేమించేది కూడా తమిళ హీరోలనే. అజీత్‌కు ఇక్కడ పెద్ద మార్కెట్ లేకపోయినా వ్యక్తిగతం ఆయన్ని ఇష్టపడేవారు చాలామంది ఉన్నారు. అలాగే సూర్య, కార్తీలకు ఇక్కడ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. మరి ఇవన్నీ తమిళ మీడియాకు గుర్తుండే ఉంటుంది. తమిళంలో తెలుగు సినిమాలను ఇప్పుడిప్పుడే ఆధరిస్తున్నారు. ప్రపంచస్థాయి గుర్తింపు పొందిన ‘ఆర్ఆర్ఆర్’, ‘బాహుబలి’ సినిమాలను కూడా తమిళ ప్రేక్షకులు ఇష్టపడ్డారు. అయితే, అక్కడ ఒకరిద్దరు మీడియా పర్శన్స్ అడిగిన ప్రశ్నలను మొత్తం తమిళ మీడియా, ప్రేక్షకులకు ఆపాదించడం కూడా సరైనది కాదు. కాబట్టి, మీడియా ఈ విషయాన్ని పెద్దది చేయకపోవడమే శ్రేయస్కరం.



Read Also: సెన్సార్ రిపోర్ట్: ‘విరూపాక్ష’కు A సర్టిఫికేట్ - సెకండాఫ్ సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడుతుందట!